Abn logo
Sep 17 2021 @ 23:21PM

పీజీలో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ

- రాష్ట్రంలోని ఏ వర్సిటీలోనైనా చేరవచ్చు

- బీఆర్‌ఏయూ పరిధిలో 1,111 సీట్లు

- ఏపీ పీజీ సెట్‌ షెడ్యూల్‌ విడుదల

ఎచ్చెర్ల, సెప్టెంబరు 17: యూనివర్సిటీలో పీజీ కోర్సుల ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీలోనైనా పీజీ సీట్ల భర్తీకి ఆ వర్సిటీలే ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ఈ ఏడాది అలా కాకుండా అన్ని వర్సిటీల్లో పీజీ కోర్సుల సీట్ల భర్తీకి తొలిసారిగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనిద్వారా విద్యార్థులు తమకు నచ్చిన వర్సిటీలో  చేరవచ్చు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను యోగి వేమన యూనివర్సిటీ (కడప) కి అప్పగించారు. ఈ మేరకు ఏపీ పీజీ సెట్‌-2021 షెడ్యూల్‌ విడుదలైంది. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో 139 కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. 


అంబేడ్కర్‌ వర్సిటీలో సీట్ల వివరాలు..

ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో 18 కోర్సులకు 580 సీట్లు ఉన్నాయి. వర్సిటీకి అనుబంధంగా ఉన్న 8 పీజీ కళాశాలల్లో 8 కోర్సులకు 531సీట్లు ఉన్నాయి. మొత్తంగా వర్సిటీ పరిధిలోని 1,111 సీట్లను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. వర్సిటీ, అనుబంధ కళాశాలల్లో ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ ఫిజిక్స్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎనలెటికల్‌ కెమిస్ట్రీ, జియాలజీ, మేథ్స్‌, అప్లైడ్‌ మేథ్స్‌, ఎమ్మెస్సీ జియో ఫిజిక్స్‌, ఎంకాం, ఎంఏ తెలుగు, రూరల్‌ డెవలప్‌మెంట్‌, అర్థశాస్త్రం, ఎంఏ ఇంగ్లీష్‌, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంజేఎంసీ, ఎంఈడీ కోర్సులు ఉన్నాయి. 


ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..

పీజీ సీట్ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తెలిపారు. ఈ నెల 15 నుంచి 30వరకు ప్రొసెసింగ్‌ ఫీజు కింద ఓసీ విద్యార్థులు రూ.850, బీసీ విద్యార్థులు రూ.750, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగ విద్యా ర్థులు రూ.650 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షను అక్టోబరు 22 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాల కోసం  www.yogivemanauniversity.ac.in లేదా www.yvu.edu.in వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు.