బైడెన్ బృందంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు!

ABN , First Publish Date - 2021-03-06T17:21:33+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ తన పరిపాలన విభాగంలో ఇప్పటికే 55 మందికి పైగా భారతీయ అమెరికన్లకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే.

బైడెన్ బృందంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ తన పరిపాలన విభాగంలో ఇప్పటికే 55 మందికి పైగా భారతీయ అమెరికన్లకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. తాజా మరో ఇద్దరు భారత​ సంతతి వ్యక్తులకు బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. నేర-న్యాయ విషయాల్లో అధ్యక్షుని ప్రత్యేక సలహాదారుగా చిరాగ్​ బైన్స్, లేబర్ అండ్ వర్కర్స్ విషయాల్లో ప్రత్యేక సలహాదారుగా ప్రొనీతా గుప్తాలు నియమితులయ్యారు. శుక్రవారం అధ్యక్ష భవనం ఈ ఇద్దరి నియమాకాలను ధృవీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. తాజాగా వైట్‌హౌస్ కొవిడ్ రెస్పాన్స్ టీమ్, డొమెస్టిక్ క్లైమేట్ పాలసీ ఆఫీస్, డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ వంటి విభాగాల్లో 20 మందికిపైగా అదనపు సిబ్బందిని నియమించారు. దీనిలో భాగంగా బైన్స్​, గుప్తాలకు కీలక బాధ్యతలు దక్కాయి. 


కాగా, బైన్స్ 2010 నుంచి 2017 వరకు న్యాయశాఖలోని పౌర హక్కుల విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పౌర హక్కుల నేరాల ప్రాసిక్యూటర్‌గా, అసిస్టెంట్ అటార్నీ జనరల్‌కు సీనియర్ న్యాయవాదిగా ఆయన విధులు నిర్వహించారు. ఇక గుప్తా.. సెంటర్ ఫర్ లా అండ్ సోషల్ పాలసీ (సీఎల్ఏఎస్‌పీ) జాబ్ క్వాలిటీ డైరెక్టర్‌గా పని చేశారు. అలాగే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్‌లో ఉమెన్స్ బ్యూరో డైరెక్టర్ కూడా ఉన్నారు. 

Updated Date - 2021-03-06T17:21:33+05:30 IST