పాతిక శాతం పెరిగిన ఉద్యోగ నియామకాలు...

ABN , First Publish Date - 2021-12-03T21:35:41+05:30 IST

నవంబరు నెలలో ఉద్యోగ నియామకాలు భారీగా పెరిగాయి. పండుగ సీజన్ నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు సగటున 25 శాతం పెరిగినట్లు జాబ్ పోర్టల్ ‘నౌకరీ డాట్ కామ్’ వెల్లడించింది. నవంబరు నెలకు సంబంధించిన నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో 2173 వద్ద నియామకాల పాయింట్లు ట్రెండ్ అవుతున్నాయి.

పాతిక శాతం పెరిగిన ఉద్యోగ నియామకాలు...

హైదరాబాద్ : నవంబరు నెలలో ఉద్యోగ నియామకాలు భారీగా పెరిగాయి. పండుగ సీజన్ నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు సగటున 25 శాతం పెరిగినట్లు జాబ్ పోర్టల్ ‘నౌకరీ డాట్ కామ్’ వెల్లడించింది. నవంబరు నెలకు సంబంధించిన నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో 2173 వద్ద నియామకాల పాయింట్లు ట్రెండ్ అవుతున్నాయి. అదే నియామకాల పాయింట్లు... గతేడాది నవంబరు నెలలో 1727 గా ఉందని వెల్లడించింది. నివేదిక ప్రకారం గతేడాది నవంబరు నెలతో పోలిస్తే ఈ ఏడాది నవంబరు  నెలలో రిటైల్ రంగంలో నియామకాలు 47 శాతం పెరగడం గమనార్హం. 


హాస్పిటాలిటీ, పర్యాటక రంగంలో 58 శాతం, విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో విద్యారంగంలో 54 శాతం మేర నియామకాలు పెరిగాయి. బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ రంగాల్లో 30 శాతం, ఐటీ రంగంలో 50 శాతం పెరిగాయి. ఆహార ఉత్పత్తుల రంగంలో 6 శాతం, ఆరోగ్యరంగంలో 3 శాతం చొప్పున నియామకాలు పెరిగాయి. కాగా... మెట్రో నగరాల్లో నియామకాల జోరు కొనసాగుతోంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో నియామకాలు స్వల్పంగా ఉన్నాయి. నగరాలవారీగా చూస్తే బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 49 శాతం, హైదరాబాద్, పుణే నగరాల్లో 47 శాతం చొప్పున, ముంబైలో 36 శాతం, చెన్నైలో 35 శాతం, ఢిల్లీలో 34 శాతం, కోల్‌కతాలో 23 శాతం చొప్పున నియామకాలు పెరిగాయి. ద్వితీయశ్రేణి నగరాల్లో పదహారు శాతం మేర నియామకాలు పెరిగాయి. నాన్-మెట్రో నగరాల్లో అత్యధికంగా 61 శాతం నియామకాలతో అహ్మదాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. కోయంబత్తూరు,,, 28 శాతం నియామకాలతో ఉంది. వృత్తిపరమైన అనుభవమున్న వ్యక్తులకు సంబంధించి నియామకాలు జోరుగా సాగాయి. ఇక... 8-12 ఏళ్ల వృత్తి అనుభవమున్న వ్యక్తుల నియామకాలు అత్యధికంగా 37 శాతం, 4-7 ఏళ్ల అనుభవమున్న వారి నియామకాలు 30 శాతం, మూడేళ్లలోపు అనుభవమున్నవారి నియామకాలు 27 శాతం, 16 ఏళ్ల వరకు అనుభవమున్నవారి నియామకాలు 26 శాతం, పదహారేళ్లకు మించి అనుభవమున్నవారి నియామకాలు 20 శాతం మేర పెరిగాయి. 


ఇదిలా ఉంటే... అంతర్జాతీయంగా కూడా పేరోల్స్ పెరిగినట్లు ఏటీపీ నివేదిక పేర్కొంది. అమెరికాలో ప్రైవేటు హైరింగ్ గత నెలలో 5.34 లక్షల మేర పెరిగాయని, అంతకుముందు డౌజోన్స్ అంచనా వేసిన ఐదు లక్షల కంటే ఇది ఎక్కువ. అయితే అక్టోబరు నెలకు సంబంధించి 5.70 లక్షలకంటే మాత్రం ఇది కాస్త తక్కువే. ఇటీవలి కాలంలో... ఆర్థిక రికవరీ కనిపిస్తూండడంతో, హాస్పిటాలిటీ రంగం ఒకస్థాయిలో పుంజుకుంది. ఈ రంగంలో ఉండే బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ళు తదితర వ్యాపారాల్లో 1.36 లక్షల నియామకాలు పెరిగాయి. ప్రొఫెషనల్, బిజినెస్ సేవల్లో 1.10 లక్షలు, రవాణా, యుటిలిటీస్ రంగంలో 78 వేలు, విద్య, ఆరోగ్య రంగాల్లో  55 వేల చొప్పున నియామకాలు పెరిగాయి.

Updated Date - 2021-12-03T21:35:41+05:30 IST