Joe Biden: మరో భారతీయ అమెరికన్‌‌కు కీలక బాధ్యతలు

ABN , First Publish Date - 2022-04-16T18:26:35+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మొదటి నుంచి భారతీయ అమెరికన్లకు తగిన ప్రాధాన్యమిస్తూ పలు కీలక బాధ్యతలు అప్పగిస్తున్న విషయం తెలిసిందే.

Joe Biden: మరో భారతీయ అమెరికన్‌‌కు కీలక బాధ్యతలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మొదటి నుంచి భారతీయ అమెరికన్లకు తగిన ప్రాధాన్యమిస్తూ పలు కీలక బాధ్యతలు అప్పగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిని కీలక పదవులకు ఎంపిక చేసినా అధ్యక్షుడు తాజాగా మరో భారత సంతతి మహిళను రాయబారిగా నామినేట్ చేశారు. భారతీయ అమెరికన్ దౌత్యవేత్త రచనా సచ్‌దేవా కొర్హోనెన్‌ను మాలిలో యూఎస్ రాయబారిగా నియమించారు. ఈ మేరకు అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు రచనా సౌదీ అరేబియాలోని ధరన్‌లోని యూఎస్ కాన్సులేట్‌లో కాన్సుల్ జనరల్ అండ్ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. 


అలాగే కొలంబోలోని అమెరికన్ ఎంబసీలో నిర్వహణ విభాగం హెడ్‌గా పని చేశారు. యూఎస్ ఫారిన్ సర్వీస్‌లో కెరీర్ సభ్యురాలైన ఆమె ప్రస్తుతం బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్ సంయుక్త కార్యనిర్వాహక కార్యాలయాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. న్యూజెర్సీలోని ఫ్లెమింగ్టన్‌కు చెందిన రచనా.. తన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్‌లో పూర్తి చేశారు. కాగా, గడిచిన నెలరోజుల వ్యవధిలో ముగ్గురు ఇండో-అమెరికన్లను బైడెన్ రాయబారులుగా నియమించడం విశేషం. రచనా కంటే ముందు పునీత్‌ తల్వార్‌ను మొరాకో, షెఫాలి రజ్దాన్ దుగ్గల్‌ను నెదర్లాండ్స్ దేశానికి అమెరికా రాయబారిగా నియమించారు. 


Updated Date - 2022-04-16T18:26:35+05:30 IST