ఈ మోడల్‌ సివిల్స్‌ టాపర్‌

ABN , First Publish Date - 2020-08-06T05:37:34+05:30 IST

ఒక అమ్మాయి కల... ఐఏఎస్‌ కావాలని! అమ్మ కోరిక... ఐశ్వర్యారాయ్‌లా తన కూతురు ‘అందాల రాణి’ అవ్వాలని! ఒకటి గ్లామర్‌ ప్రపంచం. ఇంకొకటి ప్రజా సేవకు మార్గం. ఒకదానికొకటి పొంతనలేని రంగాలు...

ఈ మోడల్‌ సివిల్స్‌ టాపర్‌

ఒక అమ్మాయి కల... ఐఏఎస్‌ కావాలని! అమ్మ కోరిక... ఐశ్వర్యారాయ్‌లా తన కూతురు ‘అందాల రాణి’ అవ్వాలని! ఒకటి గ్లామర్‌ ప్రపంచం. ఇంకొకటి ప్రజా సేవకు మార్గం. ఒకదానికొకటి పొంతనలేని రంగాలు. కానీ ఐశ్వర్యా శోరాన్‌... అమ్మ కోరిక తీర్చింది. తన కలనూ నెరవేర్చుకుంది. తాజాగా సివిల్స్‌లో 93వ ర్యాంకు సాధించి సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది.



కరీంనగర్‌లో తెలంగాణ ఎన్‌సీసీ బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కల్నల్‌ అజయ్‌ కుమార్‌ కుమార్తె ఐశ్వర్యా శోరాన్‌. రాజస్థానీ కుటుంబం వారిది. నాన్న కరీంనగర్‌లో ఉద్యోగం చేస్తుంటే... ఆమె అమ్మతో కలిసి ఢిల్లీలో ఉంటున్నారు. ఐశ్వర్య మొదటి నుంచి చదువులో టాపరే. ఢిల్లీ ‘సంస్కృతి స్కూల్‌’లో 97.5 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన ఆమె... ‘శ్రీరామ్‌ కాలేజీ ఆఫ్‌ కామర్స్‌’ నుంచి అర్థశాస్త్రంలో ఆనర్స్‌ పట్టా పొందారు. 


పుట్టకముందే ఫిక్స్‌... 

ఐశ్వర్య వాళ్ల అమ్మకు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌ అంటే చాలా ఇష్టం. ‘‘ఐశ్వర్యారాయ్‌లా నేను కూడా ‘మిస్‌ ఇండియా’ కావాలన్నది అమ్మ కోరిక. అందుకే నాకు ఆమె పేరే పెట్టింది’’ అంటారు ఐశ్వర్య. అమ్మ ఆశయానికి తగ్గట్టుగానే చిన్నప్పటి నుంచే ఐశ్వర్యలో అందాల రాణి కావాలనే కాంక్ష మొదలైంది. వయసుతో పాటే ఆ కోరిక బలపడింది. చదువు కొనసాగిస్తూనే మోడలింగ్‌పై కూడా ఆమె దృష్టి పెట్టారు. 


అలా మొదలైంది...  

మనకు కలలు, కోరికలు ఉంటాయి. నిజమే! కానీ కన్నవారికీ మనపై కొన్ని ఆశలుంటాయి. ఈ రెండింటి మధ్య ఏదో ఒకటి తేల్చుకోవడం కష్టమే. ఈ సంఘర్షణలో అయోమయంలో పడలేదు ఐశ్వర్య. ముందుగా అమ్మ కోరుకున్నట్టే గ్లామర్‌ ప్రపంచం వైపు అడుగులు వేశారు. ‘‘అది 2014. ఆ రోజు ఇంకా గుర్తుంది. ‘ఢిల్లీ టైమ్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌’ కాంపిటీషన్స్‌. నేనూ పేరిచ్చాను. చివరకు టైటిల్‌ నాకే దక్కింది. అస్సలు ఊహించలేదు. మోడల్‌ను కావడానికి అదే నా తొలి అడుగు. అది మొదలు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. విశేషమేమంటే ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొనమని నిర్వాహకులే నాకు సలహా ఇచ్చారు. దాంతో సాధించగలనన్న నమ్మకం కలిగింది’’ అంటున్న ఐశ్వర్య అదే ఏడాది ‘మిస్‌ క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఢిల్లీ’ టైటిల్‌ దక్కించుకున్నారు. 


అమ్మ కోరిక నెరవేరిన రోజు... 

‘ఆరడుగుల’ రూపం... నలుగురిలో కలిసిపోయే తత్వం... అన్నింటికీ మించి విజ్ఞానం... ఐశ్వర్యను ప్రత్యేకంగా నిలిపాయి. మోడలింగ్‌ చేస్తూనే బ్యూటీ కాంపిటీషన్స్‌లో పాల్గొంటూ వచ్చారామె. 2015లో ‘మిస్‌ క్యాంపస్‌ ప్రిన్సెస్‌ ఢిల్లీ’ టైటిల్‌ సాధించారు. 2016... పంథొమ్మిదేళ్ల ఐశ్వర్య చిన్న నాటి నుంచి ఎదురు చూస్తున్న క్షణం. ‘మిస్‌ ఇండియా’ అందాల పోటీలు మొదలయ్యాయి. ఒక్కో రౌండ్‌ పూర్తి చేస్తూ వచ్చారు ఐశ్వర్య. అన్నింటినీ దాటి 21 మంది ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచారు. కిరీటం దక్కకపోయినా ఆ స్థాయి వరకు వెళ్లి అమ్మ కోర్కె తీర్చారు. 2017లో నిర్వహించిన ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌’లో ర్యాంప్‌ వాక్‌ చేసి సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా అభినందనలు అందుకున్నారు. 




ఉన్నట్టుండి రూటు మార్చి...  

‘మిస్‌ ఇండియా’ పోటీల తరువాత ఐశ్వర్యకు మోడలింగ్‌లో మరిన్ని మంచి అవకాశాలు వచ్చాయి. వాటిల్లో బిజీగా ఉన్న ఆమె... ఒక్కసారిగా రూటు మార్చారు. సివిల్స్‌కు సన్నద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. ‘‘నా జీవితంలో ఇది పెద్ద మలుపు. వివిధ బ్యూటీ పోటీల్లో పాల్గొంటున్నా. మనీష్‌ మల్హోత్రా వంటి ప్రముఖ డిజైనర్లు, మ్యాగజైన్ల కోసం మోడలింగ్‌ చేస్తున్నా. ‘బాంబే, అమెజాన్‌, లాక్మే తదితర ‘ఫ్యాషన్‌ వీక్‌’ల్లో ర్యాంప్‌లపై నడిచాను. ఈ రంగంలో నేను ఊహించిన దానికన్నా ఎక్కువే సాధించాను. ఒకరోజు ఇవన్నీ మదిలో రివైండ్‌ అవుతుంటే... ‘సివిల్స్‌ సాధించాలన్న నా కల గుర్తుకు వచ్చింది. స్కూల్లో, కాలేజీలో బాగా చదివేదాన్ని కూడా. అలాంటప్పుడు దాని కోసం ఎందుకు ప్రయత్నించకూడదు’ అనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా అన్నీ పక్కన పెట్టేశాను’’ అంటూ చెప్పుకొచ్చారు ఐశ్వర్య. 




కోచింగ్‌ లేకుండానే...  

లక్ష్యం పెద్దదయినప్పుడు దానికి సన్నద్ధదత కూడా అదే స్థాయిలో ఉండాలి. కానీ ఐశ్వర్య అందుకు భిన్నం. దూసుకు పోతున్న తన మోడలింగ్‌ కెరీర్‌కు బ్రేకులు వేసి... సివిల్స్‌ కొట్టాలని పట్టుదలగా ఫిక్సయినా ఆమె ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. ఏళ్లకు ఏళ్లు సన్నద్ధం కాలేదు. మరి ఎలా సాధించారు? ‘‘ముందు నా మొబైల్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాను. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నాను. స్నేహితులు, కాలక్షేపాలు లేవు. మొదటి నుంచి చదువులో టాపర్‌గా ఉండడం వల్ల ప్రిపరేషన్‌పై శ్రద్ధ పెట్టడం నాకు కష్టం అనిపించలేదు. స్కూల్లో హెడ్‌గర్ల్‌గా వ్యవహరించాను. ఇంటర్‌లో సైన్స్‌ చదివి ఆ తరువాత డిగ్రీలో కామర్స్‌ గ్రూప్‌కి మారాను. ఇవన్నీ సివిల్స్‌ సన్నాహాలకు కలిసివచ్చాయి. ఆ ఫలితమే నాకు ఇప్పుడు 93వ ర్యాంకు రావడం’’ అని ఐశ్వర్య సంతోషం వ్యక్తం చేశారు. 


ఐఐఎం సీటు వద్దనుకుని... 

మరో విశేషమేమంటే... ఐశ్వర్య మోడలింగ్‌లో ఉన్నా చదును అశ్రద్ధ చేయలేదు. 2018లో ‘ఐఐఎం-ఇండోర్‌’లో సీటు సంపాదించారు. కానీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిపరేషన్‌ కోసం దాన్ని వదులుకున్నారు. ఏడాది కూడా ప్రిపరేషన్‌ లేకుండానే అనుకున్నది సాధించి, తన కలనూ నెరవేర్చుకున్నారు. అసలు ఈ రంగంపై మక్కువ ఎలా కలిగిందని అడిగితే... ‘‘నాన్న కల్నల్‌. ఆయనలా ఆర్మీలోకి వెళదామని కొన్నిసార్లు అనుకున్నా కూడా. అయితే నాణేనికి మరో వైపు కూడా ఉంటుంది కదా! అలాగే నేను కుటుంబంలో వైవిధ్యంగా ఉండాలన్న ఆలోచనతో సివిల్స్‌ కోసం ప్రయత్నించాలనుకున్నా. మహిళలు ఎదగడానికి సైన్యంలో కూడా అవకాశాలున్నాయి. కానీ అవి పరిమితం. అదే సివిల్‌ సర్వీసెస్‌లో అయితే అపరిమితం. ఏదైనా నా అంతిమ లక్ష్యం దేశానికి సేవ చేయడం’’ అంటారు ఐశ్వర్య. ఏదిఏమైనా మోడలింగ్‌ నుంచి వచ్చి... సివిల్స్‌లో గెలిచిన అసామాన్య మహిళగా ఐశ్వర్య రికార్డు సృష్టించారు.




నాన్న కల్నల్‌. ఆయనలా ఆర్మీలోకి వెళదామని కొన్నిసార్లు అనుకున్నా కూడా. అయితే నాణేనికి మరో వైపు కూడా ఉంటుంది కదా! అలాగే నేను కుటుంబంలో వైవిధ్యంగా ఉండాలన్న ఆలోచనతో సివిల్స్‌ కోసం ప్రయత్నించాలనుకున్నా. మహిళలు ఎదగడానికి సైన్యంలో కూడా అవకాశాలున్నాయి. కానీ అవి పరిమితం. అదే సివిల్‌ సర్వీసెస్‌లో అయితే అపరిమితం. ఏదైనా నా అంతిమ లక్ష్యం దేశానికి సేవ చేయడం.


Updated Date - 2020-08-06T05:37:34+05:30 IST