మళ్లీ అడ్డంగా బుక్కయిన జస్టిస్ ఈశ్వరయ్య

ABN , First Publish Date - 2020-08-10T15:42:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య నియంత్రణ-పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య మరోసారి అడ్డంగా బుక్కయ్యారు.

మళ్లీ అడ్డంగా బుక్కయిన జస్టిస్ ఈశ్వరయ్య

వివరణ ఇవ్వడానికి వచ్చి దొరికిపోయిన జస్టిస్‌ ఈశ్వరయ్య.. బాహాటంగా తప్పు అంగీకారం

ఆడియో టేపులో గొంతు తనదేనని వెల్లడి

అయితే ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ వక్రీకరించిందని ఆరోపణ

బీసీలపై దాడిచేశారని వక్రభాష్యం

విలేకరుల అన్ని ప్రశ్నలకూ దాటవేతలే


హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య నియంత్రణ-పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. సస్పెన్షన్‌లో ఉన్న దళిత జడ్జి రామకృష్ణతో తాను జరిపిన ఫోన్‌ సంభాషణ వివాదం ఇప్పటికే హాట్‌ టాపిక్‌ కాగా.. దానిపై వివరణ ఇచ్చేందుకు ఆదివారం హైదరాబాద్‌లో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. సస్పెండైన జడ్జి రామకృష్ణతో తాను ఫోన్లో సంభాషించిన మాట వాస్తవమేనని బాహాటంగా అంగీకరించారు. అలాగే రామకృష్ణ విడుదల చేసిన ఆడియో టేపులోని గొంతు కూడా తనదేనని ధ్రువీకిరించారు. అయి తే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ తన సంభాషణను వక్రీకరించాయని.. ట్యాంపరింగ్‌, ఎడిట్‌ చేసి ప్రసారం చేశారని, ప్రచురించారని ఆయన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. దానిని ట్యాంపరింగ్‌ చేసి ఉంటే.. ఒరిజినల్‌ ఆడియో బయటపెడతారా అని ప్రశ్నిస్తే ఆయన నుంచి సమాధానం లేదు. సమయం ఇస్తే మొత్తం ఆడియో వినిపిస్తామని చెప్పినా ఆయన కిమ్మనలేదు. పైగా ఆ సంభాషణను బయటపెట్టడం బీసీలపై జరిగిన దాడి అంటూ వక్రభాష్యం చెప్పడానికి ప్రయత్నించారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు జడ్జిగా పనిచేసి రిటైరై.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న జస్టిస్‌ ఈశ్వరయ్య.. జడ్జి రామకృష్ణతో ఫోన్లో సంభాషిస్తూ.. కోర్టులు, న్యాయమూర్తుల పట్ల అభ్యంతరకర భాష వాడిన సంగతి తెలిసిందే. సహచర న్యాయమూర్తులను వాడు-వీడూ అని మాట్లాడారు. దీనిపై వివరణ ఇవ్వడానికి ఆయన ఆదివారం ఇక్కడ మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. రామకృష్ణతో జరిపిన వ్యక్తిగత సంభాషణకు, బీసీలకు సంబంధం ఏమిటనే ప్రశ్నకు ఆయన్నుంచి సమాధానం రాలేదు.


ఏపీ ప్రభుత్వ హోదాలో ఉండి బీసీ కార్డు వాడుకోవడం ఎందుకని అడిగితే చెప్పలేక నీళ్లు నమిలారు. ‘ఏ హోదాలో మీడియా ముందుకొచ్చారు? ప్రభుత్వ పదవిలో ఉండి బీసీ నాయకుడి పేరిట ప్రెస్‌మీట్‌ పెట్టవచ్చా’ అనే ప్రశ్నలకు సూటిగా బదులివ్వలేకపోయారు. విలేకరులు వేసిన చాలా ప్రశ్నలకు జవాబులివ్వడానికి తడబాటుకు లోనయ్యారు. ఒక దశలో జవాబులు చెప్పలేక జస్టిస్‌ ఈశ్వరయ్య లేచి నిల్చున్నారు. సమాధానాల కోసం విలేకరులు పట్టుపట్టడంతో కొద్దిసేపు రసాభాస చోటుచేసుకుంది. చివరకు సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు.


మావోడు ఉచ్చులో పడ్డాడు..

జస్టిస్‌ ఈశ్వరయ్య అర్ధాంతరంగా వెళ్లిపోయాక.. బీసీ ఫెడరేషన్‌ నాయకుడు రామకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ‘మావోడు (జస్టిస్‌ ఈశ్వరయ్య) ఉచ్చులో పడ్డాడు. జస్టిస్‌ నాగార్జునరెడ్డి, జడ్జి రామకృష్ణ మధ్య చాలా కాలంగా ఉన్న వివాదంలో దూరి తప్పు చేశాడు’ అని అన్నారు. 

Updated Date - 2020-08-10T15:42:07+05:30 IST