చంద్రబాబుకు డ్రైవర్ సుబ్రమణ్యం తల్లిదండ్రుల వినతి
అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హతమైన అతని డ్రైవర్ సుబ్రమణ్యం తల్లిదండ్రులు శుక్రవారం ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సుబ్రమణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనను కలిసి మాట్లాడారు. కిరాతకంగా హత్యకు గురైన తమ కుమారుడి కేసును నీరుగార్చడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసు విషయంలో వైసీపీ వర్గాలు, ఇతర వ్యక్తుల నుంచి ఇప్పటికీ తమపై ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. తమ కుటుంబానికి టీడీపీ నుంచి పార్టీ పరంగా రూ.5 లక్షలు సాయం చేసినందుకు ఆయనకు వారు ధన్యవాదాలు తెలిపారు.