జోరుగా బెల్ట్‌ దందా

ABN , First Publish Date - 2022-10-08T06:14:45+05:30 IST

జోరుగా బెల్ట్‌ దందా

జోరుగా బెల్ట్‌ దందా

ప్రభుత్వం నుంచి లబ్ది పొందినా మారని వైనం

రోజుకో కొత్త బెల్ట్‌ దుకాణం ఏర్పాటు..

తనిఖీలతో ఆటకట్టించే పనిలో ఎక్సైజ్‌ శాఖ

వైన్‌ షాపుల కనుసన్నల్లోనే దందా..


వరంగల్‌ సిటీ, అక్టోబరు 7: గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరంలోనూ బెల్ట్‌ షాపుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో గ్రామాలు, నగర శివారుల్లో ఈ దందా జోరుగా సాగేది. ఇప్పుడు నగర నడిబొడ్డులోని కాలనీల్లో సైతం నడుస్తోంది. గతంలో గుడుంబా అమ్మకాన్ని, బెల్ట్‌ షాపులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వారికి ఉపాధి కల్పించింది. ప్రభుత్వం నుంచి ఉపాధి లబ్ధి పొందిన వారు సైతం బెల్ట్‌ దందాను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదంతా వైన్‌ షాపుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. మండల పరిధిలోని గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా వైన్‌ షాపులు లిక్కరు దందాను కొనసాగించేందుకు బెల్ట్‌ షాపులను వారే ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. వైన్‌ షాపులు సరుకు చేరవేస్తూ దానిపై కమీషన్లు ఇస్తూ కొత్త తరహాలో బెల్ట్‌ షాపులను నిర్వహిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్‌ దందాను కట్టడి చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ నిత్యం తనిఖీలు చేపడుతూనే ఉంది. అయినప్పటికీ బెల్ట్‌ దందా మాత్రం కొనసాగుతూనే ఉంది.


లబ్ధి పొందినా ఆపడం లేదు..

గుడుంబా నిర్మూలన కోసం బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్న, గుడుంబా అమ్మకాలు జరుపుతున్న వారిని గుర్తించి ప్రభుత్వం ఉపాధి కల్పించింది. వారికి ఆటోలు, గొర్రెలు, బర్రెలు, ట్రాలీ ఆటోలు, ప్యాసింజర్‌ ఆటోలు, కిరాణా షాపులు తదితర స్వయం ఉపాధి పనుల కోసం ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందించింది. అయితే లబ్ధి పొందిన వారు సైతం బెల్ట్‌ షాపులను నిర్వహిస్తూనే ఉన్నారు. ఖిలా వరంగల్‌ మండల పరిధిలో సుమారు 52 మంది బెల్ట్‌షాపు నిర్వాహకులు లబ్ధి పొందినప్పటికీ వారిలో చాలా మంది దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. 


నగరం నడిబొడ్డున బెల్ట్‌ దందా..

గతంలో వైన్‌ షాపులు లేని గ్రామాల్లో, నగరంలోని శివారు ప్రాంతాల్లోనే విచ్చలవిడిగా బెల్ట్‌ షాపుల్లో మద్యం విక్రయించే వారు. ఇప్పుడు నగర శివారు ప్రాంతాల్లోని అన్ని కిరాణ షాపులు బెల్ట్‌ దందాను నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు నగరం నడిబొడ్డులోని కాలనీల్లో సైతం ప్రత్యేకమైన గదులను తీసుకొని మరీ బెల్ట్‌ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నగరంలోని చింతల్‌ బస్తీ, ఏనుమాముల మార్కెట్‌, ఎన్‌టీఆర్‌ నగర్‌, కరీమాబాద్‌, శంభునిపేట, బీఆర్‌నగర్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ తోట, లక్ష్మీనగర్‌ తదితర ప్రాంతాల్లో బెల్ట్‌ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. 


వైన్‌ షాపుల కనుసన్నల్లోనే..

వైన్‌ షాపుల కనుసన్నల్లోనే బెల్ట్‌ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. నగరంలో 13 వైన్‌ షాపులు, 20 బార్లు ఉండగా అందులో సింహభాగం వైన్‌ షాపులు బెల్ట్‌ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. గేటు కింద ప్రాంతంలో ఓ వైన్‌ షాపు ఓనర్‌ తనకు కావాల్సిన వారి బెల్ట్‌ షాపుకు స్టాకునే నేరుగా పంపిస్తున్నట్లు బాహాటంగానే ప్రచారం సాగుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర శివారు ప్రాంతాల్లో వైన్‌ షాపు యజమానులే బెల్ట్‌ షాపులు నిర్వహిస్తూ అక్కడికి నేరుగా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. నిబంధనల మేరకు ఒక్కరికి ఆరు ఫుల్‌ బాటిళ్లనే విక్రయించాలి. అందుకు విరుద్ధంగా పదుల సంఖ్యలో ఫుల్‌ బాటిళ్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైన్‌ షాపుల యజమానుల నిర్వాకంతో నగరంలోని పలు కాలనీల్లో రోజుకో కొత్త బెల్ట్‌ షాపు పుట్టుకొస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. 


బెల్ట్‌ తీస్తున్న ఎక్సైజ్‌ శాఖ

నిత్యం తనిఖీలతో బెల్ట్‌ షాపులపై దాడులు చేస్తూ కేసులు కడుతున్నా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. బెల్ట్‌ షాపుల నిర్వాహకులకు వైన్‌ షాపుల యజమానుల మద్దతు లభిస్తుండటంతో పాటు వారే నేరుగా బెల్ట్‌ షాపులకు నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా చేస్తున్నారు. దీంతో బెల్ట్‌ షాపు నిర్వాహకులకు భయం లేకుండా పోతోంది. సరుకు సీజ్‌ చేసినా వైన్‌ షాపు యజమానులే భరిస్తుండటంతో కమీషన్‌ మీద బెల్ట్‌ దందా కొనసాగుతున్నట్లు నిర్వాహకులే చెబుతున్నారు. 


నిరంతరం తనిఖీలు చేస్తున్నాం : బి.చంద్రమోహన్‌, ఖిలావరంగల్‌ ఎక్సైజ్‌ సీఐ

బెల్ట్‌ షాపులు నిర్వహించడం నేరం. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నాం. దొరిన మద్యాన్ని సీజ్‌ చేస్తూ వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. అయితే వైన్‌ షాపులే బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్న ఆధారాలు మాకు దొరకడం లేదు. అలాంటివి జరిగితే ఉపేక్షించేది లేదు. అలాంటి ఆధారాలతో ఎవరైన ఫిర్యాదు చేస్తే సంబంధిత వైన్‌ షాపులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడేది లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండి బెల్ట్‌ షాపులపై ఫిర్యాదు చేయాలి. ఎప్పటికప్పుడు శివారు ప్రాంతాల్లోని బెల్ట్‌ షాపులను గుర్తించి మూసివేయించేస్తున్నాం.

Updated Date - 2022-10-08T06:14:45+05:30 IST