జొన్నను మద్దతు ధరకు కొనాలి

ABN , First Publish Date - 2021-04-17T05:27:49+05:30 IST

జొన్నను మద్దతు ధరకు కొనాలి

జొన్నను మద్దతు ధరకు కొనాలి
మొక్కజొన్నలను పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకులు

మైలవరం (జి.కొండూరు), ఏప్రిల్‌ 16: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే జొన్నలు, మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు వజ్రాల వెంకటరెడ్డి, రావుల సుబ్బారావులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మైలవరం మార్కెట్‌ యార్డ్‌ను వారు శుక్రవారం సందర్శించారు. రైతు యార్డులో ఆరబోసిన జొన్నలు, మొక్కజొన్నల వద్దకు వెళ్లి వాటిని పరిశీలించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జొన్నలను తక్కువ ధరకు కొంటున్నారని అదేమంటే నాణ్యత మారిందని అధికారులంటున్నారని రైతులు నేతల ముందు వాపోయారు. జొన్నలు కింటాకు రూ.2,640 మద్దతు ధర ప్రకటించిందని ఆధరకు కొనుగోలు చేయకుంటే రైతుల తరఫున రోడ్డెక్కాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులకు మద్దతు ధర చెల్లించలేని ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకుంటే దళారులు చెప్పిన ధరకు రైతుల పంటలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-04-17T05:27:49+05:30 IST