Corona vaccine: భారత్‌లో టీకా దరఖాస్తును ఉపసంహరించుకున్న ప్రముఖ ఫార్మా సంస్థ..?

ABN , First Publish Date - 2021-08-02T21:25:18+05:30 IST

అమెరికా ఫార్మా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్(జే అండ్ జే) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Corona vaccine: భారత్‌లో టీకా దరఖాస్తును ఉపసంహరించుకున్న ప్రముఖ ఫార్మా సంస్థ..?

బెంగళూరు: అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్(జే అండ్ జే) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ కరోనా టీకాకు అనుమతి కోసం భారత ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ ఓ సంచలన కథనాన్ని తాజాగా ప్రచురించింది. అయితే..జాన్సన్ అండ్ జాన్సన్ కానీ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ) కానీ ఈ విషయమై స్పందించలేదని రాయిటర్స్ పేర్కొంది. తమ టీకాకు(జాన్సెన్) సంబంధించి భారత్‌లోనూ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని జే అండ్ జే ఏప్రిల్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనకు మునుపే అమెరికాలో ఈ టీకాకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ నిలిచిపోయాయి. ఈ వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డకట్టొచ్చన్న అనుమానాల నడుమ అమెరికా ప్రభుత్వం క్లినికల్ ట్రయల్స్‌కు తాత్కాలికంగా బ్రేకులు వేసింది. 


మరోవైపు.. ఇండెమ్నిటీ క్లాజ్‌ విషయంలోనూ విదేశీ టీకా కంపెనీలకు, భారత ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగుతున్నాయి.  టీకా కారణంగా అనుకోని సమస్యలు తలెత్తిన సందర్భాల్లో వ్యాక్సిన్ తయారీ సంస్థలకు న్యాయపరమైన చర్యల నుంచి రక్షణనిచ్చే నిబంధనను ఇండెమ్నిటీ క్లాజ్ అంటారు. ఈ విషయంలో చట్టపరమైన చిక్కులను తొలగించేందుకు ఓ బ‌ృందాన్ని ఏర్పాటు చేశామని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి గత వారం ప్రకటించారు. ‘‘ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీల ప్రతినిధులతో ఈ టీం సభ్యులు నిరంతరం చర్చలు జరుపుతున్నారు’’ అని మంత్రి పేర్కొన్నట్టు రాయిటర్స్ ప్రచురించింది. ఈ నేపథ్యంలో..టీకా దరఖాస్తును జాన్సన్ అండ్ జాన్సన్ ఉపసంహరించుకుందన్న వార్తకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 

Updated Date - 2021-08-02T21:25:18+05:30 IST