ఎస్సీ కార్పొరేషన్‌లో ఉద్యోగాల మాయ

ABN , First Publish Date - 2020-07-05T10:42:36+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌లో ఎస్సీలకే ఉద్యోగాల్లో ప్రాధాన్యమివ్వాలని కేంద్ర సామాజిక, సాంఘిక మంత్రిత్వ శాఖ 1978లో ఒక జీవో జారీ చేసింది.

ఎస్సీ కార్పొరేషన్‌లో ఉద్యోగాల మాయ

 కాకినాడ (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ కార్పొరేషన్‌లో ఎస్సీలకే ఉద్యోగాల్లో ప్రాధాన్యమివ్వాలని కేంద్ర సామాజిక, సాంఘిక మంత్రిత్వ శాఖ 1978లో ఒక జీవో జారీ చేసింది. జీవో మేరకు అన్ని రాష్ర్టాల్లో ఉన్న ఎస్సీ కార్పొ రేషన్‌లలో నిబంధనలకనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేవారు. అయితే తగిన అర్హతలు లేకుండా నియామకాల్లో ఎస్సీలు అనర్హులుగా ఉంటే, వారి స్థానంలో ఎస్టీలకు ప్రయార్టీ ఇవ్వాలని జీవో స్పష్టం చేస్తోంది. కానీ ఈ జీవో ఎప్పుడూ జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌లో అమలవ్వలేదు.


అయితే ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజీ ద్వారా జిల్లాలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో రోస్టర్‌ మేరకు ఇతర వర్గీయులకు ఈ శాఖలో పోస్టింగ్‌లు అప్పట్లో దక్కాయి. 1990 నుంచి ఈ శాఖలో రెగ్యులర్‌ ఉద్యోగాలు నిలిపివేశారు. అప్పటి నుంచి ఇక్కడ ఏర్పడిన ఖాళీ పోస్టుల్లో ఇతర శాఖల నుంచి కొందరు ఉద్యోగులు ఫారిన్‌ సర్వీస్‌లో వచ్చి పనిచేసి, పిరియడ్‌ ముగియగానే మాతృశాఖకు వెళ్లిపోయేవారు. దీంతో 1989, తర్వాత 1993లో కంటింజెంట్‌లో చేరిన నలుగురు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఈ శాఖలో ఫోకల్‌ స్థానాల్లో ఆయా సీట్లకు అతుక్కుపోయారు. వీరిలో ఇద్దరు బీసీ, ఒకరు ఓసీ, మరొ కరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు.


అర్హత మేరకు ఎస్సీ ఉద్యోగిని ఇక్కడ కొనసాగించి, మిగిలిన ముగ్గురిని తప్పించాల్సిన ఈ శాఖ అధికారులు మిన్నకుండిపోయారు. తదనుగుణంగా ఇక్కడ పనిచేసిన పలువురు రెగ్యులర్‌ ఉద్యోగులు విరమణ చేయడంతో ఈ ముగ్గురు ఫోకల్‌ స్థానాల్లో చక్రం తిప్పుతున్నారు. కానీ ఈ నలుగురి నేచర్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్‌ గమనిస్తే ఎటువంటి ఉత్తర్వులు లేకుండా కంటింజెంట్‌ ఉద్యోగులుగా చేరారు. ఇప్పుడు తాము కంటింజెంట్‌ కాదని, టైం స్కేల్‌ ఉద్యోగులమని వాదిస్తున్నారు. ఈ శాఖలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌, రెగ్యులర్‌, ఫారిన్‌ సర్వీస్‌, అనధికారిక టైంస్కేల్‌ పొందిన ఉద్యోగుల మధ్య చాలాకాలం నుంచి ఆధిపత్య పోరు జరుగుతోంది. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 

Updated Date - 2020-07-05T10:42:36+05:30 IST