కరోనాను ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహం

ABN , First Publish Date - 2020-03-29T10:47:54+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించే దిశగా వైద్యఆరోగ్యశాఖ శనివారం మరిన్ని చర్యలను చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో

కరోనాను ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహం

విద్యాసంస్థలు, హాస్టళ్లలో క్వారంటైన్‌ గదులు

ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో కోవిడ్‌ బృందాలు

 

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 28 : కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించే దిశగా వైద్యఆరోగ్యశాఖ శనివారం మరిన్ని చర్యలను చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు లేనప్పటికీ, ఒకవేళ అటువంటి విపత్కర పరిస్థితులే వస్తే ఏంటన్న అంచనాలపై ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చితే ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని తాజాగా నిర్ణయించారు. ఆ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్య నిపుణులు, సిబ్బందిని కలిపి కోవిడ్‌ వైద్య బృందాలుగా ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, ఆశ్రం వైద్య కళాశాల, బోధనాస్పత్రి, ఆంధ్రా హాస్పిటల్స్‌లను పూర్తిస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులుగా మార్చాలని నిర్ణయించారు.


జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వసతిగృహాల భవనాలను క్వారంటైన్‌ గదులుగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఏలూరు నగరపాలక సంస్థ, జిల్లాలోని మిగతా పురపాలక సంఘాల పరిధిలోని విదేశీ ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు, పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేకంగా వైద్యాధికారుల బృందాలను శనివారం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు హోం క్వారం టైన్‌లలో ఉన్న విదేశీ ప్రయాణికులకు స్థానిక ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశాలు మాత్రమే వైద్య పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతీ మూడు వార్డులు/డివిజన్లకు ఒక మెడికల్‌ ఆఫీసర్‌, గ్రామ సచివాలయ అడ్మినిస్ర్టేటివ్‌ సెక్రటరీ, ఏఎన్‌ఎంలతో కూడిన పర్యవేక్షణ బృందాలను నియమిం చారు. ఇతర రాష్ర్టాలు, పొరుగు జిల్లాల నుంచి వచ్చేవారిని కామన్‌ క్వారంటైన్లకు తరలిస్తున్నందున వారిని పరీక్షించేందుకు 104 అంబు లెన్స్‌లోనే ఆరోగ్య పరీక్షల నిమిత్తం వైద్యులకు బాధ్యతలు అప్పగించారు.

 

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 244 పడకలను ప్రత్యేకించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో 106 పడకలు, తాడేపల్లిగూడెం, తణుకు, జంగా రెడ్డిగూడెంలలోని ఏరియా ఆస్పత్రుల్లో నాలుగు చొప్పున మొత్తం 118 పడకలు ఉన్నాయి. ఏలూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన 106 పడకలను 200లకు పెంచడానికి నిర్ణయించారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 126 పడకలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-03-29T10:47:54+05:30 IST