ఉద్యోగులకు సీఎం వెన్నుపోటు

ABN , First Publish Date - 2022-01-22T06:33:17+05:30 IST

రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులకు సీఎం జగన్‌ వెన్నుపోటు పొడిచారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి, సిటీ అధ్యక్షుడు పోతిన మహేష్‌ వి మర్శించారు.

ఉద్యోగులకు సీఎం వెన్నుపోటు

జనసేన అధికార ప్రతినిధి పోతిన

వన్‌టౌన్‌, జనవరి 21 : రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులకు సీఎం జగన్‌ వెన్నుపోటు పొడిచారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి, సిటీ అధ్యక్షుడు పోతిన మహేష్‌ వి మర్శించారు. శుక్రవారం వన్‌టౌన్‌లోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేతన సవరణతో జీతాలు పెరుగుతాయి కానీ తగ్గుతాయన్నది వైసీపీ పాలనలోనే తెలిసిందన్నారు. వేతన సవరణ పదేళ్లకొకసారి అనడం ఉద్యోగులను వచించడమేనన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎ్‌స)ను రద్దు చే యాలని కోరితే చింతామణి నాటకాన్ని రద్దు చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఉద్యోగ సంఘాల నేతల చేతిలో ఇప్పుడేమీ లేదని, వాళ్లు చెబితే వినే పరిస్థితి లేదన్నారు. సంఘ నేతలు సీఎం ఎదుట చప్పట్లు కొట్టి పది రోజులు కాకముందే ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేశారన్నారు. జగన్‌ను నమ్మి ఉద్యోగ సంఘాల నేతలు మోసపోయారన్నారు. 30 వే ల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే రూ.14వేల కోట్ల మేరకు ఇవ్వాల్సి వస్తుందన్న కారణంగా పదవీ విరమణ వయస్సు పెంచారన్నది వాస్తవమన్నారు. జగన్‌ అనుసరిస్తు న్న ప్రస్తుత వేతన విధానం వల్ల ప్రతి ఉద్యోగికి రెండు ఇంక్రిమెంట్లు తగ్గి జీతంలో కోత పడుతుందన్నారు. 16 శాతం మేరకు ఇంటి అద్దె అలవెన్సు కోత పెట్టడం దారుణమన్నారు. ఫిట్‌మెంట్‌లో మెలిక పెట్టి, బకాయిలు ఇవ్వకుండా రద్దు చేసి, ఉద్యోగులే ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు ప్రభుత్వానికే చెల్లించాలనడం నయవంచనేనని స్పష్టం చేశారు. కంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను దారుణంగా మోసం చేశారని, కనీస జీతం గురించి మాట్లాడకుండా మొండిచేయి చూపించారన్నారు. పీఎ్‌ఫపై ఉద్యోగులు రుణాల కోసం దరఖాస్తులు పెట్టుకుంటే ఏడాది నుంచి రూ.2400 కోట్లు ఎందుకు చెల్లించడం లేదన్నారు. అశుతోష్‌ మిశ్రా నివేదికను బహిర్గతం చేయాలన్నారు. మొత్తంగా ఉద్యోగులను మోసం చేసి వారినే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉద్యోగుల ఉద్యమానికి జనసేన మద్దతు ఇస్తోందన్నారు. 

Updated Date - 2022-01-22T06:33:17+05:30 IST