సంతోషం, సంతాపం

ABN , First Publish Date - 2020-10-02T06:07:05+05:30 IST

జాతీయ స్వాతంత్ర్య సముపార్జనతో, గాంధీజీ జీవితం, చరితార్థమైనట్టు ఇతరులు భావించవచ్చు. కాని, 1947 ఆగస్టు 15వ తేదీ ఇతరులకే పర్వదినం...

సంతోషం, సంతాపం

జాతీయ స్వాతంత్ర్య సముపార్జనతో, గాంధీజీ జీవితం, చరితార్థమైనట్టు ఇతరులు భావించవచ్చు. కాని, 1947 ఆగస్టు 15వ తేదీ ఇతరులకే పర్వదినం కాని, ఆయనకు కాదు. ఆనాడు ఏ సభలోనూ, ఏ సమావేశంలోను ఆయన పాల్గొనలేదు. ఏ ఉత్సవం వైపు తొంగి చూడలేదు. నాడు ఆయన ఉపవాసం చేశాడు. ప్రార్థనలు చేశాడు. పెల్లుబికి వస్తున్న తన దుఃఖాన్ని ఎంతో కష్టంపై అణచి పెట్టుకున్నాడు.


దేశాన్ని రెండుగా చీల్చిన స్వాతంత్ర్యం ఆయన దృష్టిలో స్వాతంత్ర్యం కాదు, మత కల్లోలాలు లక్షల మందిని బలిగొంటు వుండగా వచ్చిన స్వాతంత్ర్యం ఆయన దృష్టిలో స్వాతంత్ర్యం కాదు. కొన్ని కోట్ల మందిని నిర్వాసితులను చేసిన స్వాతంత్ర్యం ఆయన దృష్టిలో స్వాతంత్ర్యం కాదు. అందు వల్లనే తక్కిన వారికి పర్వదినం గాంధీజీకి సంతాప దినమైంది. గాంధీజీ జీవితకాలంలో కంటే నేడు-నిజమే-పంటలు ఎక్కువ పండుతున్నాయి; పారిశ్రామికోత్పత్తి అధికంగా సాగుతున్నది; ఆనకట్టల సంఖ్య పెరిగింది; రోడ్ల నిడివి పెరిగింది; పవర్ సప్లయ్ హెచ్చింది; ఒక్క మాటలో జాతీయ సంపద పెరిగింది కాని, వీటన్నిటిని మించినవి గాంధీజీ దృష్టిలో వేరే వున్నాయి. అవి - నైతికపు విలువలు, మానవతకు ప్రాధాన్యమిచ్చే విలువలు. వీటి విషయంలో ఈనాడు మనం అతి హీనస్థితిలో వున్నాము.


ఏ జీవితరంగంలోనైనా ఈనాడు నీతికి, నిజాయితీకి, నిస్వార్థానికీ, నిర్మలత్వానికి స్థానం తక్కువ కాగా, రాజకీయరంగంలో కంచుకాగడాతో వెతకినా ఇవి కానరావడం లేదు. అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం, అష్టై శ్వర్యాల సంపాదన- అవి రాజకీయాలకు ఈనాడు ప్రథమ లక్ష్యాలు, ఇవే ప్రధాన ధ్యేయాలు. ‘పొలిటీషియన్’ అనడం ఈనాడు ఒక తిట్టు!

1969 అక్టోబర్ 2 ‘ఆంధ్రజ్యోతి’

సంపాదకీయం ‘గాంధీజీ ఈనాడు’ నుంచి

Updated Date - 2020-10-02T06:07:05+05:30 IST