రాజకీయ ప్రయోజనం కోసం.. ట్రంప్ తొందరపాటు: బిడెన్

ABN , First Publish Date - 2020-09-21T17:59:47+05:30 IST

అమెరికా సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్‌(87) శుక్రవారం పాన్‌క్రియాటిక్ క్యాన్సర్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.

రాజకీయ ప్రయోజనం కోసం.. ట్రంప్ తొందరపాటు: బిడెన్

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్‌(87) శుక్రవారం పాన్‌క్రియాటిక్ క్యాన్సర్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే, గిన్స్‌బర్గ్‌ మృతితో ఏర్పడిన సుప్రీం కోర్టు జడ్జి ఖాళీ భర్తీ విషయమై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అమెరికా అత్యున్నత న్యాయస్థానం జడ్జిని నియమిస్తామని ప్రకటించారు. ట్రంప్‌ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాతే కొత్త జడ్జిని నియామించాలని డెమొక్రాట్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ చట్టసభ సభ్యులను సుప్రీం కోర్టు జడ్జి భర్తీ విషయంలో తొందరపడొద్దని సూచించారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు వరకు వేచి చూడాలని కోరారు. జడ్జి నియామకంపై ట్రంప్ తొందరపడుతుంది కేవలం ఆయన రాజకీయ ప్రయోజం కోసమేనని చెప్పారు. అధ్యక్షుడి ప్రణాళిక మేరకు ప్రస్తుత నియామకాన్ని సెనేట్‌ ఆమోదించడం వల్ల 6-3 మెజారిటీ వస్తుందని.. ఇది అమెరికన్ల చట్టాలని, జీవితాన్ని దశాబ్దాలపాటు ప్రభావితం చేయడం ఖాయమని బైడెన్‌ అన్నారు. 


ఇక తనకు అవకాశం వస్తే ఒక ఆఫ్రికన్‌-అమెరికన్‌ మహిళని సుప్రీం జడ్జిగా నామినేట్‌ చేస్తానని బైడెన్‌ పేర్కొన్నారు. కాగా, రిపబ్లికన్ల 100 మంది సెనేట్ సీట్లలో 53 మంది ఇప్పటికే ట్రంప్‌ ప్రతిపాదనను వ్యతిరేకించి షాక్ ఇచ్చారు. అలాగే 62 శాతం మంది అమెరికన్లు కూడా నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల అనంతరం ఎన్నికైన కొత్త అధ్యక్షుడు సుప్రీం కోర్టు జడ్జిని నియమించాలని భావిస్తున్నట్లు రాయిటర్స్‌ పేర్కొంది. 


ఇదిలా ఉంటే... నార్త్ కరోలినా‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ట్రంప్.. రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ మృతితో ఖాళీ అయిన స్థానంలో.. ఓ మహిళకే అవకాశం ఇస్తానని చెప్పారు. ఇందుకోసం చికాగోకు చెందిన 7వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు చెందిన అమీ కోనీ బారెట్, అట్లాంటాకు చెందిన 11వ సర్క్యూట్‌కు చెందిన బార్బరా లాగోవా పేర్లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఒకరిని సుప్రీం కోర్టు జడ్జిగా వచ్చేవారం నామినేట్ చేస్తానని ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. 


Updated Date - 2020-09-21T17:59:47+05:30 IST