విద్యా శాఖలో..నకి‘లీలలు’

ABN , First Publish Date - 2020-10-12T06:08:07+05:30 IST

విద్యా శాఖలో దివ్యాంగుల కోటా కింద మంజూరైన ఉపాధ్యాయ పోస్టులను, నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి కొందరు

విద్యా శాఖలో..నకి‘లీలలు’

బోగస్‌ ధ్రువపత్రాలు సమర్పించిన కేటుగాళ్లు

దివ్యాంగుల కోటా కింద ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు

ఏళ్లు గడుస్తున్నా కొనసాగుతున్న విచారణ

నాన్చుడు ధోరణిలో విద్యా శాఖ

తప్పుదోవ పట్టించేందుకు కొందరికి ముడుపులు 


గరు బ్రహ్మ.. గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర.. అన్నారు పెద్దలు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఆ గురువులే, వారి స్వలాభం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అప్పనంగా ఉద్యోగం సంపాధించడం కోసం అక్రమాలకు పాల్పడ్డారు. ఏకంగా దివ్యాంగుల కోట కింద మంజూరైన ఉపాధ్యాయ పోస్టులను నకిలీ ధువరప్రతాలు సమర్పించి ఎగరేసుకుపోయారు.. 


మహబూబ్‌నగర్‌ (విద్యావిభాగం), అక్టోబరు 11 : విద్యా శాఖలో దివ్యాంగుల కోటా కింద మంజూరైన ఉపాధ్యాయ పోస్టులను, నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి కొందరు అక్రమార్కులు టీచర్లుగా చలామణి అవుతున్నారు. ఉమ్మడి పాలమురు జిల్లాలో నిర్వహించిన డీఎస్సీ-2000, 2001, 2003, 2004, 2008 లతోపాటు పలు డీఎస్సీలలో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి దివ్యాంగుల కోటా కింద ఉపాధ్యాయులుగా ఉద్యోగాల్లో చేరారు. అప్పటి 64 మండలలా పాలమూరు జిల్లాలో మొత్తం 872 మంది నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు 2017లో గుర్తించిన అధికారులు, వీరి ధ్రువపత్రాలను పరిశీలించాలని అప్పటి కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో డీఈవో అన్ని మండలాలకు చెందిన ఎంఈవోలను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులందరినీ మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలని అప్పట్లో ఆదేశించారు. అయితే, ఇందులో సగం మంది టీచర్లు పరీక్షలు చేయించుకోలేదు. పరీక్షలు చేయించుకున్న వారిలో కొందరు నకిలీలు అని తేలడంతో, వారిపై అప్పట్లో విచారణ చేపట్టారు. కానీ, ఇంత వరకు ఆ విచారణ సంగతి తేల్చలేదు. వారు మాత్రం ఉద్యోగాల్లో కొనసాగుతూనే ఉన్నారు.


నకిలీ ఉపాధ్యాయుల వ్యవహారం ఏళ్లు గడుస్తున్న విచారణ మాత్రం పూర్తి కావడం లేదు. మొత్తం 872 మంది నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించగా, అందులో కేవలం 29 మంది మాత్రమే పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 17 మందిని రాష్ట్ర మెడికల్‌ బోర్డుకు పంపించి పరీక్షలు చేయించారు. వీరికి బోర్డు నుంచి, పీహెచ్‌సీ నుంచి క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. వీరి ధువరత్రాలు అసలైనవని తేల్చారు. మిగిలిన 12 మందికి నకిలీ ధ్రువపత్రాలని తేల్చారు. కానీ ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇందులో ఇద్దరు ఉపాధ్యాయులు ఇప్పటికే పదవీ విరమణ పొందినట్లు తెలిసింది. కాగా, విచారణ చేయాల్సిన అధికారులు మాత్రం సదరు నకిలీ వ్యక్తులతో ముడుపులు తీసుకొని, విచారణలో సరైన నివేదికలు ఇవ్వలేదని సమాచారం.


తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో కూడా..

ఉమ్మడి జిల్లాలోని పాత 64 మండలాలకు సంబంధించిన వారు 2000 డీఎస్సీ నుంచి 2018 వరకు నిర్వహించిన డీఎస్సీలలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, ఉద్యోగాలు పొందినట్లు తెలిసింది. వీరికి ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ-ఏ, బీసీ-బీ ధ్రువపత్రాలు ఇచ్చేందుకు రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు కూడా సహకరించినట్లు సమాచారం. ఇందు కోసం వారికి భారీ స్థాయిలో ముడుపులు కూడా అందినట్లు తెలిసింది.


రంగారెడ్డి జిల్లా తరహాలో విచారణ చేయాలి

నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి టీచర్‌ ఉద్యోగాలు పొందిన వారిపై 2017లో రంగారెడ్డి జిల్లా అధికారులు కొరడా ఝళిపించారు. విచారణ చేపట్టి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన వారిని గురించారు. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో పాలమూరు జిల్లాలో నకిలీ టీచర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరు చెవుడు, గుడ్డి, అంగవైకల్యంతో పాటు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందారు. ఇంతటితోనే ఆగకుండా పదోన్నతులలో కూడా వీటినే ఉపయోగించారు. బదిలీల సమయంలో కూడా వీటిని వినియోగించుకొని అర్హులైన వారికి అన్యాయం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నకిలీ టీచర్ల ఎరివేత కోసం నిర్వహించిన విచారణ తమహాలోనే పాలమూరులో విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-10-12T06:08:07+05:30 IST