ఆ వాయిస్‌ నాదే!.. జస్టిస్‌ ఈశ్వరయ్య అంగీకారం

ABN , First Publish Date - 2020-08-10T09:36:45+05:30 IST

సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణతో జరిపిన ఫోన్‌ సంభాషణలో వాయిస్‌ తనదేనని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య నియంత్రణ-పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌, రిటైర్డ్‌

ఆ వాయిస్‌ నాదే!.. జస్టిస్‌ ఈశ్వరయ్య అంగీకారం

  • అయితే వక్రీకరించారని ఆరోపణ
  • జడ్జి రామకృష్ణే నాకు ఫోన్‌ చేశారు
  • ఆయన్ను ఊరడించడానికే మాట్లాడా
  • నా నంబరుతో ఎవరికీ ఎస్సెమ్మెస్‌లు లేవు
  • ఆలిండియా బీసీ ఫెడరేషన్‌ సంస్థాపక
  • అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా
  • ఏపీ ప్రభుత్వ పదవితో సంబంధం లేదు
  • విలేకరుల ప్రశ్నలకు తడబాటు
  • అర్ధంతరంగా ప్రెస్‌మీట్‌ నుంచి నిష్క్రమణ


ఆ లేఖ రాసింది ఆలిండియా బీసీ వర్కింగ్‌ ప్రెసిడెంటు. అదేం సీక్రెట్‌ లెటర్‌ కాదు.. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా పంపాడు. లేఖపై ఈ రోజు మాట్లాడను. సందర్భం కూడా కాదు.


నా తోటి రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ నాగార్జునరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు తగిన సమయం వచ్చినప్పుడు వివరణ ఇస్తా. ఇది సందర్భం కాదు.


హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణతో జరిపిన ఫోన్‌ సంభాషణలో వాయిస్‌ తనదేనని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య నియంత్రణ-పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య అంగీకరించారు. అయితే బలహీన వర్గాలకు చెందిన న్యాయమూర్తిగా.. మరో బలహీన వర్గాలకు చెందిన.. విధుల నుంచి సస్పెండైన జడ్జిని ఊరడించడానికి చేసిన తన సంభాషణలో వాయి్‌సను వక్రీకరించారని, ట్యాంపరింగ్‌ చేశారని ఆరోపించారు. జడ్జి రామకృష్ణతో ఆయన జరిపిన ఆడియో సంభాషణను ‘కోర్టులపై కుట్రలు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 7వ తేదీన ప్రచురించిన కథనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే గాకుండా రాష్ట్ర హైకోర్టుకు కూడా చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు జస్టిస్‌ ఈశ్వరయ్య ఆదివారమిక్కడ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. సస్పెండైన జడ్జి రామకృష్ణతో తాను ఫోన్లో సంభాషించిన మాట వాస్తవమేనని.. ఆయన విడుదల చేసిన ఆడియో టేపులోని గొంతు కూడా తనదేనని బాహాటంగా ధ్రువీకరించారు. 


అయితే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ తన సంభాషణను వక్రీకరించాయని.. ట్యాంపరింగ్‌, ఎడిట్‌ చేసి ప్రసారం చేశారని, ప్రచురించారని ఆయన ఆరోపించారు. ఆ సంభాషణను బయటపెట్టడం బీసీలపై జరిగిన దాడి అంటూ వక్రభాష్యం చెప్పడానికి ప్రయత్నించారు. రామకృష్ణతో జరిపిన వ్యక్తిగత సంభాషణకు, బీసీలకు సంబంధం ఏమిటనే ప్రశ్నకు ఆయన్నుంచి సమాధానం రాలేదు. ‘ఏ హోదాలో మీడియా ముందుకొచ్చారు? ప్రభుత్వ పదవిలో ఉండి బీసీ నాయకుడి పేరిట ప్రెస్‌మీట్‌ పెట్టవచ్చా’ అనే ప్రశ్నలకు సూటిగా బదులివ్వలేకపోయారు. సహ న్యాయమూర్తులను ‘వాడూ వీడూ’ అని బూతులు తిట్టవచ్చా అనే ప్రశ్నకూ సమాధానమివ్వకుండా దాటవేశారు. సామాజిక న్యాయం కోసం కొట్లాడే వ్యక్తినని అంటున్న మీరు... ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సామాజిక అన్యాయంపై ఎందుకు గొంతెత్తలేదని అడిగితే కిమ్మనలేదు. విలేకరులు వేసిన చాలా ప్రశ్నలకు జవాబులివ్వడానికి పదే పదే తడబాటుకు లోనయ్యారు. మీడియా సమావేశంలో ఆయనతో పాటు పాల్గొన్న ఇద్దరు బీసీ ఫెడరేషన్‌ నాయకులు డాక్టర్‌ విజయభాస్కర్‌, రామకృష్ణ మధ్యలో జోక్యం చేసుకుని.. ఆయన్ను సమర్థించేందుకు ప్రయత్నించినా అవి ఫలించలేదు. ఒక దశలో జవాబులు చెప్పలేక జస్టిస్‌ ఈశ్వరయ్య లేచి నిల్చున్నారు. సమాధానాల కోసం విలేకరులు పట్టుపట్టడంతో కొద్దిసేపు రసాభాస చోటుచేసుకుంది. చివరకు ఆయన మీడియా సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు.


విలేకరుల ప్రశ్నలకు జస్టిస్‌ ఈశ్వరయ్య సమాధానాలివీ..


విలేకరులు: మీరు ఏ హోదాలో ఈ ప్రెస్‌మీట్‌ పెట్టారు?

జస్టిస్‌ ఈశ్వరయ్య: అదే చెబుతున్నా.. అదే చెబుతున్నా.. (తడబడుతూ) ఆలిండియా బీసీ ఫెడరేషన్‌ సంస్థాపక అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా.,


విలేకరులు: ఏపీలో ప్రభుత్వ పదవిలో ఉన్న మీరు.. బీసీల నేతగా మీడియా ముందుకు రావొచ్చా?

ఈశ్వరయ్య: నాకు పదవితో సంబంధం లేదు. నేను ఉన్న ప్రస్తుత పదవి ఒక చట్టం ద్వారా మాత్రమే వచ్చింది. భావ వ్యక్తీకరణ చేసే హక్కు నాకుంది. ఆలిండియా బీసీ ఫెడరేషన్‌ సంస్థాపక అధ్యక్షుడిగానే మాట్లాడుతున్నా. అంశంతో నేనున్న పదవికి సంబంధమే లేదు... 


విలేకరులు: రామకృష్ణతో వ్యక్తిగతంగా మాట్లాడానని మీరే అంటున్నారు.. దానికి, బీసీలకు ఏమిటి సంబంధం?

ఈశ్వరయ్య: నేను బీసీ వ్యక్తిని. నాలోని ప్రతి శ్వాసలో బీసీ భావజాలమే ఉంటుంది. నేను న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కూడా సామాజిక న్యాయం పాటించాను.  


విలేకరులు: మరి ఏపీలో జరుగుతున్న సామాజిక అన్యాయంపై ఎప్పుడైనా ప్రశ్నించారా?

ఈశ్వరయ్య: (మళ్లీ తడబడుతూ) సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా. ఇప్పుడు మాట్లాడను.


విలేకరులు: రామకృష్ణతో మాట్లాడిన ఆడియో మీదేనని ఒప్పుకొంటున్నారు కదా..!

ఈశ్వరయ్య: రామకృష్ణే నాకు ఫోన్‌ చేశారు తప్ప నేను చేయలేదు.


విలేకరులు: మీ పీఏ రామకృష్ణకు ఫోన్‌చేసి మీతో మాట్లాడాలని మీ నంబరు ఇచ్చారట కదా! 

ఈశ్వరయ్య: అది అబద్ధం. అదంతా ట్యాంపర్‌ చేసి వక్రీకరించి ఎడిట్‌ చేసి ప్రసారం చేశారు తప్ప వాస్తవమైంది కాదు.. 


విలేకరులు: ఆయన వద్ద మెసేజ్‌లు, వాట్స్‌పలు కూడా ఉన్నాయి..

ఈశ్వరయ్య: ఇప్పుడు కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడను.


విలేకరులు: మీ నంబరుతో ఎసెమ్మెస్‌లు ఉన్నాయి..

ఈశ్వరయ్య: నా నంబరుతో ఎవరికీ ఎసెమ్మెస్‌లు లేవు.. 


విలేకరులు: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయించింది మీరేనని ఒప్పుకొన్నారు కదా?

ఈశ్వరయ్య: నన్ను వినకుండా వారేదైనా చర్య తీసుకున్నప్పుడు నేను జవాబు చెప్పుకొంటాను. కేసు కూడా ఇప్పుడు పెండింగ్‌లో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం సబబు కాదు. ఇక లేఖ రాయించింది నేనేనని వాళ్లు నిరూపించనివ్వండి.. అప్పుడు చూ స్తాను.. ఆ లేఖ రాసింది ఆలిండియా బీసీ వర్కింగ్‌ ప్రెసిడెంటు. అదేం సీక్రెట్‌ లెటర్‌ కాదు.. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా పంపాడు. లేఖపై ఈ రోజు మాట్లాడను. సందర్భం కూడా కాదు. 


విలేకరులు: బాధ్యతాయుత పదవిలో కొనసాగిన మీరు.. సహ న్యాయమూర్తులపై వాడిన భాషను సమర్థించుకుంటారా?

ఈశ్వరయ్య: నా తోటి రిటైర్డు జడ్జికి సంబంధించి సమయం వచ్చినప్పుడు వివరణ ఇస్తా. ఇది సందర్భం కాదు.


విలేకరులు: రామకృష్ణతో మాట్లాడిన విషయాన్ని ధ్రువీకరిస్తున్నారా?

ఈశ్వరయ్య: అవును మాట్లాడాను. కానీ ట్యాంపరింగ్‌ చేసి, ఎడిట్‌ చేసి, వక్రీకరించి ప్రసారం చేశారు. 


విలేకరులు: రామకృష్ణ తన వ్యక్తిగత అంశంపై పోరాటం చేస్తున్నారు. మీరున్న ప్రస్తుత పదవికి, ఆయన సమస్యకు సంబంధమే లేనప్పుడు మీరెందుకు జోక్యం చేసుకున్నారు? 

ఈశ్వరయ్య: నాకు సంబంధం లేదు. కానీ నా సంభాషణను ట్యాంపరింగ్‌ చేశారు.


విలేకరులు: ట్యాంపరింగ్‌ అంటే మిమిక్రీ చేశారా? 

ఈశ్వరయ్య: అదేం చేశారో..! (తడబడుతూ) అవసరం వచ్చినప్పుడు చెబుతా. 


విలేకరులు: ట్యాంపరింగ్‌ అంటున్న మీరు ఒరిజినల్‌ ఆడియో విడుదల చేస్తారా?

ఈశ్వరయ్య: (మౌనం..)


విలేకరులు: మీరు టైమిస్తే  ఆడియో మొత్తం వినిపిస్తాం.. ఒప్పుకొంటారా?

ఈశ్వరయ్య: మీరు ట్రయల్‌ చేసినప్పుడు నేను నిరూపించుకుంటా..


కోర్టులపై నాకు అపార గౌరవం.. జస్టిస్‌ ఈశ్వరయ్య ప్రకటన

మీడియా సమావేశంలో జస్టిస్‌ ఈశ్వరయ్య ఓ ప్రకటన చదివి వినిపించారు. తనపై వ్యక్తిగతంగా, తన ఆత్మగౌరవాన్ని కించపరిచేలా, బీసీల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ అనేక కల్పితాలు, కట్టుకథలు, ఊహాజనిత వార్తలను అదే పనిగా టీవీ, పత్రికలో ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘నేను న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. సుప్రీంకోర్డు న్యాయమూర్తి జోక్యం గురించి వక్రీకరించి ఏబీఎన్‌లో ప్రసారం చేశారు. ఈ సంఘటనను నేను ప్రస్తుతం నిర్వహించే పదవికి గానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి గానీ అంటగట్టడం ఆక్షేపణీయం. జస్టిస్‌ నాగార్జునరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు తగిన సమయంలో వివరణ ఇసా’్త అని తెలిపారు.  తనకు న్యాయస్థానాలపైన, న్యాయవ్యవస్థపైన, న్యాయమూర్తులపైన అపారమైన గౌరవముందన్నారు.


మావోడు ఉచ్చులో పడ్డాడు..

జస్టిస్‌ ఈశ్వరయ్య అర్ధాంతరంగా వెళ్లిపోయాక.. బీసీ ఫెడరేషన్‌ నాయకుడు రామకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ‘మావోడు (జస్టిస్‌ ఈశ్వరయ్య) ఉచ్చులో పడ్డాడు. జస్టిస్‌ నాగార్జునరెడ్డి, జడ్జి రామకృష్ణ మధ్య చాలా కాలంగా ఉన్న వివాదంలో దూరి తప్పు చేశాడు’ అని అన్నారు. కాగా.. జస్టిస్‌ ఈశ్వరయ్య ఏపీ ప్రభుత్వ ప్రొటోకాల్‌ కలిగిన పదవిలో ఉన్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి కేటాయించిన ఇక్కడి లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌లో ఆయన మీడియా సమావేశాన్ని అధికారిక హోదాలో నిర్వహించుకోవచ్చు. కానీ ఆయన ఒక ప్రైవేట్‌ టీవీ చానల్‌ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.

Updated Date - 2020-08-10T09:36:45+05:30 IST