జడ్జీలూ నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు!

ABN , First Publish Date - 2022-08-20T08:45:31+05:30 IST

హైకోర్టు జడ్జీలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘జడ్జీలూ.. నోటికేదొస్తే అది మాట్లాడొద్దు. డిగ్నిఫైడ్‌గా ఉండండి’’ అని వ్యాఖ్యానించారు.

జడ్జీలూ నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు!

  • మీకున్న ఆత్మాభిమానం సీఎంకు ఉండదా?
  • మిమ్మల్ని తిడితే 3 నెలలైనా బెయిల్‌ రాదు
  • సీఎంను తిట్టినోళ్లకు గంటలో బెయిల్‌ ఇచ్చారు
  • మాజీ మంత్రి జోలికి కూడా వెళ్లొద్దన్నారు
  • ప్రభుత్వాన్ని నియంత్రించేలా హైకోర్టు తీరు
  • న్యాయవ్యవస్థలో లోపాలపై చర్చ జరగాలి
  • సర్కారును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది
  • ఉద్యోగుల సమావేశంలో సంఘ నేత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు


అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): హైకోర్టు జడ్జీలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘జడ్జీలూ.. నోటికేదొస్తే అది మాట్లాడొద్దు. డిగ్నిఫైడ్‌గా ఉండండి’’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం విజయవాడ బస్టాండ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వెంకట్రామిరెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ మధ్య ప్రభుత్వంపై రకరకాల దాడులు మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని మీడియాల వాళ్లు ఏదేదో ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పి ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలు చెప్పి ఆయా దాడులను తిప్పికొట్టాల్సిన అవసరముంది. ఇంత మేలు చేసిన ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రభుత్వంలో మనం భాగమే కాబట్టి ఆ బాధ్యత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీసుకోవాలి’’ అన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని అడ్డుకుని.. ప్రజల్లో సానుకూలత పెరిగేలా చూడాలని కోరారు. ‘‘ఏపీలోనే విచిత్ర పరిస్థితులన్నాయి. కొన్ని రాజ్యాంగ సంస్థలు ప్రభుత్వాన్ని నియంత్రించే పరిస్థితులు చూస్తు న్నాం. 


గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా ప్రవర్తించిందో చూశాం. ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు కార్నర్‌ చేయాలని చూస్తోందని చెన్నైకు చెందిన ప్రముఖ లాయర్‌ వ్యాఖ్యానించారు. అప్పుడు ఆశ్చర్యమేసింది. కానీ, ఇప్పుడు కొన్ని పరిస్థితులు చూస్తే అది నిజమేననిపిస్తోంది. ఎక్కువ మాట్లాడితే కోర్టు ధిక్కారణ అంటారు. న్యాయ వ్యవస్థలోని లోపాలను చర్చించుకోవాలి. జడ్జిలను తిడుతూ వాట్సా్‌పలో వ్యాఖ్యలు చేశారని కొందరిని అరెస్టు చేశారు. వారికి మూడు నెలలపాటు బెయిల్‌ ఇవ్వలేదు. కానీ, ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ముఖ్యమంత్రిని తిట్టినవారికి గంటలో బెయిల్‌ ఇచ్చారు. మాజీ మంత్రి బహిరంగసభలో ఇష్టమొచ్చినట్లు తిడితే ఆయన జోలికి అసలు వెళ్లొద్దన్నారు. 


జడ్జిలకు మాత్రమే ఆత్మాభిమానం ఉంటుందా? ముఖ్యమంత్రికి ఉండదా? సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను కోర్టుకు పిలిచి గంటలకొద్దీ వెయిట్‌ చేయిస్తున్నారు. ఈ పరిస్థితి నిజంగా బాధనిపిస్తోంది’’ అన్నారు. ‘‘జడ్జిలకు ఎంతో విలువిస్తున్నాం. కరకట్ట రోడ్డులో జడ్జిలు వెళ్తున్నప్పడు సచివాలయ ఉద్యోగులందరూ పది నిమిషాలు ఆగుతున్నారు. జడ్జిలు కూడా ప్రభుత్వంపై నోటికి ఏదొస్తే అది మాట్లాడకుండా డిగ్నిఫైడ్‌గా ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం జగన్‌ ఒకేఒక్క నిర్ణయంతో 1.30 లక్షల మందికి ఒకేసారి ఉద్యోగాలు కల్పించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు సెప్టెంబరులో లక్ష మందితో బహిరంగసభ ఏర్పాటుచేస్తాం’’ అని వెంకట్రామిరెడ్డి చెప్పారు. కాగా, కొత్త జిల్లాలకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సభ్యత్వ నమోదును ప్రారంభించాలని రాష్ట్ర కమిటీ తీర్మానించింది.

Updated Date - 2022-08-20T08:45:31+05:30 IST