West Bengalలో దేశ విభజన నాటి హింస: జేపీ నడ్డా

ABN , First Publish Date - 2021-05-04T22:00:42+05:30 IST

పశ్చిమ బెంగాల్‌ శాసన సభ ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసాకాండ

West Bengalలో దేశ విభజన నాటి హింస: జేపీ నడ్డా

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ శాసన సభ ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసాకాండ స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ జరగలేదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దేశ విభజన సమయంలోనే ఇంత తీవ్రంగా హింస జరిగినట్లు విన్నామన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరుగుతున్న హింస తమను దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురి చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో అసహనాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ చూడలేదన్నారు. ఈ సైద్ధాంతిక పోరాటానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. టీఎంసీ కార్యకలాపాలు పూర్తిగా అసహనంతో నిండిపోయాయని ఆరోపించారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడటానికి సిద్ధమని చెప్పారు. సౌత్ 24 పరగణాలలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జరిగిన విధ్వంసంలో దెబ్బతిన్న కార్యకర్తల ఇళ్లను సందర్శిస్తానని చెప్పారు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పారు. 




ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ బలపడుతుండటాన్ని అధికార టీఎంసీ ఓర్చుకోలేకపోతోందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కోల్‌కతా, అసన్‌సోల్, నందిగ్రామ్‌లలో హింస ప్రజ్వరిల్లిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలపై కూడా హింసకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడులకు టీఎంసీదే బాధ్యత అని చెప్తున్నారు. ఈ హింసాకాండపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఆ పార్టీ నేత గౌరవ్ భాటియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 


బీజేపీ విడుదల చేసిన ప్రకటనలో, ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటల్లోనే అనేక మంది బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, తొమ్మిది మంది మరణించారని, అనేక మంది గాయపడ్డారని ఆరోపించింది. తమ పార్టీ కార్యకర్తలు నిర్వహించే దుకాణాలను టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆరోపించింది. మమత బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ ఆధిక్యత సాధించడంతో టీఎంసీ కార్యకర్తలు రక్తపాతం, హింసాకాండలతో విజయోత్సవాలు నిర్వహించారని మండిపడింది. 


జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం నుంచి రెండు రోజులపాటు పర్యటిస్తారు. టీఎంసీ కార్యకర్తల హింసాకాండలో తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని బీజేపీ ఆరోపిస్తోంది. టీఎంసీ ఆగడాలను నిరసిస్తూ మే 5న దేశవ్యాప్తంగా బీజేపీ మండల కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ధర్నా నిర్వహించాలని కేడర్‌ను ఆదేశించింది. 




Updated Date - 2021-05-04T22:00:42+05:30 IST