సచిన్, గవాస్కర్ రికార్డులకు చేరువలో ఇంగ్లండ్ కెప్టెన్

ABN , First Publish Date - 2021-12-10T22:21:21+05:30 IST

ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగుతున్నాడు

సచిన్, గవాస్కర్ రికార్డులకు చేరువలో ఇంగ్లండ్ కెప్టెన్

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగుతున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 86 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఫలితంగా ఈ ఏడాది ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా చేసిన 86 పరుగులు కలుపుకుని ఈ ఏడాది అతడు సాధించిన పరుగుల సంఖ్య 1541కి చేరింది. 


టెస్టు మ్యాచ్ నాలుగో రోజైన రేపు (శనివారం) కనుక తన ఫామ్‌ను కొనసాగించి మరిన్ని పరుగులు చేస్తే అతడి ఖాతాలో పలు రికార్డులు వచ్చి చేరుతాయి. టెస్టు క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇప్పటికే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ రికార్డును రూట్ అధిగమించాడు.


ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 2005లో చేసిన 1544 పరుగులను అధిగమించడానికి మూడు పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు సాధిస్తే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు పరుగుల ఆల్‌టైమ్ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకుంటాడు. 

 

ప్రస్తుతం ఈ జాబితాలో రూట్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ మాజీ బ్యాటర్ మహమ్మద్ యూసుఫ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2006లో అతడు 11 టెస్టుల్లో 99.33 సగటుతో 1788 పరుగులు చేశాడు. ఐదారు స్థానాల్లో భారత దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 1562 (2010),  సునీల్ గవాస్కర్ 1555 (1979) పరుగులు సాధించారు. 2012లో 1595 పరుగులు చేసిన ఆస్ట్రేలియా మాజీ స్కిప్పర్ మైఖేల్ క్లార్క్ నాలుగో స్థానంలో ఉన్నాడు.


దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 2008లో 15 మ్యాచుల్లో 1656 పరుగులు చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ గ్రేట్ వివ్ రిచర్డ్స్ రెండో స్థానంలో ఉన్నాడు. రిచర్డ్స్ 1976లో 11 టెస్టుల్లో 1710 పరుగులు సాధించాడు. కాగా, రూట్ ఈ ఏడాది ఆరు సెంచరీలు సాధించాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.

Updated Date - 2021-12-10T22:21:21+05:30 IST