జాలీగా.. జంప్‌ సూట్స్‌

ABN , First Publish Date - 2022-07-06T08:55:50+05:30 IST

జాలీగా.. జంప్‌ సూట్స్‌

జాలీగా.. జంప్‌ సూట్స్‌

జంప్‌సూట్స్‌ ఫ్యాషన్‌ ప్రపంచంలో రాజ్యమేలుతున్నాయి. మోడర్న్‌గా కనిపించడంతో పాటు, సింపుల్‌ లుక్‌లో మెరిసిపోవడం కోసం ఎక్కువ మంది అమ్మాయిలు వీటిని ఎంచుకుంటూ ఉంటారు. అయితే జంప్‌సూట్స్‌ పేరు వెనక, ఈ డ్రస్‌ ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఏలడం వెనక పెద్ద కథే ఉంది. 


పారాషూటర్ల కోసం...

జంప్‌సూట్‌ అంటే... దూకేటప్పుడు ధరించే దుస్తులని అర్థం. ఎగిరే విమానం నుంచి కిందకు దూకే పారాషూటర్ల కోసం ప్రత్యేకంగా రూపొందిన దుస్తులివి. 1919లో మొదటిసారిగా అందుబాటులోకొచ్చిన ఈ జంప్‌సూట్‌ను 1930లో ఫ్యాషన్‌ డిజైనర్‌, ఎల్సా షియాపెరెల్లి ఫ్యాషన్‌ ప్రపంచానికి పరిచయం చేసింది. పెద్ద పెద్ద పాకెట్లతో, గ్రీన్‌ సిల్క్‌ మెటీరియల్‌తో ఈవిడ డిజైన్‌ చేసిన జంప్‌సూట్స్‌ ప్రారంభంలో అంతగా ప్రాచుర్యం పొందకపోయినా, రెండో ప్రపంచ యుద్ధం నాటి కాలంలో యుద్ధంలో పాల్గొనాలనుకునే మహిళల మనసులను ఇవి ఆకర్షించాయి. తర్వాత 60, 70లలో చెర్‌, ఎల్విస్‌ ప్రెస్లీ మొదలైన ప్రముఖ పాప్‌ సింగర్లు వీటిని ధరించడంతో, జంప్‌ సూట్స్‌ ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం పొందాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ వన్‌ పీస్‌ దుస్తులు మహిళల ఆదరణ పొందుతూనే ఉన్నాయి. 


సౌకర్యమే ప్రధానంగా...

ఒళ్లంతా కప్పి ఉంచడంతో పాటు, కదలికలకు ఇబ్బంది కలిగించని జంప్‌ సూట్స్‌, కాటన్‌ నుంచి జీన్స్‌ వరకూ ఎన్నో రకాల మెటీరియల్స్‌తో రూపొందుతున్నాయి. పార్టీ వేర్‌, రెగ్యులర్‌ వేర్‌.. ఇలా భిన్నమైన సందర్భాలకు తగ్గట్టుగా డిజైన్‌ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా వెకేషన్లకూ, ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ గెట్‌ టు గెదర్‌లలో ఇవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. టీ షర్ట్‌, షర్ట్‌, క్రాప్‌ టాప్‌... ఇలా ఎలాంటి టాప్‌తోనైనా కలిపి ధరించే వీలుండడం వీటి ప్రత్యేకత. జంప్‌ సూట్‌తో షూ, వెడ్జెస్‌, హీల్స్‌.. దేన్నైనా ధరించవచ్చు. ఫంకీగా కనిపించడం కోసం స్కార్ఫ్స్‌, ఫ్యాన్సీ జ్యువెలరీ ఎంచుకోవాలి.

Updated Date - 2022-07-06T08:55:50+05:30 IST