2న ధవళేశ్వరంలో పవన్‌ ‘శ్రమదానం’

ABN , First Publish Date - 2021-09-29T06:50:07+05:30 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వచ్చేనెల 2న ధవళేశ్వరం లో పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ తెలిపారు. కాకినాడ ముత్తా క్లబ్‌లో నిర్వహించిన మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

2న ధవళేశ్వరంలో పవన్‌ ‘శ్రమదానం’
ఎస్పీ రవీంద్రనాధ్‌బాబుకు వినతిపత్రం అందిస్తున్న జనసేన పార్టీ నాయకులు

  • జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌
  • భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీకి వినతి

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 28: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వచ్చేనెల 2న ధవళేశ్వరం లో పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ తెలిపారు. కాకినాడ ముత్తా క్లబ్‌లో నిర్వహించిన మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గుంతలు, గతుకులు, ఛిద్రంగా మారిన రహదారుల ఫొటోలు తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో రోడ్ల మరమ్మతుల ద్వారా శ్రమదానంలో పాల్గొనేందుకు పవన్‌కల్యాణ్‌ ధవళేశ్వరం విచ్చేస్తున్నారన్నారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా 2న నియోజకవర్గాల స్థాయిలో అధ్వానంగా మారిన రోడ్ల మరమ్మతులకు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవడం, ఇసుక, ఆస్తి పన్ను పెంచడంపైనే ప్రభుత్వం ధ్యాసంతా ఉందన్నారు. చివరకు చెత్తపై పన్ను విధిస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికులు, ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌లెస్‌ క్యాలెండర్‌, రైతుల సమస్యలపై ప్రజలపక్షాన పవన్‌ పోరాటం చేస్తున్నారన్నారు. సమావేశంలో పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్‌, పితాని బాలకృష్ణ, నాయకులు ఎస్‌.రాజబాబు, ఎ.సత్యనారాయణ, తుమ్మల బాబు, వరుపుల తమ్మయ్యబాబు, పాఠంశెట్టి సూర్యచంద్ర, ఎం.శేషుకుమారి, తలాటం సత్య పాల్గొన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న పవన్‌కల్యాణ్‌కు తగిన భద్రత కల్పించాలని కోరుతూ జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కాకినాడలో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుని కలిసి వినతిపత్రం అందించారు.

Updated Date - 2021-09-29T06:50:07+05:30 IST