ప్రజాస్వామ్యాన్ని రక్షించే కంచెను బలోపేతం చేయాలి : జో బైడెన్

ABN , First Publish Date - 2021-12-11T22:24:34+05:30 IST

దాడులు చేసే నియంతృత్వ శక్తులను ఎదిరించి నిలిచే

ప్రజాస్వామ్యాన్ని రక్షించే కంచెను బలోపేతం చేయాలి : జో బైడెన్

వాషింగ్టన్ : దాడులు చేసే నియంతృత్వ శక్తులను ఎదిరించి నిలిచే శక్తిని ఇచ్చే ప్రజాస్వామ్య రక్షణ కంచెను మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత అందరికీ ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఓటు హక్కుకు సంబంధించిన చట్టాలు చేయడం ద్వారా తాను అమెరికాలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. రెండు రోజులపాటు జరిగిన ‘సమ్మిట్ ఫర్ డెమొక్రసీ’ శుక్రవారం ముగిసింది. ఈ సదస్సుకు 100 దేశాలను ఆహ్వానించగా 89 దేశాలు, యూరోపియన్ యూనియన్ పాల్గొన్నాయి. 


బైడెన్ మాట్లాడుతూ, ‘సమ్మిట్ ఫర్ డెమొక్రసీ’ సదస్సును వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామని, వివిధ దేశాల నేతలందరూ వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు వీలుగా దీనిని నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వాధినేతలుగా మనకు బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. ఆ బాధ్యతలను వివరిస్తూ, ప్రజల మాటను వినడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించే కంచెను కాపాడటం, సంస్కరణలను పారదర్శకంగా అమలు చేయడం, జవాబుదారీతనంగల ప్రభుత్వాలు, ప్రభుత్వ పరిపాలన, నియంతృత్వ శక్తుల దాడులకు వ్యతిరేకంగా గట్టిగా నిలదొక్కుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటి బాధ్యతలు దేశాధినేతలకు ఉన్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లను, వాటిని ఎదుర్కొని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు గల అవకాశాలను ఈ రెండు రోజుల సదస్సులో ప్రభుత్వాధినేతలు చెప్పారని తెలిపారు. మీడియా స్వేచ్ఛను పరిరక్షించడం చాలా ముఖ్యమైన విషయమని ఈ సమావేశం స్పష్టం చేసిందన్నారు. మహిళలు, బాలికల హోదాను పెంచడం ప్రజాస్వామ్యానికి పెట్టుబడివంటిదని పేర్కొన్నారు. మానవ హక్కుల మద్దతుదారులను సాధికారులను చేయడంపై ఈ సదస్సులో దృష్టి పెట్టామన్నారు. ప్రభుత్వాలు ప్రజలను ఉద్ధరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, వారిని అణగదొక్కడానికి కాదని చెప్తూ, ఈ అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టిందని చెప్పారు. చైనాలో వీఘర్ ముస్లింలపై నిఘా పెట్టడం కోసం టెక్నాలజీని వాడుతుండటాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.


ఈ సదస్సులో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ సదస్సుకు హాజరయ్యేందుకు తిరస్కరించారు. 


Updated Date - 2021-12-11T22:24:34+05:30 IST