బైడెన్ బృందంలో మరో భారతీయురాలికి కీలక బాధ్యతలు

ABN , First Publish Date - 2021-01-16T17:32:05+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలో మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు దక్కాయి.

బైడెన్ బృందంలో మరో భారతీయురాలికి కీలక బాధ్యతలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలో మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు దక్కాయి. కశ్మీర్‌‌కు చెందిన సమీరా ఫాజిలికి నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్(ఎన్‌ఈసీ)లో చోటు దక్కింది. సమీరాను బైడెన్ ఎన్‌ఈసీ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు. గురువారం బైడెన్‌ బృందం ఈ నియమకానికి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఇప్పటికే కశ్మీర్‌కే చెందిన ఈషా షా కూడా వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ డిజిటల్‌ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్‌గా కీలక బాధ్యతలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కశ్మీరీ సమీరా కూడా ఈ జాబితాలో చేరారు. న్యూయార్క్‌లోని విలియమ్స్‌విల్లేలో మహమ్మద్ యూసఫ్‌, రఫీకా ఫాజిల దంపతులకు సమీరా జన్మించారు. హార్వర్డ్‌ కళాశాల, యేల్‌ లా స్కూల్‌ నుంచి ఉన్నత విద్య పూర్తిచేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో డొమెస్టిక్‌ ఫైనాన్స్‌, విదేశీ వ్యవహారాల సీనియర్‌ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి జార్జియాలో ఉంటున్నారు. 


ఇదిలాఉంటే.. ఇప్పటికే బైడెన్ కేబినేట్‌లో డజన్‌కు పైగా భారత సంతతి వ్యక్తులకు చోటు లభించిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్‌తో పాటు బైడెన్ బృందంలో చోటు దక్కిన వారిలో నీరా టాండన్(డైరెక్టర్ వైట్ హౌస్ ఆఫీస్-మేనేజ్‌మెంట్), డా. వివేక్ మూర్తి(యూఎస్ సర్జన్ జనరల్), వనితా గుప్తా(అటార్నీ జనరల్), లైషా షా(వైట్ హౌస్ ఆఫీస్ డిజిటల్ స్ట్రాటజీ), సబ్రినా సింగ్(డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ), గౌతమ్ రాఘవన్(ప్రెసిడెన్షియల్ పర్సనల్ డిప్యూటీ డైరెక్టర్), భరత్ రామమూర్తి(నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్), వినయ్ రెడ్డి(డైరెక్టర్ ఆఫ్ స్పీచ్ రైటింగ్), తరుణ్ చాబ్రా(సీనియర్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీ), సుమోనా గుహా(సీనియర్ డైరెక్టర్ సౌత్ ఏషియా- నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్), వేదాంత్ పటేల్(అసిస్టెంట్ ప్రెస్ సెక్రెటరీ), శాంతి కలత్తిల్(డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్ కో ఆర్డినేటర్).

Updated Date - 2021-01-16T17:32:05+05:30 IST