పరిషత్‌ ఎన్నికలపై తీర్పు వాయిదా

ABN , First Publish Date - 2021-08-06T09:01:01+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు తన తీర్పును..

పరిషత్‌ ఎన్నికలపై తీర్పు వాయిదా

ఎలక్షన్లకు 160 కోట్లు ఖర్చుచేశాం

ఫలితాల వెల్లడికి అనుమతివ్వండి

ఎస్‌ఈసీ తరఫు సీనియర్‌ న్యాయవాది వినతి

రాజకీయ ఒత్తిడితోనే నోటిఫికేషన్‌: జనసేన

తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం


అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు తన తీర్పును వాయిదావేసింది. గురువారం జరిగిన విచారణలో ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌, జనసేన తరఫున న్యాయవాది వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది  ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏప్రిల్‌ 8న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి మే 21న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాలకు ముందు ఎన్నికల కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉందని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల  కమిషనర్‌ నీలం సాహ్ని, ఎన్నికల్లో పోటీ చేసిన మరికొందరు అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు.


ఇవి ఇటీవల విచారణకు రాగా.. ఎస్‌ఈసీ అప్పీల్‌పై నిర్ణయాన్ని వెల్లడించేంతవరకు పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించవద్దని ధర్మాసనం ఆదేశించింది. పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో, అక్కడ నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ మే 21న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ అప్పీల్‌ గురువారం మరోసారి విచారణకు వచ్చింది.


సింగిల్‌ జడ్జి పొరబడ్డారు..: ఎస్‌ఈసీ

ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వ్యక్తిగత హోదాలో టీడీపీ నేత వర్ల రామయ్య, జనసేన కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సింగిల్‌ జడ్జి సంయుక్తంగా తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి నిర్వహించాలని మాత్రమే జనసేన కోరిందని.. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించలేదని ఆ పిటిషన్‌లో పేర్కొనలేదని తెలిపారు. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఇచ్చారని వర్ల రామయ్య మాత్రమే అభ్యంతరం లేవనెత్తారన్నారు. ‘టీడీపీ నేత దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన సింగిల్‌ జడ్జి.. జనసేన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించలేదనే కారణంతో ఎన్నికలను రద్దు చేశారు. తీర్పు వెల్లడిలో పొరపాటు పడ్డారు. సుప్రీంకోర్టు స్థానిక ఎన్నికలకు 4 వారాల ముందు కోడ్‌ విధించాలని చెప్పింది తప్ప.. గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అని వేర్వేరుగా చెప్పలేదు.


సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులో ఎన్నికల కమిషనర్‌కు దురుద్దేశాలు ఆపాదించారు. ఆ వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించేలా ఆదేశాలివ్వాలి. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం రూ.160 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించి బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచాం. వీటి నిర్వహణ ఖర్చుతో కూడుకుంది. అందుచేత  సింగిల్‌ జడ్జి ఆదేశాలను రద్దు చేసి.. పరిషత్‌ ఫలితాల వెల్లడికి అనుమతివ్వండి’ అని కోరారు. ధర్మాసనం ఉత్తర్వుల మేరకే పరిషత్‌ ఎన్నికలు నిర్వహించామని ఏజీ తెలిపారు. ప్రస్తుతం బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉన్నాయని.. పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారని.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రూ.160 కోట్లు ఖర్చు చేసిందని.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎస్‌ఈసీ అప్పీల్‌ను అనుమతించాలని కోరారు. 


హడావుడిగా నోటిఫికేషన్‌: జనసేన

‘పోలింగ్‌ తేదీకి నాలుగువారాల ముందు కోడ్‌ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టి ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. రాజకీయ ఒత్తిడితో ఎస్‌ఈసీగా బాధ్యతలు తీసుకున్న రోజే హడావుడిగా నోటిఫికేషన్‌ జారీచేశారు. ఎన్నికల్లో అన్ని పార్టీలకూ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కోడ్‌ విషయంలో ఆదేశాలిచ్చింది. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలకు కోడ్‌ విధించిన నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికలకు అవసరం లేదని ఎస్‌ఈసీ వాదించడం సరికాదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నోటిఫికేషన్‌ ఇవ్వలేదని టీడీపీ నేత వర్ల రామయ్య తరఫు న్యాయవాది, నేను సింగిల్‌ జడ్జి దృష్టికి తీసుకెళ్లాం. కోడ్‌ విషయంలో జనసేన అభ్యంతరం లేవనెత్తలేదనడం సరికాదు. అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకున్నాకే సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు’ అని వేణుగోపాలరావు వివరించారు. ఆయన అభ్యంతరం లేవనె త్తకపోవడంతో.. పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన లీవ్‌ పిటిషన్లను ధర్మాసనం అనుమతించింది. వారి తరఫున న్యాయవాదులు వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌, జీఆర్‌ సుధాకర్‌, వై.నాగిరెడ్డి, జి.శివప్రసాద్‌రెడ్డి, వీఆర్‌ రెడ్డి కొవ్వూరి, ఎన్‌.శ్రీహరి వాదనలు వినిపించారు. అనంతరం పరిషత్‌ ఎన్నికలపై నిర్ణయాన్ని ధర్మాసనం వాయిదా వేసింది.

Updated Date - 2021-08-06T09:01:01+05:30 IST