జేపీఎస్‌ షాక్‌!

ABN , First Publish Date - 2022-04-29T08:12:54+05:30 IST

గ్యారెంటీ పెన్షన్‌ స్కీం(జీపీఎస్‌) అంటూ సీపీఎస్‌ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. ఈ విధానాన్ని తరచి చూస్తే అది జగన్‌..

జేపీఎస్‌ షాక్‌!

పెన్షన్‌పై ఐటీ దెబ్బ!

30 ఏళ్ల కష్టార్జితంపై 30 ఆదాయ పన్ను

సీపీఎస్‌ నిధులపై ప్రస్తుతం 9 శాతం వడ్డీ

4 శాతానికి తగ్గొచ్చని ఉద్యోగుల ఆందోళన

రిటైరయ్యాక వచ్చేది 20 కాదు 7 శాతమే

చంద్రబాబు జీపీఎస్‌లో ‘స్పెషల్‌ ఫండ్‌’

జగన్‌ జీపీఎస్‌లో ఆ ఊసే లేదు

అంకెల గారడీతో ఉద్యోగులకు బురిడీ


సీపీఎస్‌ను రద్దుచేస్తానన్న జగన్‌.. తాజాగా ప్రతిపాదించిన గ్యారెంటీ పెన్షన్‌ స్కీం (జీపీఎస్‌).. జగన్‌ పెన్షన్‌ స్కీం (జేపీఎస్‌) అని ఉద్యోగులు మండిపడుతున్నారు. సామాజిక భద్రత ఏ మాత్రం లేకపోగా.. తాము 30 ఏళ్లు కష్టపడి దాచుకున్న సంపాదనపై 30 శాతం ఆదాయ పన్ను విధించాలని చూడడం దారుణమని అంటున్నారు. రాష్ట్ర ఆదాయం ఏటికేడాది పెరుగుతుంటే.. దానిని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి జీతాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరగబోతోందని దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తుతున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): గ్యారెంటీ పెన్షన్‌ స్కీం(జీపీఎస్‌) అంటూ సీపీఎస్‌ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. ఈ విధానాన్ని తరచి చూస్తే అది జగన్‌ మార్క్‌ పెన్షన్‌ స్కీం(జేపీఎ్‌స)లా ఉందని ఉద్యోగులు అంటున్నారు. పీఆర్‌సీ చర్చల సమయంలో.. కొత్త పీఆర్‌సీ వద్దు.. పాత జీతాలే కావాలనిఎలాగైతే ఉద్యోగులను అడిగేటట్లు చేశారో ఇప్పుడు కూడా జీపీఎస్‌ వద్దు.. సీపీఎస్‌ కావాలని వారు కోరేలా కొత్త స్కీం ఉందని చెబుతున్నారు. అందుకే ఇది జీపీఎస్‌ కాదు.. జేపీఎస్‌ అని అంటున్నారు. సీపీఎ్‌సలో ఉన్న ఏ ఒక్క అవలక్షణం నుంచీ వారికి ఇందులో ఊరట లభించలేదు. చంద్రబాబు హయాంలో అప్పటి సీఎస్‌ ఠక్కర్‌తో చర్చలు జరిగినప్పుడు ఓపీఎస్‌ ఉద్యోగులతో సమానంగా సీపీఎస్‌ ఉద్యోగులకు పెన్షన్‌ అందించేందుకు ప్రత్యేక ఫండ్‌ ఏర్పాటు చేసి దానిని చట్టబద్ధం చేస్తామని ఆయన ప్రతిపాదించారు.


ఓపీఎస్‌ ఉద్యోగికి, సీపీఎస్‌ ఉద్యోగికి పెన్షన్‌లో ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఫండ్‌ నుంచి చెల్లిస్తామన్నారని ఉద్యోగులు వెల్లడించారు. అయితే అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ సీపీఎస్‌ రద్దు హామీ ఇవ్వడంతో ఠక్కర్‌ ప్రతిపాదననపై తాము ఆసక్తి చూపలేదన్నారు. ఇప్పుడు జగన్‌ తమ ముందుంచిన జీపీఎ్‌సలో ఈ ప్రత్యేక ఫండ్‌ కనిపించలేదని.. ఇది లేకుండా ఓపీఎస్‌, సీపీఎస్‌ ఉద్యోగుల మధ్య ఉండే పెన్షన్‌ వ్యత్యాసాన్ని ఎలా తగ్గిస్తారో స్పష్టత ఇవ్వలేదని.. ఇది తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. 


రిటైర్మెంట్‌ తర్వాత వచ్చేది 7 శాతమే

ప్రస్తుతం 30 ఏళ్లు సర్వీసు పూర్తి చేసి రిటైరైన సీపీఎస్‌ ఉద్యోగికి తాను అందుకున్న చివరి వేతనంలో 20.3 శాతం మొత్తం ప్రతి నెలా పెన్షన్‌ రూపంలో అందుతుందని ప్రభుత్వం జీపీఎస్‌ ప్రజంటేషన్‌లో చెప్పింది. వాస్తవంగా తమకు పెన్షన్‌ రూపంలో అందేది 6 నుంచి 7 శాతం మాత్రమేనని సీపీఎస్‌ ఉద్యోగులు చెబుతున్నారు. ఎందుకంటే ఉద్యోగులు ప్రారంభంలో ఎక్కువ కాలం.. జీతం తక్కువగా ఉండే కిందిస్థాయి పోస్టుల్లోనే పనిచేస్తారు. తర్వాత ప్రమోషన్లు వచ్చి జీతం ఎక్కువగా ఉండే పైస్థాయి పోస్టుల్లో తక్కువ కాలం పనిచేస్తారు. అంటే ఎక్కువ కాలం పాటు తక్కువ జీతంలో నుంచే 10ు కంట్రిబ్యూషన్‌ చేస్తారు. తక్కువ కాలం మాత్రమే అధిక జీతంలో నుంచి 10ు వాటా ఇస్తారు.


అంటే సీపీఎస్‌ ఉద్యోగులకు సంబంధించి పోగయ్యే ఫండ్‌ తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు కేంద్రం, కొన్ని రాష్ట్రాలు తమ కంట్రిబ్యూషన్‌ను 14 శాతానికి పెంచాయి. మన రాష్ట్రంలో మాత్రం పెంచలేదు. అంటే రాష్ట్రంలో సీపీఎస్‌ ఉద్యోగులు ఈ రకంగానూ నష్టపోతున్నారు. రిటైర్మెంట్‌ నాటికి పోగయ్యే ఫండ్‌లో నుంచి 60 శాతం మాత్రమే రిటైరయ్యాక వారికి ఇస్తారు. ఈ 60 శాతం కింద రావలసిన మొత్తంలో 50 శాతంపై వారు 30ు ఐటీ  చెల్లించాలి. ఉదాహరణకు.. సీపీఎస్‌ ఉద్యోగి రిటైరయ్యే నాటికి కోటి రూపాయల ఫండ్‌ జమయితే.. ఇందులో 60ు ఉద్యోగికి చెందుతుంది. అంటే రూ.60 లక్షలు. ఈ రూ.60 లక్షల్లో సగం అంటే 30 లక్షలపై ఆ ఉద్యోగి 30 శాతం ఆదాయ పన్ను చెల్లించాలి. 9 లక్షలు పోను ఆ ఉద్యోగికి మిగిలేది రూ.51 లక్షలు.


ఈ మొత్తాన్ని కూడా నేరుగా ఉద్యోగి చేతికివ్వరు. కేంద్రం చెప్పిన ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి.. వాటిపై వచ్చే రాబడిని నెలా నెలా పెన్షన్‌ రూపంలో అందజేస్తారు. ఇలా వచ్చే రాబడి తాము చివరిగా తీసుకున్న వేతనంలో 20 శాతం ఉండదని, 6-7 శాతమే ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. ఓపీఎస్‌ ఉద్యోగులు రూ.లక్ష వేతనం తీసుకుంటే అందులో 50 శాతం.. అంటే రూ.50,000 నెలనెలా పెన్షన్‌ వస్తుంది. ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం సీపీఎస్‌ ఉద్యోగులకు 20 శాతమే..  రూ.20,000 పెన్షన్‌ వస్తుంది. కానీ ఉద్యోగులు అది రూ.7-8 వేలకు మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అలాంటిది జీపీఎ్‌సలో 33 శాతం పెన్షన్‌ ఇస్తామని ప్రభుత్వం ఎలా లెక్కలు కట్టిందో అర్థం కావడం లేదని.. ఎలాంటి నిర్దిష్టత, ప్రామాణికత లేకుండా ఎలా లెక్కకట్టిందని ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్‌ అమల్లోకి వచ్చిన కొత్తలో ఉద్యోగులకు నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌సడీఎల్‌).. సీపీఎస్‌ నిధులపై 11 శాతం వడ్డీ ఇచ్చేది. ఇప్పుడు 9 శాతానికి తగ్గించినట్లు ఇటీవల ప్రకటించింది. మార్కెట్లో వడ్డీరేట్లు ఇంకా తగ్గి 4 శాతానికి పడిపోయాయని, దీని ఆధారంగా తమ ఫండ్‌పై వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


జీతాల ఖర్చులపై దుష్ప్రచారం..

2040వ సంవత్సరానికి ఉన్న పళంగా జీతాల ఖర్చు పెరుగుతుందంటూ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఉద్యోగులు, ప్రజలు బెంబేలెత్తేలా ప్రభుత్వం ఎత్తుగడ వేసిందన్న విమర్శలు వస్తున్నాయి. 2014-15లో విభజిత రాష్ట్ర రెవెన్యూ ఆదాయం రూ.65,695 కోట్లు వస్తే.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి అది రూ.లక్షన్నర కోట్లకు పెరిగింది. అంటే ఆరేళ్లలో రాష్ట్ర ఆదాయం రూ.84,305 కోట్లు పెరిగింది. ఈ లెక్కలు ప్రామాణికంగా తీసుకుంటే 2040 నాటికి రాష్ట్ర ఆదాయం రూ.4.31 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. అంటే మన ఆదాయం 2040 నాటికి రూ.2.81 లక్షల కోట్లు పెరుగుతుందన్న మాట. కానీ జగన్‌ ప్రభుత్వం దీనిని దాచిపెట్టి.. 2040 నాటికి రాష్ట్ర సొంత ఆదాయంలో వేతనాలు, పెన్షన్ల వ్యయం 106 శాతానికి పెరుగుతుందని చూపించడం దారుణమని ఉద్యోగులు మండిపడుతున్నారు.


ఓపీఎస్‌, సీపీఎస్‌ ఉద్యోగులకు పెన్షన్‌ను బడ్జెట్‌ నుంచి ఇస్తామని ప్రభుత్వం తన పవర్‌ పాయింట్‌  ప్రజెంటేషన్‌లోని 18, 19 పేజీల్లో పేర్కొంది.. అయితే వారికి పెన్షన్‌ ఎన్‌ఎ్‌సడీఎల్‌ నుంచి వస్తోంది. అది ఎవరిస్తారో కూడా తెలియకుండా అవగాహనలేమితో ప్రజెంటేషన్‌ తయారు చేశారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఉద్యోగులకు సామాజిక భద్రత జీపీఎస్‌లోనూ లేదు. ఉద్యోగులు తమ వాటాను జీతాల నుంచి చెల్లించాల్సిందే. 

పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) ఇలా..

ఉద్యోగి పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో సామాజిక భద్రత ఉంటుంది. పెన్షన్‌ బాధ్యత ప్రభుత్వానిదే. 

పెన్షన్‌ ఫండ్‌ ఏర్పాటు ప్రత్యేకంగా ఉండదు.

ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా డీఏ పెంపు, పీఆర్‌సీ వర్తించి పెన్షన్‌ వస్తుంది.

70 ఏళ్లు దాటిన వారికి అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ వస్తుంది.

హెల్త్‌ కార్డులపై వైద్యం.

ఉద్యోగికి పీఎఫ్‌ ఖాతా. కమ్యూటేషన్‌ ఉంటుంది.

సీపీఎస్‌, జేపీఎస్‌ సేమ్‌ టూ సేమ్‌

సర్వీసులో ఉన్నంత వరకే ఉద్యోగి భద్రత ప్రభుత్వానిది. అనంతరం బీమా కంపెనీ యాన్యుటీ ప్రొవైడర్లకు బదలాయింపు.

ఉద్యోగి, ప్రభుత్వం ఇద్దరూ పెన్షన్‌ ఫండ్‌కు కాంట్రిబ్యూట్‌ చేయాలి.

పెన్షన్‌ ఫండ్‌ ఉంది. కానీ ప్రభుత్వ నియంత్రణలో ఉండదు.  

డీఏ, పీఆర్‌సీ పెరిగితే పెన్షన్‌ పెంపు ఉండదు.

అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌, హెల్త్‌కార్డుల సౌకర్యం ఉండదు.

ఉద్యోగికి పీఎఫ్‌ సౌకర్యం ఉండదు.. కమ్యూటేషన్‌ ఉండదు.


మాకు పాత పెన్షనే కావాలి..

సీపీఎ్‌సలో ఉంటే అన్ని అసౌకర్యాలూ జీపీఎ్‌సలో ఉన్నాయి. మాకు సామాజిక బాధ్యతతో భద్రతతో కూడిన పాత పెన్షన్‌ విధానాన్నే మాకు అమలు చేయాలి. సీపీఎస్‌ ఉద్యోగికి 20.3 శాతం పెన్షన్‌ వస్తుందని లెక్కగట్టిన విధానం సరికాదు. షేర్‌ మార్కెట్‌ ఆధారంగా సీపీఎస్‌ ఉద్యోగుల పెన్షన్‌లో ఎగుడు దిగుడులు ఉంటాయి.

- హృదయరాజు, ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు

Updated Date - 2022-04-29T08:12:54+05:30 IST