హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ సమావేశం నేడు

ABN , First Publish Date - 2021-10-20T04:38:10+05:30 IST

తెలంగాణ రాష్ట్రసమితి ఉమ్మడి ఖమ్మంజిల్లా నేతల సమావేశం బుధవారం హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో జరగనుంది. ఉదయం 11గంలకు జరిగే ఈసమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెం

హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ సమావేశం నేడు

కేటీఆర్‌తో సమీక్షకు హాజరుకానున్న ప్రజాప్రతినిధులు, నేతలు

ఖమ్మం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రసమితి ఉమ్మడి ఖమ్మంజిల్లా నేతల సమావేశం బుధవారం హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో జరగనుంది. ఉదయం 11గంలకు జరిగే ఈసమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ హాజరు కానుండగా.. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీసీలు, ఎంపీపీలు, మార్కెట్‌ కమిటల చైర్మన్లు, ఖమ్మం మేయర్‌, మునిసిపల్‌చైర్మన్లు, ఖమ్మం కార్పొరేటర్లు, సుడా చైర్మనతో పాటు పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి తరలివెళ్లనున్నారు. వచ్చే నెల 15న వరంగల్‌లో పార్టీ ప్లీనరీ జరుగనుండగా.. టీఆర్‌ఎస్‌ రెండు దశాబ్దాల ఉత్సవాలకు సంబంధించి కార్యాచరణ, పార్టీ భవిష్యత కార్యాచరణ తదితర అంశాలపై కేటీఆర్‌ సమీక్షించనున్నారు. ఉమ్మడిజిల్లాలో పార్టీ అంతర్గతపోరు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో పార్టీ రెండువర్గాలుగా విడిపోయినా పైకి మాత్రం అంతా ఐక్యంగా ఉన్నామని చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే సమావేశం కీలకం కాబోతుంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా కేటీఆర్‌ జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్టీ వ్యవస్థాపక నిర్మాణం, కార్యాచరణ, నవంబరు 15 బహిరంగసభ, ఆతర్వాత జరిగే ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమాలపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, అసంతృప్తితో ఉన్న కేడర్‌ను బుజ్జగించి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, గ్రామ, బూతస్థాయిలో పార్టీ కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ముఖ్యనేతలు హైదరాబాదు వెళ్లగా బుధవారం ఉదయం మరికొందరు నేతలు హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామ నాగేశ్వరరావుతోపాటు పార్టీ జనరల్‌ సెక్రటరీ కె.కేశవరావు ఈ సమావేశంలో ప్రసంగించే అవకాశం ఉంది. మొత్తం మీద హైదరాబాద్‌లో జరిగే కేటీఆర్‌ సమీక్షతో పార్టీ ఉమ్మడి జిల్లా శ్రేణుల్లోని అంతర్గత విభేదాలకు చెక్‌పడుతుందా లేదంటే సమస్య మరింత జటిలమవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

Updated Date - 2021-10-20T04:38:10+05:30 IST