పేదరిక నిర్మూలనకు తోడ్పాటు

ABN , First Publish Date - 2022-05-26T05:52:27+05:30 IST

పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు అమలు చేస్తోన్న కార్యక్రమానికి న్యాయ సేవాధికార సంస్థ తోడ్పాటు నందిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా అన్నారు.

పేదరిక నిర్మూలనకు తోడ్పాటు
పేదరిక నిర్మూలన అవగాహన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఏపీఎస్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా

గుంటూరు, మే 25 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు అమలు చేస్తోన్న కార్యక్రమానికి న్యాయ సేవాధికార సంస్థ తోడ్పాటు నందిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా అన్నారు. బుధవారం గుంటూరు మెడికల్‌ కళాశాలలోని జింఖాన ఆడిటోరియంలో జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఎఫెక్టివ్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ పావర్టీ ఎలిమినేషన్‌ స్కీమ్‌ఠి - 2015పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా మాట్లాడుతూ సమాజంలో మానసిక, ఆర్థిక పేదరికాలు ఉన్నాయన్నారు. ఉన్నవారు లేని వారికి ఇవ్వాలనేది ప్రకృతి ధర్మంగా పాటించాలన్నారు. ప్రభుత్వ పథకాలు పొందడం ప్రజల హక్కు, అర్హులు పథకాలను పొందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నాగార్జునసాగర్‌లోని విజయపురి సౌత్‌కు చెందిన వెంకటరమణను న్యాయసేవాధికారసంస్థలో పారా లీగల్‌వలంటీర్‌గా నియమించాలని జిల్లా న్యాయమూర్తికి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఎస్‌బీజీ పార్థసారఽథి మాట్లాడుతూ సమాజంలోని బలహీనవర్గాలకు న్యాయం అందించడమే లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఏపీ స్టేటల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ సెక్రెటరి జస్టిస్‌ ఎం బబిత మాట్లాడుతూ న్యాయం అవసరమైన వారికి ఉచితంగా న్యాయసలహాలు అందించ డంతో పాటు న్యాయవాదులను ఏర్పాటు చేస్తుందన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డి,  పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి, బాపట్ల జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలనీ, ఈ క్రమంలో వలంటీర్ల కృషి అభినందనీయమని అన్నారు. గుంటూరు జిల్లా ఎస్‌పీ ఆరిఫ్‌ హఫీజ్‌, పల్నాడు జిల్లా ఎస్‌పీ వై రవిశంకర్‌రెడ్డి, బాపట్ల జిల్లా ఎస్‌పీ వకుల్‌ జిందాల్‌లు మాట్లాడుతూ పేదరికానికి, నేరాలకు సంబంధం ఉందనీ, నేరాల శాతం తగ్గించేందుకు పోలీసు శాఖతో పాటు జ్యుడీషియల్‌, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖలు సమష్టిగా పని చేస్తే కచ్ఛితంగా ఫలితం ఉంటుందన్నారు.

రుణాలు, ఉపకరణాల పంపిణీ

కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బ్యాంకు లింకేజ్‌ ద్వారా 9,323 స్వయం సహాయక సంఘాలకు రూ. 81.64 కోట్ల, స్త్రీ నిధి ద్వారా 2,813 మంది పొదుపు సంఘాల మహిళలకు రూ. 14.15 కోట్లు, వైఎస్‌ఆర్‌ బీమా క్లెయిమ్‌ల కింద 1,629 మందికి రూ. 19.29 కోట్ల చెక్కులను ఈ సందర్భంగా జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా అందజేశారు. అనంతరం జస్టిస్‌ అమానుల్లాని ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ సీనియర్‌ సివిల్‌ జడ్జీ జస్టిస్‌ కే రత్నకుమార్‌, గుంటూరు జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీ వెంకటేశ్వర్లు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఎస్‌ బ్రహ్మానందరెడ్డి, ఆర్‌ మాధవి, డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్‌, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో..

బార్‌ అసోసియేషన్‌ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమావేశంలో జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా మాట్లాడుతూ కక్షిదారుల నమ్మకాన్ని పొందేలా న్యాయవాదులు మానవత్వ విలువలతో వారికి న్యాయం అందించేలా కృషి చేయాలన్నారు. సీనియర్‌ న్యాయవాదులు కేసుల పరిష్కారంలో కోర్టులలో ప్రవర్తించాల్సిన తీరుపై జూనియర్‌ న్యాయవాదులకు సలహాలు ఇవ్వాలన్నారు. అనంతరం జస్టిస్‌ అమానుల్లాని గుంటూరు జిల్లా బార్‌ అసోసియేషన్‌తో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా జడ్జి జస్టిస్‌ వీఎస్‌బీజీ పార్థసారధి, ఏపీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటి మెంబర్‌ సెక్రెటరీ జస్టిస్‌ ఎం బబిత, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటి సెక్రెటరీ కే రత్న కుమార్‌, గుంటూరు జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీ వెంకటేశ్వర్లు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ మెంబర్లు వీ.బ్రహ్మారెడ్డి, ఎస్‌ బ్రహ్మానందరెడ్డి, ఆర్‌ మాధవి పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-26T05:52:27+05:30 IST