‘పైరేట్స్ ఆఫ్ కరిబీయన్’ (Pirates Of The Caribbean) సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులరైన నటుడు జానీ డెప్(Johnny Depp). ఈ సిరీస్‌లో జాక్ స్పారో పాత్రలో కనిపించి అభిమానులకు అలరించారు. ఈ మధ్యనే తన మాజీ భార్య అంబర్ హర్డ్ (Amber Heard)పై పరువు నష్టం కేసును గెలిచారు. కేసులన్ని ముగిసిపోవడంతో ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులకు సిద్ధం అవుతున్నారు. తాజాగా పారిస్ ఎయిర్ పోర్టులో క్లీన్ షేవ్ లుక్‌లో, కొత్త హెయిర్ స్టైల్‌తో అభిమానులకు దర్శనమిచ్చారు. కారు వచ్చే వరకు ఎయిర్ పోర్టు బయట ఎదురు చూశారు. ఆ సమయంలో నవ్వులు చిందిస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
వైరల్‌గా మారిన పిక్స్ కింద నెటిజన్స్ విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘డెప్ సూపర్‌గా కనిపిస్తున్నారు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.‘‘జానీ గడ్డంతో ఉన్న లుక్ అంటేనే నాకిష్టం. కానీ, ఆయన ఎలా కనిపించినా బాగుంటుంది’’ అని మరో నెటిజన్ పోస్ట్ పెట్టారు. చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నారని సోషల్ మీడియా యూజర్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. జానీ డెప్ తదుపరి చిత్రం ‘జీన్ డు బారీ’ (Jeanne du Barry) కోసం పారిస్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫ్రెంచ్ రాజు లూయి-15 పాత్రను ఆయన పోషిస్తున్నారు. మూవీలోని కాస్టూమ్స్ ట్రయల్ కోసమే ఫ్రాన్స్ వచ్చినట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. జానీ డెప్ కోర్టు కేసులతో చాలా కాలం పోరాడారు. ఈ మధ్యనే వాటి నుంచి విముక్తి లభించింది. మాజీ భార్య అంబర్ హర్డ్ చేసిన కామెంట్స్‌పై జానీ డెప్ పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ దాదాపుగా ఆరు వారాల పాటు కొనసాగింది. చివరికీ ఈ కేసును జానీ డెపే గెలిచారు. ఈ కేసు ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కొన్ని నిర్మాణ సంస్థలు ఆయనను సినిమాల నుంచి తప్పించాయి.