జోజిలా సొరంగం.. కశ్మీర్‌ లైఫ్‌లైన్‌

ABN , First Publish Date - 2021-09-29T07:17:07+05:30 IST

జోజిలా సొరంగ మార్గం ద్వారా ఇరువైపులా రాకపోకలు సాగించవచ్చు. ఆసియాలో

జోజిలా సొరంగం.. కశ్మీర్‌ లైఫ్‌లైన్‌

  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మాణం..
  • పనులను సమీక్షించిన గడ్కరీ


(బల్తాల్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

జోజిలా సొరంగ మార్గం ద్వారా ఇరువైపులా రాకపోకలు సాగించవచ్చు. ఆసియాలో ఈ సదుపాయం ఉన్న అత్యంత పొడవైన సొరంగ మార్గం ఇదే. రాష్ట్రానికి చెందిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ఈ సొరంగాన్ని నిర్మిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో (11,575 అడుగులు) నిర్మిస్తున్న సొరంగ మార్గం ఇదే కావడం విశేషం. శ్రీనగర్‌, లేహ్‌-లద్దాఖ్‌ ప్రాంతానికి మధ్య ఉన్న జాతీయ రహదారి నెం.1లో జోజిలా పాస్‌ కీలకమైంది. రక్షణపరంగా వ్యూహాత్మకమైంది.


అయితే మంచు కారణంగా కొన్ని నెలలపాటు వాహన రాకపోకలు నిలిచిపోతుంటాయి. జోజిలా టన్నెల్‌ నిర్మాణం పూర్తయితే ఏడాది పొడవునా రాకపోకలకు అంతరాయం ఉండదు. జమ్మూ కశ్మీర్‌ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఈ సొరంగ మార్గం కేంద్ర బిందువు అవుతుంది. కశ్మీర్‌, లేహ్‌, లద్దాఖ్‌ ప్రజలకు ఈ మార్గం జీవనరేఖగా మారుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. స్థానిక ప్రజలకు పర్యాటకం, ఆతిథ్యం పరిశ్రమల్లో అవకాశాలు లభిస్తాయన్నారు. జోజిలా టన్నెల్‌ను సందర్శించి, నిర్మాణ పనులను గడ్కరీ సమీక్షించారు. పనుల వేగంపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.


ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ... ప్రాజెక్టును పూర్తి చేయడానికి మొదట్లో 2026 సెప్టెంబరు వరకూ గడువిచ్చామని, అయితే 2023 డిసెంబరు చివరినాటికి పూర్తి చేయాలని ఎంఈఐఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డిని కోరుతున్నానని తెలిపారు. 2020 జూన్‌లో రూ.4,509 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రాజెక్టును ఇచ్చామని, అంతకుముందు టెండర్‌తో పోలిస్తే ఇది రూ.4-5వేల కోట్లు తక్కువని మంత్రి అన్నారు.



ఎల్‌ఈడీ లైట్లు.. సీసీ కెమెరాలు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జోజిలా సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. సొరంగంలో ఎల్‌ఈడీ లైట్లు, సీసీ కెమెరాలు, టెలిఫోన్‌, ఫైర్‌ అలార్మింగ్‌ వ్యవస్థ వంటి సౌకర్యాలు ఉంటాయి. గాలి, వెలుతురు, భద్రత కోసం సొరంగం పైనుంచి మూడు వెంటిలేషన్‌ మార్గాలను ఏర్పాటు చేస్తారని మంత్రి తెలిపారు. బల్తాల్‌ వద్ద కొండ ప్రాంతాల్లో మొదలై మీనా మార్గ్‌ వద్ద సొరంగ మార్గం ముగుస్తుంది. మొత్తం 14.15 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.


ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని ప్రస్తుతం ఉన్న 40 కిలోమీటర్ల నుంచి 13 కిలోమీటర్లకు తగ్గిస్తుంది. జోజిలా టన్నెల్‌తోపాటు ప్రాజెక్టులో భాగంగా ఎంఈఐఎల్‌ రెండు చిన్న టన్నెల్‌లను, బ్రిడ్జ్‌లను, రహదారిపై మంచు పడకుండా ఇతర నిర్మాణాలను చేపట్టింది. ఇదే జాతీయ రహదారిపై జీ-మోర్‌ నుంచి జోజిలా మధ్య మరో కంపెనీ నిర్మిస్తున్న రెండు చిన్న సొరంగ మార్గాలను కూడా మంత్రి సందర్శించారు. శ్రీనగర్‌, లేహ్‌ రహదారి అభివృద్ధికి మరో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామన్నారు.


Updated Date - 2021-09-29T07:17:07+05:30 IST