సలాం కుటుంబానికి న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2020-11-25T06:05:45+05:30 IST

అబ్దుల్‌ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ మౌలానా ముస్తాక్‌ అహమ్మద్‌ కోరారు.

సలాం కుటుంబానికి న్యాయం చేయాలి
మాట్లాడుతున్న ముస్తాక్‌ అహమ్మద్‌

  1. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ మౌలానా ముస్తాక్‌ అహమ్మద్‌ 


నంద్యాల, నవంబరు 24: అబ్దుల్‌ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ మౌలానా ముస్తాక్‌ అహమ్మద్‌ కోరారు. మంగళవారం నంద్యాలలో అబ్దుల్‌ సలాం న్యాయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. దీక్షను ప్రారంభించి ముస్తాక్‌ అహమ్మద్‌ మాట్లాడారు. సలాం కుటుంబానిది ఆత్మహత్య కాదని, పోలీసులు చేసిన హత్యేనని అన్నారు. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులతోనే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సీఐతో పాటు క్రైం హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌, క్రైం కానిస్టేబుళ్ల బృందాన్ని అరెస్టు చేసి తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నిమిషాంబ జ్యువెలర్స్‌లో బంగారం దొంగతనం జరిగిన నాటి నుంచి జ్యువెలర్స్‌ యజమానులు, వైసీపీ నాయకుడు గంగిశెట్టి విజయ్‌కుమార్‌, పోలీసుల మధ్య జరిగిన ఫోన్‌ కాల్‌ రికార్డును బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు. సలాం కుటుంబానికి న్యాయం జరగాలంటే ప్రత్యేకంగా ఫాస్ర్టాక్‌ కోర్టు ఏర్పాటు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని, సలాంను నిర్దోషిగా ప్రకటించి ఆ కుటుంబానికి ఆత్మశాంతి కలిగించాలని కోరారు. గుంటూరు జిల్లా తాటికొండ గ్రామం మసీదు మౌజాన్‌ హనీఫ్‌పై దాడి చేసిన వైసీపీ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో సీపీఎం నాయకులు పుల్ల నరసింహ, షేక్షా, కరీంఖాన్‌, చిన్న వ్యాపారుల సంఘం నాయకులు మహబూబ్‌బాషా, ఖాజా హుసేన్‌, నిస్సార్‌ అహమ్మద్‌, ఎం.రమణ ఉన్నారు. దీక్షకు ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు యూనస్‌తో పాటు ఎంఆర్‌ఎఫ్‌, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, హమాలీ యూనియన్‌ నాయకులు మద్దతు తెలిపారు.


ఆత్మకూరు రూరల్‌: సలాం కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల, మైనార్టీ నాయకులు కోరారు. మంగళవారం రాత్రి పట్టణంలోని నంద్యాల టర్నింగ్‌ వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ డివిజన్‌ కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐవైఎఫ్‌ డివిజన్‌ కార్యదర్శి అహ్మద్‌ హుసేన్‌, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ డివిజన్‌ కార్యదర్శి ప్రతాప్‌, వివిధ సంఘాల నాయకులు వలి, మున్నా, మహబూబ్‌, మహబూబ్‌ బాషా, జిలాని నూర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-25T06:05:45+05:30 IST