జొన్న రొట్టే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. ఈ విషయాలు తెలిస్తే ఎగబడి మరీ తింటారు.. ఓ లుక్కేయండి..!

ABN , First Publish Date - 2021-10-31T17:01:01+05:30 IST

పల్లెల్లో ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఆహారంగా తీసుకునేది జొన్న రొట్టెనే....

జొన్న రొట్టే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. ఈ విషయాలు తెలిస్తే ఎగబడి మరీ తింటారు.. ఓ లుక్కేయండి..!

  • మధుమేహులకు మంచిదంటున్న డైటీషియన్లు
  • పోషక విలువలు అధికమంటున్న పరిశోధకులు
  • జొన్న.. తింటే ఆరోగ్యం మిన్న
  • భాగ్యనగరంలో వీధికో విక్రయ కేంద్రం


జొన్న రొట్టె.. ఒకప్పుడు పేదలు తినే ఆహారం. వరి అన్నం ఫేమస్‌ అయ్యాక వారూ జొన్నల వినియోగం తగ్గించారు. కానీ, ఇప్పుడు జొన్న అందరి ఆహారం అయింది. రోడ్డు పక్క కట్టెల పొయ్యిపై తయారు చేసే ఈ రొట్టెలను లొట్టలు వేసుకుని తింటున్నారు. నగరంలో ఎందరో మహిళలకు ఉపాధి కల్పిస్తున్న జొన్న రొట్టెలకు ఇంతగా ఆదరణ పెరగడానికి కారణం ఆరోగ్యం.


హైదరాబాద్‌ సిటీ : తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఆహారంగా తీసుకునేది జొన్న రొట్టెనే. బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌కు తోడు ఫైబర్‌, విటమిన్‌ ఏ, విటమిన్‌  సీ, క్రూడ్‌ ఫ్యాట్‌, అమినో యాసిడ్స్‌ ఇలా అత్యవసర పోషకాలు అధికంగా ఉండే ఆహారం జొన్న. ఆరోగ్యం మెరుగుపడాలంటే ఇది తప్పనిసరి. మధుమేహులకు ఇది చక్కటి భోజనం అని కూడా చెబుతున్నారు. హైదరాబాద్‌లో  ఇపుడు ఏ గల్లీ చూసినా తోపుడు బండ్లు, వాటి మీద కట్టెల పొయ్యి (కొన్నిచోట్ల గ్యాస్‌ కూడా ఉపయోగిస్తున్నారు), రెండు చేతుల నడుమ పిండి ముద్ద ఉంచి అందంగా రొట్టెలను చేస్తోన్న మహిళలు విరివిగా కనబడుతున్నారు.




మేలైన ఆహారం..

పోషకాలు సమృద్ధిగా కలిగిన ఆహారం జోవార్‌. గ్లూటెన్‌ లేకపోవడం, పలు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా న్యూ క్వినోవాగా దీన్ని పిలుస్తున్నారు. దీనిలో కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ ఉండటం వల్ల మధుమేహులకు చక్కటి అవకాశంగా నిలిచింది. ఇది నెమ్మదిగా గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. శాఖాహారులకు ఇది అత్యుత్తమం. 100 గ్రాముల జొవార్‌లో 10.4 గ్రాముల ప్రోటీన్‌ ఉంది. మన శరీరానికి ప్రతిరోజూ అవసరమైన ఫైబర్‌లో 40శాతం ఇది అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గించడంలో సహాయపడటంతోపాటుగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 


గ్లూటెన్‌ పదార్థాల ఎలర్జీ ఉన్న వారితో పాటుగా ఉదరకుహర వ్యాధి (సెలియాక్‌ డిసెజస్‌) ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. జొన్నలలో ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ బి, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటివి ఉన్నాయి. దీనివల్ల చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడతాయి. జీర్ణక్రియనూ మెరగుపరుస్తుంది. జొన్నలను రోటీ రూపంలో మాత్రమే కాదు ఇడ్లీ, దోశ రూపంలో తినొచ్చు. ఊబకాయులు బరువు తగ్గేందుకు కూడా ఇది చక్కటి ఎంపిక. 

- వి. కృష్ణ దీపిక, సీనియర్‌ క్లినికల్‌ డైటీషియన్‌, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌, కొండాపూర్‌.


ఉపాధికి మార్గం..

జొన్నరొట్టె ఇప్పుడు నగరానికి పొట్టచేతపట్టుకుని వస్తున్న వారికి ఉపాధి మార్గంగా మారింది. జోవార్‌ రోటీ కేంద్రాలను నిర్వహిస్తున్నది అధికశాతం మహిళలే. మోతీనగర్‌లో రెండేళ్లగా ఈ తరహా కేంద్రాన్ని నిర్వహిస్తున్న సత్తెమ్మ మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇది అదనపు ఆదాయం అందిస్తుందన్నారు. సాయంత్రం 6 గంటలకు బండి పెడితే రాత్రి 9గంటలకు రొట్టెలు అయిపోతాయంటూ.. ఉదయం కూలి పనులకు వెళ్తే సాయంత్రం ఈ బండి పెడతానని అన్నారు. నిజానికి జొన్నరొట్టెలు తయారీ చేయడం కళ అని, అది అందరికీ రాకపోవడంతో తమకు కాస్త ఉపాధి లభిస్తుందని చెప్పుకొచ్చిందామె.


ఇదీ విశేషం..!

జొన్న అనగానే ముందుగా గుర్తొచ్చేది జొన్నరొట్టెనే కానీ, పశువుల మేతకు కూడా జొన్నలు వాడుతుంటారు. అయితే, ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి ఈ జొన్నతో సిరప్‌, ఇథనాల్‌, బయో ఫ్యూయల్‌ కూడా తీయొచ్చంటూ నూతన వంగడాలనూ సృష్టించారు. ఇంకో విశేషమేమిటంటే, ప్లాస్టిక్‌ కూడా దీని నుంచి తీయొచ్చని చెబుతున్నారు.


ఏ రోటీ మంచిది.. 

చపాతీ, రోటీ ఏదైనా తక్కువ కాలంలోనే తినేయాలి. లేదంటే అవి పాడైపోయే అవకాశాలున్నాయి. కానీ జొన్నరొట్టెకు ఆ ఇబ్బంది లేదు. కాస్త ఆలస్యమైనా దీనిని ఇబ్బంది లేకుండా తినేయొచ్చు. జొన్నరొట్టెలో ఉన్న రెండు రకాలలో ఒకటి కడక్‌ రోటీ. ఇది గట్టిగా ఉంటుంది. మరోటి సాఫ్ట్‌రోటీ మెత్తగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే దీనిని తినేయాలి. కానీ కడక్‌ రోటీ అలా కాదు. కొన్ని వారాలైనా పాడయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనిని సంప్రదాయ పద్ధతులలో నిల్వ చేస్తే వీటి జీవితకాలం మరింత పెరుగుతుంది. మన నగరంలో జొన్న రొట్టెను వెజిటేబుల్‌ కర్రీ లేదంటే చికెన్‌ కర్రీ లాంటి వాటితో కలిపి తీసుకుంటుంటారు. కొంతమంది పచ్చడితో కలిపి కూడా తింటుంటారు.



స్ట్రీట్‌ టు స్టార్‌..

చపాతీ, రోటీ, నాన్‌.. కొంతకాలం క్రితం వరకూ నగరంలో హోటల్స్‌లో బాగా కనిపించిన ఫుడ్‌. బరువు పెరగకుండా ఉండటానికంటూ చాలామంది ఈ రోటీలను తినడం ఇప్పటికీ కనిపిస్తుంటుంది కానీ, నగరంలో జొన్నరొట్టెలకు ప్రాచుర్యం ఇటీవల బాగా పెరిగింది. అంతకు ముందు హోటల్స్‌లో జొన్న రొట్టె కనిపించడం తక్కువే కానీ, పెరిగిన ఆరోగ్యాభిలాషులతో స్టార్‌ హోటల్స్‌ కూడా జొన్న రొట్టెను తమ మెనూలో జోడించాయిప్పుడు. వీధులలో రూ.10లకే లభిస్తున్న జొన్నరొట్టె పలు హోటల్‌లలో వాటి స్థాయిని బట్టి రూ.30 నుంచి రూ.150 వరకూ చార్జి చేస్తున్నారు.  

Updated Date - 2021-10-31T17:01:01+05:30 IST