అంతర్రాష్ట్ర బస్సుల్లేనట్లే

ABN , First Publish Date - 2021-06-20T10:23:50+05:30 IST

ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడవనున్నాయి.

అంతర్రాష్ట్ర బస్సుల్లేనట్లే

ఇక పాత వేళల ప్రకారం మద్యం షాపులు

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడవనున్నాయి. ఒక్క అంతర్రాష్ట్ర బస్సులు మినహా జిల్లా, సిటీ బస్సులు పూర్తిగా రోడ్డెక్కనున్నాయి. అన్ని డిపోల నుంచి ఉదయం నుంచే బస్సులు ప్రారంభమవుతాయని ఆర్టీసీ ఈడీ యాదగిరి తెలిపారు. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్‌డౌన్‌ను విధించడంతో బస్సులు అరకొరగానే నడుస్తున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపు వేళలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడుపుతూ వస్తోంది. ఈ నెల 10 నుంచి 19 వరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడిచాయి. అయితే.. లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో ఎత్తివేయడంతో బస్సులన్నీ రోడ్డెక్కుతాయని యాదగిరి తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో 9,000 వరకు బస్సులున్నాయి. వీటిలో 1,000 వరకు బస్సులు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకు నడుస్తుంటాయి. ఈ 1,000 అంతర్రాష్ట్ర బస్సులు మినహా మిగతా 8,000 బస్సులు ఉదయం నుంచి పరుగులు పెడతాయి. అంతర్రాష్ట్ర బస్సులు నడిచే అవకాశాలు లేవు. పొరుగు రాష్ట్రాల్లోనూ కరోనా తగ్గుముఖం పడితే తప్ప రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవచ్చని అంటున్నారు. 


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోజూ ఐదారు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇంకా తీవ్రత తగ్గలేదు. ఈ రెండు రాష్ట్రాలకే టీఎ్‌సఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో నడుస్తుంటాయి. అంతర్రాష్ట్ర ప్రజా రవాణాకు అనుమతి లభిస్తేనే అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభమవుతాయని యాదగిరి వివరించారు. కాగా, లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో రాష్ట్రంలోని మద్యం షాపులు పాత వేళలనే పాటించనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈ నెల 19 వరకు మద్యం దుకాణాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉండేవి. ఇప్పుడు లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడంతో నిర్ణీత వేళల ప్రకారం తెరిచి ఉండనున్నాయి. లాక్‌డౌన్‌ను విధించక ముందు సాధారణ రోజుల్లో జీహెచ్‌ఎంసీలోని మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, జిల్లాల్లోని షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉండేవి. ఇప్పుడివే వేళలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మాత్రం ఇప్పుడే తెరుచుకోవని ఎక్సైజ్‌వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-06-20T10:23:50+05:30 IST