అప్పుడు ఆమెకు 12 ఏళ్లే.. నాకు 30.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు వైరల్

ABN , First Publish Date - 2022-09-25T01:29:36+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) పేరు మారోమారు నెట్లింట్లో మారుమోగిపోతోంది. ఓ సభలో ఆయన చేసిన కామెంట్సే ఇందుకు కారణం.

అప్పుడు ఆమెకు 12 ఏళ్లే.. నాకు 30.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు వైరల్

ఎన్నారై డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) పేరు మారోమారు నెట్లింట్లో మారుమోగిపోతోంది. ఓ సభలో ఆయన చేసిన కామెంట్సే ఇందుకు కారణం. అమెరికాలో అతిపెద్ద ఉపాధ్యాయుల సంఘమైన నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్(National Education Association) శుక్రవారం ఓ భారీ సభ ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో టీచర్లు ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో బైడెన్ ప్రసంగిస్తూ.. తన ఎదురుగా ఉన్న ఓ మహిళను గుర్తించారు. ‘‘నన్ను గుర్తుపట్టలేదా.. నన్ను నువ్వు పలకరించలేదేంటి’’ అని ప్రశ్నించారు. ఆ తరువాత తన సహజధోరణిలో మాట్లాడుతూ..‘‘అప్పట్లో నాకు 30.. ఆమెకు 12 ఏళ్లున్నప్పుడు మా మధ్య స్నేహం కుదిరింది. చాలా విషయాల్లో ఆమె నాకు సాయం చేసింది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్సే సంచలనానికి దారి తీశాయి. 


సభకొచ్చిన వారిలో సగం మంది బైడెన్ ఏం చెబుతున్నారో అర్థంకాక తెల్లముఖం వేస్తే.. మరికొందరు మాత్రం పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ ఆయనను ప్రోత్సహించారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియా బాటపట్టి విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలు ఏంటో వింతగా ఉన్నాయంటూ కొందరు కామెంట్లు పెట్టారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ‘‘బైడెన్ ఆయన టీచర్ గురించి చెప్పి ఉంటారు. అప్పట్లో నాకు 12.. టీచర్‌కు 30 అని చెప్పబోయి ఇలా.. ఆయన గురించి మనకు తెలిసిందేగా అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. 


కాగా.. టీచర్ల సభలో బైడెన్ ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీపై విమర్శలు గుప్పించారు. వారు తీసుకొచ్చిన అబార్షన్లను నిషేధించే బిల్లు(Abortion) తన వద్దకు వస్తే దాన్ని విటో అధికారాన్ని ఉపయోగించి వెనక్కి పంపిచేస్తానని స్పష్టం చేశారు. అయితే.. వచ్చే మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ప్రజలు ఐక్యత కావాలో, అనైక్యత కావాలో తేల్చుకోవాలని బైడెన్ మరో సందర్భంలో వ్యాఖ్యానించినట్టు స్థానిక మీడియా తెలిపింది. తన ప్రభుత్వ చర్యల కారణంగా అమెరికాలో ఇంధన ధరలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పిన బైడెన్.. ఆటోమేటిక్ ఆయుధాలపై ఆంక్షలు లేకపోవడాన్ని లేవనెత్తారు. తుపాకీ సంస్కృతి కారణంగా అమాయక అమెరికన్లు బలైపోతున్న నేపథ్యంలో ఆయుధ విక్రయాలపై ఆంక్షలు విధించాలని బైడెన్ ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ.. బైడెన్ ప్రత్యర్థులైన రిపబ్లికన్లు మాత్రం బైడెన్ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు.


Updated Date - 2022-09-25T01:29:36+05:30 IST