మా జీవితాలతో ఆటలాడుకోవద్దు

ABN , First Publish Date - 2020-08-10T11:20:20+05:30 IST

పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న తమ జీవితాలతో ఆటలాడుకోవద్దని జూనియర్‌ డాక్టర్లు (జూడాలు) పేర్కొన్నారు.

మా జీవితాలతో ఆటలాడుకోవద్దు

నేటినుంచి అన్ని సాధారణ ఓపీ సేవలు బహిష్కరిస్తున్నాం

తిరుపతి రుయాస్పత్రిలో జూనియర్‌ డాక్టర్ల నిరసన


తిరుపతి (వైద్యం), ఆగస్టు 9: పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న తమ జీవితాలతో ఆటలాడుకోవద్దని జూనియర్‌ డాక్టర్లు (జూడాలు) పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ పిలుపుతో ఆందోళనకు దిగిన జూడాలు రెండో రోజైన ఆదివారం కూడా తిరుపతి రుయాస్పత్రిలో నిరసన కొనసాగించారు. రాత్రి 7.30 గంటల సమయంలో చిన్న పిల్లల ఆస్పత్రి సర్కిల్లో కొవ్వొత్తులు, ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జూడాల నాయకులు మాట్లాడుతూ.. వైద్యానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. వైద్యులు, వైద్య విద్యార్థులపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న జూడాలకు రూ.50లక్షల ప్రమాద బీమా చెల్లించే విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు.


నాణ్యమైన పీపీఈ కిట్లు, మాస్కులను సరఫరా చేయకుండా.. సిబ్బంది నియామకాలు చేపట్టకుండా వ్యవహరించడం సరికాదన్నారు. సోమవారం నుంచి అన్ని సాధారణ ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. అత్యవసర, ప్రసూతి, కొవిడ్‌ వైద్య సేవలకు మాత్రం హాజరవుతామని స్పష్టం చేశారు. అప్పటికే తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకుంటే వీటినీ బహిష్కరిస్తామని హెచ్చరించారు. నాయకులు మోజెస్‌, దినకరన్‌, హౌస్‌ సర్జన్లు రామ్మోహన్‌, వెంకటేష్‌, కేశవన్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-10T11:20:20+05:30 IST