Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరోగ్య రసం!

ఆంధ్రజ్యోతి(06-10-2020)

తీపి, పులుపు, ఉప్పు, వగరు, చేదు, కారం... నచ్చే రుచిని బట్టి శరీరతత్వం ఆధారపడి ఉంటుంది. కఫ, వాత, పిత్త దోషాలు లేకుండా ఆరోగ్యంగా జీవించాలంటే రుచుల మధ్య సమతౌల్యం పాటించాలి! ఇందుకోసం శరీరతత్వాన్ని బట్టి ఈ రుచులతో కూడిన ఆరోగ్య రసాలను ఎంచుకోవాలి!


ఆమ్ల రసం


పులుపు: చింతపండు, నిమ్మజాతి పండ్లు, కొన్ని రకాల ఆకుకూరలు!


ప్రభావం: నోటిలో లాలాజలాన్ని ఊరేలా చేసే పులుపు జీర్ణక్రియకు సహాయపడడంతో పాటు, మలబద్ధకాన్ని వదిలిస్తుంది. పేగుల్లో పేరుకుపోయిన జిగటను బయటకు పంపుతుంది. పదార్థాలకు రుచిని పెంచి, జఠరాగ్నిని వృద్ధి చేస్తుంది. 


ఎక్కువైతే: కఫ, వాత, పిత్త దోషాలు పెరుగుతాయి. దృష్టి మందగిస్తుంది. కాళ్లు, చేతులు నీరు పడతాయి. ఛాతీలో, పొట్టలో మంట పెరుగుతుంది. ఫలితంగా పొట్టలో పుండ్లు వేధిస్తాయి. దాహం పెరుగుతుంది. రక్తహీనత, చర్మవ్యాధులు, దురదలు కలుగుతాయి.

లవణ రసం


ఉప్పు: రాతి ఉప్పు, క్షార పదార్థాలు, సాధారణ ఉప్పు


శరీరం మీద ఉప్పు ప్రభావం: జఠరాగ్నిని పెంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వ్యర్థ పదార్థాల విసర్జనకు తోడ్పడుతుంది. లాలాజలం ఊరడానికి దోహదపడుతుంది. కఫాన్ని పలుచన చేసి బయటకు రప్పిస్తుంది. వాతాన్ని నియంత్రణలో ఉంచుతుంది.


ఉప్పు ఎక్కువైతే: రక్తపోటు పెరుగుతుంది. పిత్తం అధికమవుతుంది. దంతాలు వదులవుతాయి. ఒంట్లో నీరు నిల్వ ఉండిపోతుంది. మూత్రపిండాల మీద భారం పడుతుంది. చర్మం మీద ముడతలు ఏర్పడతాయి. దాహం పెరుగుతుంది. చర్మ రోగాలు, దురదలు వేధిస్తాయి.

తిక్క రసం


చేదు: కాకర కాయలు, వేప, మెంతులు


ప్రభావం: అరుచిని పోగొట్టి, నోటిని శుభ్రపరుస్తుంది. జఠరాగ్నిని పెంచి, జీర్ణక్రియను పెంచుతుంది. ఆకలి, దాహం తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థలోని క్రిములను సంహరిస్తుంది. 


ఎక్కువైతే: వికారం, వాంతులు కలుగుతాయి. ధాతువులు క్షీణిస్తాయి. నోరు ఎండిపోతుంది.

కటుక రసం


కారం: పచ్చిమిరపకాయలు, మిరియాలు!


ప్రభావం: శ్లేష్మ, పిత్తాలను సమంగా ఉంచుతుంది. ధాతు క్షీణతను తగ్గిస్తుంది. నోరు, కళ్లు, ముక్కు నుంచి నీరు కారేలా చేస్తుంది. పుండ్లు త్వరగా మానడానికి తోడ్పడుతుంది. కారంగా ఉండే పచ్చిమిరపలో ఉండే ‘క్యాప్సైసిన్‌’ను నొప్పి నివారణ మందుల తయారీలో వాడతారు. ఒంటికి నీరు పట్టకుండా, నీరు పడితే తగ్గేలా తోడ్పడుతుంది. చర్మ, గొంతు వ్యాధులపై ప్రభావం చూపుతుంది.


ఎక్కువైతే: కడుపులో పుండ్లు తప్పవు. ఛాతీలో మంటతో మొదలయ్యే సమస్యను ప్రారంభంలోనే తగ్గించుకోవాలి. వాతం, దప్పిక, వికారం పెరుగుతాయి.

కషాయ రసం


వగరు: హరీతకి, శిరీష, పచ్చి కపిత్త ఫలం!


ప్రభావం: పిత్త, కఫ దోషాలను ఉపశమింపజేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జీర్ణం కావడానికి క్లిష్టంగా ఉంటుంది. శరీరంలో అధిక నీటినీ పీల్చుకుంటుంది. జిడ్డు చర్మం కలిగిన వారికి మేలు చేస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది. పుండ్లు, వ్రణాల నుంచి చెడు స్రావాలను బయటకు వెళ్లగొడుతుంది. కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది.


ఎక్కువైతే: పొట్ట ఉబ్బరిస్తుంది. దాహం తగ్గుతుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తుతుంది. మలబద్ధకం పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది.


మధుర రసం


తీపి: బెల్లం ఉత్పత్తులు, మగ్గిన పండ్లు!


ప్రభావం: తీపి పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. ధాతువులకు పుష్టినిస్తుంది. శరీరానికి తేజస్సు అందిస్తుంది. విష పదార్థాలకు విరుగుడుగా పని చేయడంతో పాటు వెంట్రుకలకు బలాన్నిస్తుంది. జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేటట్టు చేస్తుంది. దాహం తీరుస్తుంది. కాబట్టే వేసవిలో చెరకు రసం ప్రకృతిసిద్ధంగా దక్కుతోంది. చర్మం, వెంట్రుకలు, కండరాలు, మేధస్సు, ఎముకలు, మజ్జ ఈ రుచి పరిధిలోకి వస్తాయి. వీటి పనితీరు మెరుగవుతుంది. అయితే ఈ ఫలితాలు దక్కడం కోసం తీపిని పరిమితంగానే తీసుకోవాలి. 


అధికమైతే: కఫ దోషం పెరుగుతుంది. కొవ్వు పెరుగుతుంది. నులిపురుగులు ఎక్కువవుతాయి. స్థూలకాయం, మధుమేహం పెరుగుతాయి. తద్వారా ఇతరత్రా రుగ్మతలూ పెరుగుతాయి. కాబట్టి తీపిని పరిమితంగానే తీసుకోవాలి. కృత్రిమ తీపి జోలికి వెళ్లకుండా సహజసిద్ధమైన తీపినే తీసుకోవాలి.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...