కేబీఆర్ పార్కు చౌరస్తా కూడా..
ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యోచన
హైదరాబాద్/బంజారాహిల్స్: ట్రాఫిక్‌కు ఆటంకాలు ఏర్పడకుండా సజావుగా సాగేందుకు సిగ్నల్ లేని చౌరస్తా ప్రతిపాదన మరోసారి తెర మీదకు వచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్స్ పూర్తిగా మూసివేసి ప్రత్యామ్నాయంగా యూ టర్న్ పద్ధతి అమలులోకి తీసుకురావాలని ట్రాఫిక్ పోలీసులు సమాలోచన చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు చౌరస్తాలో అమలు చేయాలని భావిస్తున్నారు. గురువారం ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఏవీ రంగనాథ్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ ముత్తు, జీహెచ్ఎంసీ ఈఈ విజయకుమార్, ఏఈ వెంకటేష్, సీఆర్ఎంపీ మేనేజర్ శ్రీరాంమూర్తి తదితరులు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు చౌరస్తాను పరిశీలించారు. ఇప్పటికే రోడ్డు నెంబరు 36 నుంచి బంజారాహిల్స్‌కు వెళ్లే ట్రాఫిక్‌ను చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద యూటర్న్ పద్ధతిలో మళ్లిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గిందని పోలీసులు భావిస్తున్నారు.
రోడ్డు నెంబరు 5నుంచి ఫిలింనగర్‌కు వెళ్లే వాహనాలు సిగ్నల్ కోసం వేచి చూడకుండా జింఖానా క్లబ్‌కు సమీపంలో యూ టర్న్ తీసుకోవడం, ఫిలింనగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు వెళ్లే వాహనాలు రోడ్డు నెంబరు 36 వద్ద యూటర్న్ తీసుకునేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. దీని అమలుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ కొన్ని సూచనలు చేశారు. కొన్నిచోట్ల యూటర్న్ తీసుకునే రోడ్డును విస్తరించాలని సూచించారు. శుక్రవారం కేబీఆర్ పార్కు చౌరస్తాను పరిశీలించనున్నారు. తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.