అమెరికాలో తలకిందులైన పరిస్థితులు.. బైడెన్‌కు సహకరించని అమెరికన్లు!

ABN , First Publish Date - 2021-06-20T01:39:28+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభిస్తున్న వేళ.. వ్యాక్సిన్‌తో మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టాలని బైడెన్ భావించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అ

అమెరికాలో తలకిందులైన పరిస్థితులు.. బైడెన్‌కు సహకరించని అమెరికన్లు!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభిస్తున్న వేళ.. వ్యాక్సిన్‌తో మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టాలని బైడెన్  భావించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వ్యాక్సినేషన్ కోసం ప్రణాళికలు రూపొందించారు. టార్గెట్‌లు పెట్టుకుని మరీ.. వ్యాక్సినేషన్‌ను పరుగులు పెట్టించారు. అయితే ఇదంతా రెండు, మూడు నెలల క్రితం మాట. అమెరికాలో ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. దీంతో బైడెన్  ప్రభుత్వం తన తదుపరి లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితులు ప్రస్తుతం అమెరికాలో కనిపించడం లేదు. విషయంలోకి వెళితే..


అమెరికాలో కొవిడ్ విలయం సృష్టిస్తున్న వేళ.. జో బైడెన్ ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. వ్యాప్తిని అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని గట్టిన నమ్మిన బైడెన్.. తన మొదటి 100 రోజుల పాలనలో 100 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కేవలం 56 రోజుల్లోనే 100 మిలియన్ల మంది టీకా తీసుకోవడంతో.. నిర్దేశించుకున్న సమయానికి ముందే బైడెన్ తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన లక్ష్యాన్ని రెట్టింపు చేసుకున్నారు. అదే 100 రోజుల్లో 200 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీన్ని కూడా బైడెన్ ప్రభుత్వం విజయవంతంగా సాధించింది. ఈ నేపథ్యంలోనే బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జూలై 4 నాటికి 70 శాతం మంది అమెరికన్లు కనీసం ఒక డోసు టీకా తీసుకునే విధంగా చూడాలని బైడెన్ నిశ్చయించుకున్నారు. అయితే గత కొద్ది వారాలుగా అమెరికన్లు టీకా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. 




తాజా గణాకాంకాల ప్రకారం శుక్రవారం నాటికి కేవలం 65.1 శాతం మంది అమెరికన్లు మాత్రమే కనీసం ఒక డోసు తీసుకున్నారు. అంతేకాకుండా గత రెండు వారాలుగా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్యను పరిశీలిస్తే అది ఒకశాతం కంటే తక్కువగానే ఉంది. ఈ క్రమంలో బైడెన్ తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు మరో రెండు వారాల్లో 5శాతం మంది అమెరికన్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే.. బైడెన్ మాత్రం తన టార్గెట్‌ను చేరుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. శుక్ర‌వారం వైట్‌హౌస్ వ‌ద్ద మీడియాతో మాట్లాడిన బైడెన్‌.. "టీకా వేయించుకోని వారిపై డెల్టా వేరియంట్ మ‌రింత ప్ర‌భావం చూపించే వీలుంది. ఇది చాలా డేంజ‌ర‌స్‌. దీన్నుంచి త‌ప్పించుకునేందుకు వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వేరియంట్ శ‌ర‌వేగంగా వ్యాపిస్తుంద‌ని, ప్రాణాంత‌క‌మైన‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది యువ‌తకు మ‌రింత డేంజ‌ర‌స్" అని అన్నారు. అంతేకాకుండా వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాల్లో మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో నేటికీ మరణాల సంఖ్య ఎక్కువగానే నమోదవుతన్నట్టు వెల్లడించారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా వ్యాక్సినేషన్‌పై ప్రచారం చేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. టీకా తీసుకోవాలంటూ ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. 


అమెరికన్ల వెనకడుగుకు అపోహలే కారణం

వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతుందనే పుకార్లు అమెరికాలో షికారు చేస్తున్నాయి. మెజారిటీ అమెరికన్లు వాటిని బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ టీకా తీసుకునేందుకు పురుషులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించింది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం లైగింక సామర్థ్యంపై టీకా ప్రతికూల ప్రభావం చూపుతుందనే గాలి వార్తలను కొట్టిపారేశారు. దీనిపై అధ్యయనం చేసి మరీ.. వ్యాక్సిన్ సేఫ్ అన్న విషయాన్ని స్పష్టం చేశారు. కాగా టీకాపై అమెరికన్లలో నెలకొన్న అపోహలు అలానే కొనసాగితే.. రెండు వారాల్లో ఐదు శాతం మంది వ్యాక్సిన్ తీసుకోవడం అసాధ్యం అని నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే వ్యాక్సినేషన్ విషయంలో బైడెన్‌కు చేదు అనుభవం తప్పదని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-06-20T01:39:28+05:30 IST