ఇస్లామిక్ స్టేట్ అగ్రనేతను హతమార్చాం: జో బైడెన్

ABN , First Publish Date - 2022-02-04T01:39:21+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్సులో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూప్

ఇస్లామిక్ స్టేట్ అగ్రనేతను హతమార్చాం: జో బైడెన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్సులో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూప్ చీఫ్‌ను హతమార్చినట్టు తెలిపారు. ఆపరేషన్ పూర్తయ్యాక కమాండోలు తిరిగి సురక్షితంగా తమ స్థావరానికి చేరుకున్నట్టు పేర్కొన్నారు.


అమెరికా కమాండోల దాడిలో ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాది హతమయ్యాక 31 అక్టోబరు 2019లో అబు ఇబ్రహీం అల్ హష్మిమి అల్ ఖురేషి ఈ ఉగ్రవాద గ్రూపు బాధ్యతలు చేపట్టాడు. అబూ బకర్‌ను తుదముట్టించిన తర్వాత సిరియాలో అమెరికా చేపట్టిన రెండో అతిపెద్ద ‘ఆపరేషన్’ ఇదే కావడం గమనార్హం.


తాజాగా ఖురేషీని లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రత్యేక దళాలు జరిపిన ఈ దాడిలో ఖురేషీ మరణించినట్టు బైడెన్ తెలిపారు. బాగ్దాదీ ఎక్కడ, ఎలా అయితే మరణించాడో, ఖురేషీ కూడా అలాగే మరణించాడని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడిలో ఖురేషీతోపాటు మహిళలు, పిల్లలు సహా అతడి కుటుంబ సభ్యులు మరణించారు.


ఖురేషీని అమిర్ ముహమ్మద్ సైద్ అబ్దల్-రహ్మాన్ అల్ మావ్లా అని కూడా పిలుస్తారు. అమెరికా దాడిలో ఆరుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 13 మంది మరణించినట్టు తొలుత వార్తలు వచ్చాయి. కాగా, ‘మిషన్’ విజయవంతమైనట్టు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ ఓ సంక్షిప్త ప్రకటనలో పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-04T01:39:21+05:30 IST