ఈ యేడాది ‘సాఫల్యతల యేడాది’ : జేపీ నడ్డా

ABN , First Publish Date - 2020-05-30T20:06:49+05:30 IST

60 ఏళ్లుగా అభివృద్ధిలో ఉన్న అంతరాన్ని ఆరేళ్లలో ప్రధాని మోదీ పూరించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.

ఈ యేడాది ‘సాఫల్యతల యేడాది’ : జేపీ నడ్డా

న్యూఢిల్లీ : 60 ఏళ్లుగా అభివృద్ధిలో ఉన్న అంతరాన్ని ఆరేళ్లలో ప్రధాని మోదీ పూరించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. మోదీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టి యేడాది పూర్తైన సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ యేడాది ‘‘సాఫల్యతల యేడాది’’ అని ఆయన అభివర్ణించారు. ఊహించని పరిణామాలు సంభవించినా, వాటిని ప్రధాని మోదీ ధైర్యంతో ఎదుర్కొన్నారని ఆయన ప్రశంసించారు.


దీనికి ఉదాహరణగా నడ్డా ఆర్టికల్ 370 రద్దును ఉటంకిస్తూ.... దేశమంతా ఒకే జెండా కిందికి రావడానికి ఈ నిర్ణయం దోహదపడిందన్నారు. మోదీ ప్రభుత్వం ప్రతిస్పందించే ప్రభుత్వమని, అలాగే సలహాలను కూడా స్వీకరించడంతో పాటు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న ప్రభుత్వమని ఆయన తెలిపారు. రాజకీయ రంగంలో ఓ సాంస్కృతిక మార్పును మోదీ తీసుకొచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.


ఏది జాతికి అవసరమో దాన్ని మాత్రమే సకారాత్మకంగా అమలు చేస్తామని, ఏదో ఒకటి చేసేద్దాం... అన్న ధోరణిలో తమ ప్రభుత్వం నడుచుకోవడం లేదని తేల్చి చెప్పారు. మోదీ పాలనపై 250 ప్రెస్‌మీట్లు, దేశమంతా 2000 ర్యాలీలతో ప్రచారం చేస్తామని జేపీ నడ్డా పేర్కొన్నారు. 


Updated Date - 2020-05-30T20:06:49+05:30 IST