ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్సీకి జో రూట్ గుడ్‌బై

ABN , First Publish Date - 2022-04-15T21:59:47+05:30 IST

ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ సంచలన ప్రకటన చేశాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు

ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్సీకి జో రూట్ గుడ్‌బై

లండన్: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ సంచలన ప్రకటన చేశాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లను కోల్పోయిన నేపథ్యంలో రూట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-4తో వైట్‌వాష్ అయింది. విండీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 0-1తో కోల్పోయింది. 27 టెస్టుల్లో జట్టుకు విజయాన్ని అందించిన రూట్.. విజయవంతమైన ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్లలో ఒకడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో మైఖేల్ వాన్, సర్ అలిస్టర్ కుక్, సర్ ఆండ్రూ స్ట్రాస్‌లను అధిగమించాడు. 


కరీబియన్ టూర్ నుంచి వచ్చాక టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు రూట్ తెలిపాడు. తన కెరియర్‌లోనే ఇది అత్యంత కఠిన నిర్ణయమని అన్నాడు. నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు తన కుటుంబ సభ్యులతోనూ మాట్లాడినట్టు చెప్పాడు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని తనకు తెలుసన్నాడు. దేశానికి సారథ్యం వహించడం గర్వకారణమని, గత ఐదేళ్ల కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోందన్నాడు.  


రూట్ 2017లో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. రూట్ సారథ్యంలోని ఇంగ్లండ్ టెస్టు జట్టు కొన్ని మరపురాని విజయాలు సాధించింది. 2018లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోగా, 2020లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకుంది. 2018లో శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్‌ను సాధించిన జో రూట్.. 2001 తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. అలాగే, 2021లో శ్రీలంకలో పర్యటించిన రూట్ సేన 2-0తో విజయం సాధించింది.


టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్‌గానూ రూట్ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో కుక్ మొదటి స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా 14 సెంచరీలు సాధించాడు. అలాగే, కెప్టెన్‌గా 5,295 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ కెప్టెన్‌ సాధించిన అత్యధిక పరుగులు ఇవే. ఓవరాల్‌గా ఈ జాబితాలో రూట్ ఐదో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు గ్రేమ్ స్మిత్, అలన్ బోర్డర్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ ఉన్నారు.  

Updated Date - 2022-04-15T21:59:47+05:30 IST