కుటుంబ రాజకీయాలకు మేం వ్యతిరేకం: Jp Nadda

ABN , First Publish Date - 2021-11-25T14:11:29+05:30 IST

కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకమని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే రాజకీయాలు సాగాలన్నదే తమ ఉద్దేశమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కు

కుటుంబ రాజకీయాలకు మేం వ్యతిరేకం: Jp Nadda

- ఉన్నత సంస్కృతి తమిళనాడు సొంతం 

- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా


పెరంబూర్‌(చెన్నై): కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకమని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే రాజకీయాలు సాగాలన్నదే తమ ఉద్దేశమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయాలు సాగుతున్నాయని, వాటిని త్రీవంగా వ్యతిరేకిస్తున్న పార్టీ బీజేపీయేనని అన్నారు. తిరుప్పూర్‌లో బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జేపీ నడ్డా, ‘వీర వేల్‌...వెట్రి వేల్‌’, ‘అనైవరుక్కుమ్‌ వణక్కం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉన్నత సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన రాష్ట్రం తమిళనాడు అని, ధీరన్‌ చిన్నమలై, తిరుప్పూర్‌ కుమరన్‌ స్వాతంత్య్ర పోరాటంలో రాష్ట్రం తరఫున పాల్గొని తమ ప్రాణాలు అర్పించారని కొనియాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే అవినీతి, కుటుంబ సభ్యులే నాయకులుగా ఉన్న పార్టీ అని విమర్శించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు మార్చే దిశగా డీఎంకే పాలన చేస్తోందన్నారు. 1.3 బిలియన్‌ మంది ప్రజలను కరోనా నుంచి కాపాడేందుకు ప్రధాని మోదీ పోరాటం సాగిస్తున్నారని, ప్రపంచస్థాయిలో భారత్‌ను అభివృద్ధిపథంలో నడిపేందుకు కృషిచేస్తున్నారని కొనియాడారు. కరోనా కాలంలో పేద ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రధాని పథకాలు అమలు చేస్తున్నారని, అలాంటి ప్రధానిని విమర్శించ డమంటే దేశాన్ని వ్యతిరేకించినట్టేనని వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం దృష్ట్యా పలు పథకాలు చేపట్టామని, పార్టీ నేతలు కూడా రైతులకు కేంద్రం అందిస్తున్న పథకాలు వివరించాలని కోరారు. రూ.1 లక్ష కోట్ల వ్యయంతో రాష్ట్ర రహదారుల నిర్మాణం జరుగుతోందని అన్నారు. కరోనా కాలంలో కూడా పేదలకు సహాయాలు అందజేసేందుకు పార్టీ కార్యకర్తలు శ్రమించారని, డీఎంకే మాత్రం క్వారంటైన్‌లో ఉందన్నారు. కేవలం వీడియో కాన్ఫరెన్స్‌లకు మాత్రమే అధికారపార్టీ నేతలు పరిమి తమయ్యారని విమర్శించారు. గతంలో కరుణానిధి వరద నీటిలో నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారని, ప్రస్తుతం స్టాలిన్‌ కూడా ఫోటోలకు ఫోజులిస్తున్నారని జేపీ నడ్డా విమర్శించారు.


నాలుగు పార్టీ కార్యాలయాల ప్రారంభం

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణ యించింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 17 జిల్లాల పార్టీ కార్యాలయ భవన నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి. భవన నిర్మాణాలు పూర్తయిన తిరుప్పూర్‌, ఈరోడ్‌, తిరునల్వేలి, తిరుపత్తూర్‌ జిల్లాల పార్టీ కార్యాలయాలను ఆ పార్జీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పొన్‌.రాధాకృష్ణన్‌, రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వానతి శ్రీనివాసన్‌, నయినార్‌ నాగేంద్రన్‌, ఎంఆర్‌ గాంధీ, కేరళ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సీపీ రాధాకృష్ణన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరు.నాగరాజన్‌, బీజేపీ అధికార ప్రతినిధి, నటి ఖుష్బూ తదితరులు పాల్గొన్నారు. కాగా, జేపీ నడ్డా రాకను పురస్కరించుకొని తిరుప్పూర్‌ నగర డిప్యూటీ కమిషనర్లు అరవింద్‌, రవి నేతృత్వంలో ఆరుగురు సహాయ కమిషనర్లు, 8 మంది ఇన్‌స్పెక్టర్లు సహా 150 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుప్పూర్‌ సహా చుట్టుపక్కల జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలతో పెద్దసంఖ్యలో తరలివచ్చి జేపీ నడ్డాకు స్వాగతం పలికారు.


బీజేపీ తీర్థం పుచ్చుకున్న అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు...

తిరుప్పూర్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు చోళవందాన్‌ మాణిక్యం, సీటీ పళనిస్వామి, శివసేన రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణన్‌, తమిళనాడు ఇలైంజర్‌ కట్చి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డా.రాజశేఖర్‌, చెన్నై సబర్బన్‌ జిల్లా అన్నాడీఎంకే ఐటీ విభాగం అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, పీఎంకే రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీఆర్‌ దురైపాండి, అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి కడలూరు బాలమురుగన్‌లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ శాలువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - 2021-11-25T14:11:29+05:30 IST