వాగులోకి దూకి.. ప్రాణం కాపాడి

ABN , First Publish Date - 2022-08-05T09:35:55+05:30 IST

స్కూటీపై విధులకు వెళుతున్న ఆ ఉపాధ్యాయులు ఉప్పొంగుతున్న వాగును దాటేందుకు ప్రయత్నించి..

వాగులోకి దూకి.. ప్రాణం కాపాడి

  • బైక్‌పై వెళుతూ వరదలో చిక్కుకుపోయిన ఉపాధ్యాయురాలు
  • ప్రవాహ ఉధృతిని లెక్కచేయకుండా దిగి ఆమెను రక్షించిన సర్పంచ్‌ 
  • యదాద్రి జిల్లాలో ఘటన.. ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులో పడి ఇద్దరి గల్లంతు

ఆలేరు రూరల్‌, బచ్చన్నపేట, ఉట్నూర్‌, ఆగస్టు 4: స్కూటీపై విధులకు వెళుతున్న ఆ ఉపాధ్యాయులు ఉప్పొంగుతున్న వాగును దాటేందుకు ప్రయత్నించి.. ఆ ఉధృతికి వాహనం సహా వాగులో పడిపోయింది. ఓ చిన్న చెట్టును పట్టుకొని నిస్సహాయస్థితిలో ఉన్న ఆమెను ఓ యువకుడు వాగులో దూకి ప్రాణాలకు తెగించి కాపాడాడు. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో గురువారం ఈ ఘటన జరిగింది. ధర్మారెడ్డిగూడానికి చెందిన గుండ్లపల్లి అనిత సిద్దిపేట జిల్లా చేర్యాలలోని గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. రోజూ ఆలేరు నుంచి చేర్యాలకు స్కూటీపై వెళ్లి వస్తారు. గురువారం ఉదయం కొలనుపాక వద్దకు వచ్చేసరికి అక్కడ వాగు కాజ్‌వేపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. సరైన సమయానికి డ్యూటీకి వెళ్లాలనే ఆత్రంలో ఆమె వరదను దాటేందుకు ప్రయత్నించారు. మధ్యలో వాహనం అదుపు తప్పడంతో నీళ్లలో పడిపోయారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేసాపురం గ్రామానికి చెందిన సర్పంచ్‌ గిద్దెల రమేశ్‌ ఆమెను గమనించి కాపాడారు. మరోవైపు,  ఆదిలాబాద్‌లోని ఉట్నూర్‌కు చెందిన అయాన్‌(19), నిర్మల్‌కు చెందిన అస్లాం(23), మరో ముగ్గురు స్నేహితులు కలిసి ఉట్నూర్‌ శివారులోని వంకతుమ్మ వాగులో ఫొటో షూట్‌ కోసం వెళ్లారు. వాగులో దిగి ఫొటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. అయాన్‌, అస్లాం వాగులో కొట్టుకుపోయారు. గద్వాల జిల్లాలో గురువారం పిడుగుపాటుతో ఇద్దరు చనిపోయారు. మృతుల్లో 9వ తరగతి చదువుతున్న బాలుడు ఉన్నాడు. ఆదిలాబాద్‌లోని మామిడిగూడ రైతు పెందూర్‌ భీంరావ్‌(42) పొలంలో పనిచేస్తుండగా పిడుగుపడి చనిపోయాడు. 

Updated Date - 2022-08-05T09:35:55+05:30 IST