జంపింగ్‌ జపాంగ్‌

ABN , First Publish Date - 2021-04-14T05:30:00+05:30 IST

వరంగల్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. కార్పొరేటర్లుగా పోటీ చేయదలుచుకున్న నాయకులు అవకాశం కోసం అప్పుడే పార్టీలు మారుతున్నారు. టికెట్‌ కోసం యత్నాలు మొదలు పెట్టారు.

జంపింగ్‌ జపాంగ్‌

అప్పుడే మొదలైన వలసలు

హన్మకొండ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓ పార్టీ  నుంచి ఇంకో పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. కార్పొరేటర్లుగా పోటీ చేయదలుచుకున్న నాయకులు అవకాశం కోసం అప్పుడే పార్టీలు మారుతున్నారు. టికెట్‌ కోసం యత్నాలు మొదలు పెట్టారు.   నగరంలో పార్టీల్లో కాస్త పలుకుబడి ఉన్న, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన, టికెట్‌ కోసం యత్నించి భంగపడ్డ నాయకులు టికెటే లక్ష్యంగా ఇతర పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలో ఇమడలేక ఇన్నాళ్లూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నవారు కూడా ఇతర పార్టీల వైపు చూపుచూస్తున్నారు. అసంతృప్తులు సైతం పార్టీ కండువాలు మార్చుకోవాలని చూస్తున్నారు. దానికి ఇప్పుడే సరైన సమయమని భావిస్తున్నారు.

ఈనెల 12న మంత్రి కేటీఆర్‌ నగర పర్యటన  సందర్భంగా శంభునిపేటకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలు పోశాల పద్మ సుమారు 100మంది మద్దతుదారులతో టీఆర్‌ఎ్‌సలో చేరారు. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏడో డివిజన్‌  నుంచి పోటీ చేసి  స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.  ఈ సారి టీఆర్‌ఎస్‌ నుంచి అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఖిలావరంగల్‌ పడమర కోట ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నగర ప్రధాన కార్యదర్శి గజ్జెల శ్యాం కూడా మొన్న మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. కొంతకాలంగా   సొంత పార్టీ నేతల నుంచే ఒత్తిళ్లకు లోనవుతున్న ఆయన.. అందులో ఇమడ లేక గులాబీ కండువా కప్పుకున్నట్టు తెలుస్తోది.  అవకాశం లభిస్తే టీఆర్‌ఎస్‌ పక్షాన పోటీకి సిద్ధం అంటున్నారు.

తాజాగా బుధవారం మడికొండకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు బైరి కొమురయ్య కూడా గులాబీ కండువాను వదిలేసి జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కొమురయ్యను కాంగ్రె్‌సలోకి లాక్కోవడం వెనుక ఆ పార్టీ నాయకుల వ్యూహం ఉంది. గత ఎన్నికల్లో 53వ డివిజన్‌ మహిళలకు రిజర్వు కావడంతో కొమురయ్య తన కోడలికి టికెట్‌ ఇప్పించేందుకు యత్నించారు. పార్టీ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా నిలబెట్టాడు. టీఆర్‌ఎస్‌ పక్షాన రాధికారెడ్డి పోటీ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో తిరుగుబాటుతో పట్టిపోరు పిల్లి తీర్చినట్టు కాంగ్రెస్‌ అభ్యర్థి లింగం మౌనికా చరణ్‌రెడ్డి గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో కూడా గతానుభవమే పునరావృతమయ్యే అవకాశం ఉండడంతో ఆయన బుధవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి 53వ డివిజన్‌ రిజర్వు అయ్యేదానిని బట్టి ఆయనే  స్వయంగా పోటీ చేయడమా లేదా అనేది ఉంటుంది.

Updated Date - 2021-04-14T05:30:00+05:30 IST