జర్నలిస్టు కాదు, డ్రాగన్‌ వేగు!

ABN , First Publish Date - 2020-09-20T07:48:35+05:30 IST

ఈ నెల 14న ఢిల్లీ పోలీసులు అధికారిక రహస్యాల చట్టం(ఓఎ్‌సఏ) కింద అరెస్టు చేసిన జర్నలిస్టు రాజీవ్‌ శర్మ, దేశానికి చెందిన కీలక సమాచారాన్ని చైనాకు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు...

జర్నలిస్టు కాదు, డ్రాగన్‌ వేగు!

  • చైనాకు సైనిక సమాచారం అందించాడు
  • జర్నలిస్టు రాజీవ్‌ శర్మ గురించి ఢిల్లీ పోలీసుల వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: ఈ నెల 14న ఢిల్లీ పోలీసులు అధికారిక రహస్యాల చట్టం(ఓఎ్‌సఏ) కింద అరెస్టు చేసిన జర్నలిస్టు రాజీవ్‌ శర్మ, దేశానికి చెందిన కీలక సమాచారాన్ని చైనాకు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత సరిహద్దు ప్రణాళికల్ని, సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా నిఘా వర్గాలకు చేరవేస్తున్నట్లుగా విచారణలో తేలిందని స్పెషల్‌ సెల్‌ డీసీపీ సంజీవ్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు.


‘‘శర్మ వెల్లడించిన వివరాల మేరకు కింగ్‌ షి అనే చైనా మహిళను, తాజ్‌ బొహ్రా అనే నేపాల్‌ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. అక్రమంగా దేశంలోకి వచ్చిన కింగ్‌ షి, భారత మహిళగా అందరినీ నమ్మించింది. ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌ ప్రాంతంలో ఉన్న షెల్‌ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్నారు. చైనాకు ఔషధాలు ఎగుమతి చేసి, అక్కడి నుంచి భారీగా వస్తున్న డబ్బును దేశంలోని ఏజెంట్లకు వీరిద్దరూ అందజేస్తున్నారు. చైనా నిఘా సంస్థకు చెందిన మెకెల్‌ అనే అధికారి 2016లో సోషల్‌  మీడియాలో శర్మతో మాట్లాడాడు. అప్పటి నుంచి 2018 వరకూ భారత్‌కు చెందిన సున్నిత సమాచారాన్ని శర్మ అతడికి చేరవేశాడు. 2019 నుంచి జార్జ్‌ అనే మరో అధికారికి కూడా సమాచారాన్ని అందిస్తున్నాడు. జార్జ్‌ నుంచి 10 వాయిదాల్లో రూ.30లక్షలకు పైగా మొత్తాన్ని శర్మ పొం దాడు. ఒక సందర్భంలో చైనాకు వెళ్లి మరీ మైకెల్‌ను కలిశాడు. అక్కడి అధికారులు భారీ ఆఫర్‌ ఇవ్వడంతో దేశ సమాచారాన్ని చేరవేయడం కొనసాగించాడు’’ అని సంజీవ్‌ తెలిపారు. ‘‘40ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్న శర్మ, 2010 నుంచి ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర కాలంలో అతడికి రూ.40లక్షలు అందాయి. సమాచారానికి సుమారు రూ.73వేలు చొప్పున తీసుకున్నాడు. చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ న్యూస్‌పేపర్‌కు కూడా శర్మ వ్యాసాలు రాశాడు.


యునైటెడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇండియా, ద ట్రిబ్యూన్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలకు శర్మ పనిచేశాడు. అతడికి ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) అక్రెడిటేషన్‌ ఉంది. మంత్రిత్వ శాఖల కార్యాలయాలకు సులభంగా వెళ్లగలిగేవాడు’’ అని సంజీవ్‌ పేర్కొన్నారు. శర్మ యూట్యూబ్‌ చానెల్‌ ‘రాజీవ్‌ కిష్కింధ’లో పలు అంశాలకు చెందిన 327 వీడియోలున్నాయి. చివరిగా భారత్‌-చైనా ప్రతిష్టంభన గురించిన వీడియోను పోస్ట్‌ చేయడం గమనార్హం. కాగా శర్మ అరెస్టును ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) ఖండించింది. జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించడంలో ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ సెల్‌ చరిత్ర తెలిసిందేనంటూ విమర్శించింది. ‘దేశంలో ఎక్కడ జర్నలిస్టును అరెస్టు చేసినా దానికి సంబంధిం చిన పూర్తి వివరాలు పీసీఐకు తెలపాలనేది డిమాండ్‌’ అని పేర్కొంది. 


Updated Date - 2020-09-20T07:48:35+05:30 IST