కళాశాలలు పెడ్తారా.. లేదా?

ABN , First Publish Date - 2022-05-30T05:54:41+05:30 IST

మండలానికో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఏర్పాటు వికారాబాద్‌ జిల్లాలో అమలు కావడం లేదు. జిల్లాలో 19 మండలాలుండగా 9 మండల కేంద్రాల్లోనేప్రభుత్వజూనియర్‌ కాలేజీలు ఉన్నాయి.

కళాశాలలు పెడ్తారా.. లేదా?

  • సగం మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లేవ్‌
  • కొన్ని చోట్ల ఏర్పాటుకు ఏళ్ల కిందనే మంజూరు
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా ప్రభుత్వం ప్రారంభించేనా?
  • జూనియర్‌ కాలేజీలకు నోచుకోని ధారూరు, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌
  • ఏడాదిగా సీఎంవోలో ప్రతిపాదనలు పెండింగ్‌
  • ఎమ్మెల్యేలు, విద్యా శాఖ మంత్రి తగిన శ్రద్ధ తీసుకుంటేనే కళాశాలల కార్యరూపం
  • స్థానికంగా కాలేజీల్లేక పెరుగుతున్న డ్రాపౌట్స్‌
  • వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 9
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు లేని మండలాలు 10
  • కొత్తగా ప్రతిపాదించిన కళాశాలల సంఖ్య 3


మండలానికో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఏర్పాటు వికారాబాద్‌ జిల్లాలో అమలు కావడం లేదు. జిల్లాలో 19 మండలాలుండగా 9 మండల కేంద్రాల్లోనేప్రభుత్వజూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. యాలాల, బషీరాబాద్‌, కోట్‌పల్లి, ధారూరు, బంట్వారం, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌, పూడూరు, కులకచర్ల, చౌడాపూర్‌ మండల కేంద్రాలు ఇప్పటికీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు నోచుకోవడం లేదు. పక్క మండలాలకు వెళ్లి చదువుకోలేక, స్థానికంగా ప్రైవేట్‌ కాలేజీల్లో చేరే స్థోమత లేక చాలా మంది టెన్త్‌ పాసైన విద్యార్థులు ఇంటర్‌ విద్యకు దూరం అవుతున్నారు. ఇదిలా ఉంటే దూరాభారంతో బాలికల్లో ఇంటర్‌ డ్రాపౌట్స్‌ శాతం ఎక్కువగా ఉంటోంది.


వికారాబాద్‌, మే 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన మూడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు రానున్న విద్యా సంవత్సరం నుంచైనా ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. వికారాబాద్‌ నియోజకవర్గంలో ధారూరు, కొడంగల్‌ నియోజకవర్గంలో బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఏర్పాటు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ధారూరు, దౌల్తాబాద్‌, బొంరా్‌సపేట్‌ మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఏర్పాటు ఎంత అవసరమో జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు వివరించారు. ధారూరు, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో ఏటా పదో తరగతి విద్యార్థుల సంఖ్య ఎంత? వారిలో పాస్‌ అయిన వారు ఇంటర్‌ విద్య కోసం ఎక్కడికి వెళ్తున్నారో పేర్కొన్నారు. ఈ మండల కేంద్రాల్లో జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఎంత మంది విద్యార్థులకు మేలు కలుగుతుందనే విషయా న్నీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్ఫు టంగా నివేదించారు. జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు అవసరమయ్యే వసతులు, పోస్టు లు, నిర్వహణ ఖర్చు వివరాలనూ నివేదికలో పొందుపరిచారు. ఈ మూడు చోట్ట జూనియర్‌ కాలేజీలు 2021-22 విద్యాసంవత్సరమే ప్రారంభమవుతాయన్న సంకేతాలు వెలువడినా ఆ ఫైల్‌ను ఎవరూ పట్టించుకోకే కాలేజీ లు ప్రారంభం కాలేదని తెలుస్తోంది.


  • ఎమ్మెల్యేలు, మంత్రి సబిత చొరవ తీసుకుంటేనే..

కొత్తగా జూనియర్‌ కళాశాలల ఏర్పాటుఫైల్‌ సీఎంవోలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఏడాదిన్నర కింద ధారూరు, దౌల్తాబాద్‌, బొంరా్‌సపేటల్లో జూనియర్‌ కళాశాలల ఏర్పాటు ఫైల్‌ సీఎంవోకు పంపారు. కరోనా ఉధృతి, లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఆ ఫైల్‌ను పక్కన పడేశారు. ఈ మూడు మండలాల్లో జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తే, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేస్తారు. జీవో ప్రకారం ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి కొత్త కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులిస్తారు. అయితే ఇదంతా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జరగాల్సిన ప్రక్రియ. ఆ లోగా యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకుంటేనే గానీ వచ్చే జూన్‌లో ప్రారంభమయ్యే ఇంటర్‌ అడ్మిషన్లలోగా కాలేజీ ఏర్పాటు కాదు. దీని కోసం ఎమ్మెల్యేలు, మంత్రి సబితారెడ్డి పూనుకొని హైదరాబాద్‌లో ఫైల్‌ కదిలిస్తేనే కొత్త జూనియర్‌ కాలేజీలు వచ్చే ఆస్కారం ఉంది. ఈ విషయంలో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పాత్ర కీలకం కానుంది. ఎమ్మెల్యేలు చొరవతీసుకొని ప్రభుత్వం వొత్తి డి తెస్తే కొత్త కాలేజీల ఏర్పాటు ప్రక్రి య మొదలయ్యే ఆస్కారం ఉంది.


  • మండలానికో ప్రభుత్వ కాలేజీ ఏర్పాటయ్యేనా...

ప్రతీ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చలేదు. దీంతో గ్రామీణ విద్యార్థులు దూ ర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్‌ చదువాల్సి వస్తోంది. ఈ కారణంలో డ్రాపౌట్స్‌ కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆడ పిల్లలను దూర ప్రాంతాల్లో చదవించేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. ఫీజులూ భరించలేక చదువు మాన్పిస్తున్నారు. కొత్త గా ఏర్పాటైన చాలా మండలాల్లో జూనియర్‌ కాలేజీ లను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో 19 మండలాలు ండగా, 9మండలాల్లోనే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ లున్నాయి. తాండూరు నియోజకవర్గంలో తాండూరు, పెద్దేముల్‌, వికారాబాద్‌ నియోజకవర్గంలో మ ర్పల్లి, మోమిన్‌పేట్‌, వికారాబాద్‌, పరిగి నియోజకవర్గంలో పరిగి, దోమ, కొడంగల్‌ నియోజకవర్గం కొడంగల్‌, చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేటల్లో మాత్రమే జూనియర్‌ కాలేజీలున్నాయి. యాలాల, బషీరాబాద్‌, కోట్‌పల్లి, ధారూరు, బంట్వారం, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌, పూడూరు, కులకచర్ల, చౌడాపూర్‌ మండలాల్లో జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు కాలేదు.


  • ఇంటర్‌ విద్య కోసం పక్క మండలాలకు విద్యార్థులు

సొంత మండల కేంద్రాల్లో జూనియర్‌ కాలేజీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొంత ఆర్థికంగా ఉన్న వారు ప్రైవేట్‌ కాలేజీల్లో చేర్పిస్తుండగా, పేద విద్యార్థులు వేరే మండలాల్లో ఉండే ప్రభుత్వ కాలేజీలకు వెళ్తున్నారు. అయితే రవాణ ఖర్చులు సైతం తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. దూర ప్రాంతా నికి ప్రయాణంతో సమయం వృథా అవుతోంది. ఆ ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతోంది. సొంత మండలంలో జూనియర్‌ కాలేజీ ఉంటే అర్ధగంట, 45ని మిషాల్లోపు ఇళ్లలో ఉండే అవకాశం ఉంటుంది. మర్పల్లి కళాశాలలో మర్పల్లి, బంట్వారం, కోట్‌పల్లి మండలాల విద్యార్థులు, మోమిన్‌పేట కాలేజీలో నవాబుపేట, మర్పల్లి మండలాల విద్యార్థులు చదువుతున్నారు. దోమ కళాశాలలో దోమ, కులకచర్ల, పరిగి మండలాల విద్యార్థులు అడ్మిట్‌ అవుతున్నారు. వికారాబాద్‌ కళాశాలలో వికారాబాద్‌, ధారూరు, పూడూరు మండలాల విద్యార్థులు చదువుతున్నారు. తాండూరు జూనియర్‌ కళాశాల లో తాండూరు, యాలాల్‌, బషీరాబాద్‌ మండలాల విద్యార్థులు చదువుతుంటే, పెద్దేముల్‌ కాలేజీలో పెద్దేము ల్‌, కోట్‌పల్లి, బంట్వారం మండలాల పరిధి విద్యార్థులు చదువుతున్నారు. దూర ప్రాంత విద్యార్థులు కొందరు టెన్త్‌తోనే ఆపేస్తున్నారు. ఎవరి సొంత మండలంలో వారికి ప్రభుత్వ కాలేజీ ఉంటే టెన్త్‌ పాసైన బాలబాలికల్లో 95శాతం మంది ఇంటర్‌ చదివే ఆస్కారం ఉంది. అందుకే ప్రతీ మండల కేంద్రలో ప్రభుత్వం జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.


  • ప్రతిపాదనలు పంపించాం : ఎన్‌.శంకర్‌, ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి, వికారాబాద్‌ 

జిల్లాలో కొత్తగా ధారూరు, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. అవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి రాగానే జూనియర్‌ కళాశాలలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-05-30T05:54:41+05:30 IST