మాజీ జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ

ABN , First Publish Date - 2020-08-10T23:10:13+05:30 IST

ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే.

మాజీ జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ

అమరావతి : ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్‌ను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేసింది. ఈ వ్యవహారంపై ఈశ్వరయ్య ఎట్టకేలకు స్పందించి మీడియా ముందుకొచ్చి తడబడుతూ వివరణ ఇచ్చేసి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండానే జంప్ అయ్యారు. అయితే.. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ‘మొద్దుశ్రీను హత్య కేసు’ను ఈశ్వరయ్య ప్రభావితం చేశారంటూ మాజీ జడ్జి రామకృష్ణ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు.


వాదనలు ఇలా..

అయితే తాజాగా.. మాజీ జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటీషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇంప్లీడ్ పిటీషన్‌పై మంగళవారానికి తీర్పును వాయిదా వేసింది. ఇంప్లీడ్ పిటీషన్ వేసిన జడ్జి రామకృష్ణ ప్రతిరోజూ మీడియాలో మాట్లాడుతున్నారని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ ఆయన జడ్జి అని, సర్వీస్ రూల్స్ ప్రకారం మీడియాలో మాట్లాడకూడదని వాదనలు వినిపించారు. హైకోర్టును కంటైన్మెంట్ జోన్‌గా, రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మరణంపై విచారణ కోసం వేసిన పిటీషన్‌కు జడ్జి రామకృష్ణకు సంబంధం లేదని న్యాయవాది వాదించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ పిటీషన్‌తో సంబంధం లేదని అదనపు సోలిసిటర్ జనరల్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ జడ్జి ఈశ్వరయ్యకు సంబంధం ఉందని చేస్తున్న వాదన నిజం కాదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.


విచారణ జరిపించండి..!

హైకోర్టు ఔన్నత్యాన్ని దెబ్బ తీసేందుకే పిటీషన్ వేశారని రామకృష్ణ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. కర్నాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ వేణుగోపాల గౌడ.. ఈశ్వరయ్య ఆడియో టేపులను కూడా జత చేశామని, అందులో ఆయన వాయిస్ కూడా నిజమేనని తేలిందని రామకృష్ణ తరపు న్యాయవాది చెప్పారు. ఈశ్వరయ్యకు ఈ పిటిషన్‌తో సంబంధం ఉందని.. ఆయన కుట్రను ఛేదించేందుకే తాము ఇంప్లీడ్ అవుతున్నామని వాదనలు వినిపించారు. ఈ సంఘటనపై సుప్రీంకోర్టు, లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని రామకృష్ణ తరపు న్యాయవాది కోరారు.

Updated Date - 2020-08-10T23:10:13+05:30 IST