Gujarat : బీజేపీలో చేరడం ఓ ఆప్షన్... కాంగ్రెస్ కన్నా ఆప్ వ్యూహం బాగుంది... : హార్దిక్ పటేల్

ABN , First Publish Date - 2022-05-25T17:35:00+05:30 IST

రానున్న గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో తాను ముఖ్యమైన పాత్రను

Gujarat : బీజేపీలో చేరడం ఓ ఆప్షన్... కాంగ్రెస్ కన్నా ఆప్ వ్యూహం బాగుంది... : హార్దిక్ పటేల్

గాంధీ నగర్ : రానున్న గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో తాను ముఖ్యమైన పాత్రను పోషిస్తానని యువ నేత హార్దిక్ పటేల్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత తనకు బీజేపీ ఓ ఆప్షన్ అని, కాంగ్రెస్ కన్నా మెరుగైన వ్యూహాలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అమలు చేస్తోందని అన్నారు. 


రానున్న శాసన సభ ఎన్నికలు బీజేపీ (BJP)కి అనుకూలంగా ఏకపక్షంగా జరుగుతాయని Hardik Patel జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను ముఖ్య పాత్రను పోషిస్తానని చెప్పారు. బీజేపీలో చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నారా? అని విలేకరి అడిగినపుడు, ‘‘ఆ అవకాశం ఎందుకు ఉండకూడదు’’ అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందా? అని ప్రశ్నించినపుడు ఆయన మాట్లాడుతూ, ఆఫర్లు, బేరసారాలు బలహీనుల కోసమేనని చెప్పారు. బలమైనవారు తమ కోసం తాము ఓ వేదికను సృష్టించుకుంటారన్నారు. 


ఆమ్ ఆద్మీ పార్టీ (AAM ADMI Party) వ్యవహార శైలిని కూడా హార్దిక్ పటేల్ ప్రశంసించారు. కాంగ్రెస్ (Congress) కన్నా మెరుగైన ఎన్నికల వ్యూహాలను ఆప్ అనుసరిస్తోందన్నారు. తాను ఆప్‌లో చేరుతానా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఎక్కడా కనిపించదన్నారు. 


ఈసారి గుజరాత్ (Gujarat) ఎన్నికలు ఆసక్తికరంగా జరగబోవని, బీజేపీవైపు ఏకపక్షంగా జరుగుతాయని అన్నారు. తాను 2017లో కన్నా చురుకైన పాత్రను పోషిస్తానని తెలిపారు. 


హార్దిక్ పటేల్ 2019లో కాంగ్రెస్‌లో చేరారు. 2020లో ఆయన గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది మే 18న ఆ పార్టీకి రాజీనామా చేశారు. 


Updated Date - 2022-05-25T17:35:00+05:30 IST