పాత్రికేయ భీష్ముడు

ABN , First Publish Date - 2022-06-26T05:58:23+05:30 IST

చదివిన చదువును చేసే పనికి అన్వయించి ఫలితం సాధించిన నేర్పరి, ఆ చదువును తరగతి గదుల్లోను చెప్పి ఎందరో యువ జర్నలిస్టులను అక్షరాల అంటుకట్టి తీర్చిదిద్దిన మాలకరి...

పాత్రికేయ భీష్ముడు

చదివిన చదువును చేసే పనికి అన్వయించి ఫలితం సాధించిన నేర్పరి, ఆ చదువును తరగతి గదుల్లోను చెప్పి ఎందరో యువ జర్నలిస్టులను అక్షరాల అంటుకట్టి తీర్చిదిద్దిన మాలకరి, సమకాలీనులకే కాకుండా ముందుతరాలకు సైతం పనికొచ్చే రచనలు చేసిన కూర్పరి, ఏది జర్నలిజం, ఏది కాదని క్షీరనీర న్యాయం చెప్పిన తీర్పరి, శ్రీమాన్‌ కృష్ణమాచారి సత్పుత్రం – ‘గోవర్ధన సుందర వరదాచారి నమో నమః’ అని వారి వ్యక్తిత్వంలో ఏ ఒక్క పార్శ్వం తెలిసినవారైనా అంటారు. నీతికి, నిబద్ధతకు నిలువెత్తు మూర్తివారిది. సి.నారాయణరెడ్డి అన్నట్లు వారిలో – ‘పైన కఠినమనిపించును, లోన వెన్న కనిపించును.’


వ్యాఖ్య ఏమిచేసినా– ‘వార్త’ పవిత్రమని నమ్మిన సత్యనిష్ఠాపరుడు జి.ఎస్‌. వరదాచారి. లీగల్‌ అంశాలు వ్రాయడంలో దిట్ట, మంచి వక్త. వ్యాకరణాన్ని, ఉచ్చారణను గౌరవించి రాయాలని యువజర్నలిస్టులకు పదేపదే గుర్తుచేసే భాషా ప్రేమికుడు. స్వంతడబ్బా కొట్టుకోనివాడు, చాడీలు చెప్పే స్వభావంలేనివాడు కాబట్టి యాజమాన్యాలు వాడుకుంటూ రెండు దశాబ్దాలకు మించి వార్తా సంపాదకుడుగానే కొనసాగించినా పరిమళిస్తూ కరివేపాకులాగా మిగిలిపోయినవాడు, వెలిగిపోయినవాడు. వారిని ‘అజాత శత్రువు’ అనవచ్చునేమో, కనుచూపు మేరలో ఎవ్వరూ లేరని, చూపుకు అందని వారుంటే ఉండవచ్చునేమో!


వరదాచారి బి.ఏ. పట్టా సాధించిన తర్వాత ఒక యేడాది జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా పూర్తిచేసి– ఇష్టపూర్వకంగా 1954లో జర్నలిజం రంగంలో పాదం పెట్టారు. జర్నలిస్టుగా, మంచి జర్నలిస్టుగా, గొప్ప జర్నలిస్టుగా రూపాంతరం చెందారు. జర్నలిజం డిప్లొమా చేస్తున్న రోజుల్లోనే విద్యార్థుల అభ్యాసన పత్రిక ‘ఉస్మానియా కొరియర్‌’కు సంపాదకుడుగా ఎంపికైనారు. అప్పట్లోనే ఆధ్యాత్మిక పత్రిక ‘వైష్ణవ’ను తొమ్మిది మాసాలపాటు నడిపారు. జర్నలిజం కోర్సులో భాగంగా మద్రాసు వెళ్ళి ‘ది హిందూ’ పత్రికలో ఇంటర్న్‌షిప్‌ చేశారు. ‘తెలుగు పత్రికల చరిత్ర’పై అధ్యయనపత్రం సమర్పించారు. క్రమం తప్పకుండా విధులకు హాజరై ఎడిటింగ్‌ నేర్చుకోవడమే కాకుండా కొన్ని స్థానిక వార్తల రిపోర్టింగ్‌ సైతం చేసి ప్రశంసలు అందుకున్నారు. ‘ది హిందూ’లో చేరమని వారు కోరినా ఇంగ్లీషు పత్రికని చేరలేదు. తెలుగు పత్రికలో పనిచేయాలనే తపనతో 1956లో ‘ఆంధ్రజనత’ దినపత్రికలో చేరిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రచురించిన 32 పేజీల ప్రత్యేక అనుబంధం కోసం ‘వంద సంవత్సరాల తెలుగు పత్రికల సమగ్ర చరిత్ర’ను రాశారు. జర్నలిజం డిప్లొమాలో తాను ఇంగ్లీషులో సమర్పించిన అధ్యయనపత్రానికి ఆయన అప్పటికప్పుడు చేసిన తెనిగింపే ఆ ‘చరిత్ర’. ఈ వ్యాసాన్ని చదివిన సుప్రసిద్ధ పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ– హైదరాబాద్‌ వచ్చినప్పుడు సరాసరి ‘ఆంధ్రజనత’ కార్యాలయానికి వచ్చి ఎడిటర్‌ సుబ్రహ్మణ్యంను కలిసి తన చేతిలోని వ్యాసం ప్రతి చూపి, దాని రచయితను కలుసుకోవాలని చిరునామా అడిగారట, మెచ్చుకున్నారట.


1957లో వరదాచారి ఎల్‌ఎల్‌.బి.లో చేరి పూర్తిచేశారు. దీనివల్ల పత్రికలకు సంబంధించిన చట్టాలు, న్యాయాన్యాయాలు వారికి కొట్టినపిండై పోయాయి. అజంత ‘ఆంధ్రప్రభ’కు వెళ్ళిపోయిన తర్వాత వరదాచారికి అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పదోన్నతి కల్పించారు. కాని వరదాచారి 1961లో ఆయన కొత్తగా సికింద్రాబాద్‌ నుంచి పండితారాధ్యుల నాగేశ్వరరావు సంపాదకత్వంలో వెలువరిస్తున్న ‘ఆంధ్రభూమి’ దినపత్రిక న్యూస్‌ ఎడిటర్‌గా కోరి చేరారు.


‘తెలుగు చలనచిత్రాల సమీక్ష – ఒకే ఫ్రేమ్‌లో డిటో ఉంటా’యనీ, చిత్రం పేరు, నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు మాత్రమే మారతాయని సుప్రసిద్ధ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ చేసిన నిజాయితీ గల వ్యాఖ్యను సత్యదూరమనేలాగా గుణాత్మకమైన చిత్ర సమీక్షలను చేయడం వరదాచారి ‘చిత్రభూమి’ కాలమ్‌ ద్వారా ప్రారంభించారు. అప్పట్లో మద్రాసువారు రాసే సమీక్షలకు భిన్నంగా, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా హైదరాబాద్‌ పాత్రికేయులు చేసే సమీక్షలకు సినీప్రముఖులు మెల్లగా అలవాటుపడ్డారు.


తన గురించి కాకుండా తన దగ్గర పనిచేసే ఉపసంపాదకుల బాగోగులు వారు చూసేవారు. అవసరమైనప్పుడు యాజమాన్యంతో మాట్లాడి తక్షణ సహాయం చేసేవారు. అందువల్ల సంపాదకవర్గంలో వరదాచారిని అందరూ న్యూస్‌ ఎడిటర్‌గానే కాకుండా ఒక పెద్దమనిషిగా, ‘వరదహస్త’మిచ్చే కుటుంబ పెద్దగా గౌరవించేవారు. 1980లో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడుగా జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు కార్యక్రమాలు వరదాచారి నిర్వహించారు. ‘ఆంధ్రభూమి’లో న్యూస్‌ ఎడిటర్‌గా ఇరవైరెండు సంవత్సరాలు కొనసాగి వరదాచారి 1982 డిసెంబరులో రాజీనామా చేశారు. అనంతరం ఆకాశవాణిలో, దూరదర్శన్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో కొంతకాలం వార్తలు రాశారు. 1983లో ‘ఈనాడు’ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ సంపాదకీయం, ప్రధాన వ్యాసాలు రాసే ఉద్యోగమైనా– గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సంపాదకుడు అని కాకుండా సహాయ సంపాదకుడుగా నియామకం చేస్తామని రామోజీరావు చెప్పడంతో చేసే ఉద్యోగం అదే కదా అని వరదాచారి చేరిపోయారు. అక్కడ దాదాపు ఆరేండ్లు పనిచేశారు.


ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు మాధ్యమంలో పత్రికా రచన కోర్సు ప్రవేశపెడుతూ వరదాచారి విశేష అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి వైస్‌ ఛాన్సలర్‌ 1988 డిసెంబరులో విశ్వవిద్యాలయంలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా నియామకం చేసి శాఖాధిపతి బాధ్యతలు అప్పగించారు. అక్కడ దాదాపు ఇరవైరెండు సంవత్సరాలు పనిచేసి ఎందరో యువ జర్నలిస్టులను తయారుచేశారు.


పత్రికా చట్టాలు పత్రికా విలువలు చెప్పే పాఠ్యగ్రంథాలు రాశారు. ఇట్లా పత్రికా వ్యాసంగంతో పాటుగా తన కిష్టమైన అధ్యాపకరంగంలోను సమానకృషి చేసి సర్వశ్రేయో మార్గదర్శిగా తన వ్యక్తిత్వాన్ని వరదాచారి మలచుకున్నారు. స్వచ్ఛందంగా 2010లో అక్కడ ఉద్యోగ విరమణ చేశారు.


అనంతరం కె. రామచంద్రమూర్తి ఆహ్వానం మేరకు హెచ్‌ఎంటీవీలో అంబుడ్స్‌మన్‌ (తీర్పరి)గా జర్నలిజం విలువలు, నైతికాంశాలను వివరిస్తూ 2013 దాకా కొనసాగారు. మరోపక్క  వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడుగా 2006 నుంచి గత పదహారు సంవత్సరాలుగా కృషిచేస్తూనే ఉన్నారు.


ఇంతటి బహుముఖ ప్రజ్ఞావంతుడు, అనుభవజ్ఞుడు, ఎందరో జర్నలిస్టులకు గురువైన జి.ఎస్‌. వరదాచారి నిస్సందేహంగా తెలుగు పత్రికా ప్రపంచంలో ‘పరిణత పాత్రికేయుడు’. జర్నలిస్టుగా వారి సేవలకు గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన నార్ల వెంకటేశ్వరావు జీవనసాఫల్య పురస్కారం 2005లోనే ప్రదానం చేసి గౌరవించింది. వరదాచారికి తొంభై వసంతాలు నిండిన సందర్భంగా జీవనసాఫల్య అభినందన సభను వయోధిక పాత్రికేయ సంఘం ఏర్పాటు చేస్తున్న శుభతరుణంలో వారికి మా శుభాకాంక్షలు.

టి. ఉడయవర్లు

(నేడు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఉదయం 10.30 గంటలకు జి.ఎస్‌. వరదాచారి జీవనసాఫల్య అభినందన సభ, ‘పరిణత పాత్రికేయం’ గ్రంథావిష్కరణ)

Updated Date - 2022-06-26T05:58:23+05:30 IST