అమెరికాలోని ఆ ఐదు రాష్ట్రాల్లోనే 40 శాతానికి పైగా కేసులు

ABN , First Publish Date - 2020-08-10T08:13:13+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.

అమెరికాలోని ఆ ఐదు రాష్ట్రాల్లోనే 40 శాతానికి పైగా కేసులు

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. ఇక శనివారం అమెరికా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో నిత్యం 50 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య లక్షకు చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఏ రాష్ట్రానికారాష్ట్రం ప్రజలకు సూచిస్తూనే ఉంది. అంతేకాకుండా గుంపులు గుంపులుగా ఒకే చోట చేరవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇక అమెరికాలో ఇప్పటివరకు చూస్తే కేవలం ఐదు రాష్ట్రాల్లోనే 40 శాతానికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్, జార్జియా రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. అమెరికాలోని అన్ని రాష్ట్రాల కంటే కాలిఫోర్నియాలో అత్యధికంగా 5,59,810 కేసులు నమోదయ్యాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఫ్లోరిడా(5,32,806), టెక్సాస్(5,04,898), న్యూయార్క్(4,50,285), జార్జియా(2,16,596) రాష్ట్రాలున్నాయి. కాగా.. డిసెంబర్ నాటికి విజయవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని అమెరికాలోని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-10T08:13:13+05:30 IST